Home సంపాదకీయం పేదల భారతం

పేదల భారతం

మేం అధికారంలోకి వస్తే దళితుల అభ్యున్నతికి కృషి చేస్తాం… మేం పగ్గాలు చేపడితే మైనార్టీలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తాం… దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా కూడా అన్ని పార్టీల నోట ఇదే మాట. కులాల గోడలు… మతాల విభజనలు… ఏ పార్టీ అధికారంలో వున్నా కులాల పరంగా ఓట్ల బ్యాంకులను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలే! మతాలకు తాయిలాలిచ్చి లోబరచుకునే ఎత్తుగడలే!!

ఏడు దశాబ్దాలుగా కేంద్రంలో పరిపాలన సాగించిన ప్రభుత్వాలు మరచిపోయిన అతిపెద్ద విషయం ఏంటంటే… ఈ దేశంలో రెండే కులాలు మిగిలాయని. ఒకటి ధనికుల కులం, రెండోది పేదల కులం అని. ధనికులు అన్ని కులాలు, అన్ని మతాలలో వున్నారని. అలాగే పేదలు కూడా అన్ని కులాలు, అన్ని మతాలలో వున్నారని. ఈ విషయాన్ని ఏ ప్రభుత్వం పసిగట్టలేదు.

అగ్రవర్ణాల ప్రజలలోనూ పేదలున్నారు. వారికి కులం కూడు పెట్టడం లేదు. అగ్రవర్ణం అన్నది వారి బ్రతుకుకు శాపం కారాదు. కావాలంటే మతాన్ని మార్చుకోవడానికి అవకాశమిచ్చినట్లే మా కులాన్ని మార్చుకోవడానికి అవకాశమివ్వండి… ఎస్సీలుగానో, ఎస్టీలుగానో మారుతాం… కనీసం ఆ విధంగానైనా బ్రతుకుతాం అని దశాబ్దాల కాలంగా మొరపెట్టు కుంటున్నారు. చదువుల్లో చూస్తే వందకు 35 మార్కులు వచ్చిన వాళ్ళకు సీట్లొస్తాయి, ఉద్యోగా లొస్తాయి. వందకు 90మార్కులు తెచ్చుకున్న వాడికి మాత్రం సీట్లు లేవు, ఉద్యోగాలు రావు. కోటీశ్వరులైతే తమ పిల్లలకు సీట్లు కొంటారు. లక్షలు పోసి

ఉద్యోగాలు కొంటారు. ఈ రెంటికి చెడిన రేవడి వంటివాడే అగ్రవర్ణ పేదోడు. వీడికి రిజర్వేషన్లు వుండవు, అలాగని కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదువుకొనడానికి కోట్లు వుండవు. ఇన్నేళ్లుగా ఇన్ని దశాబ్దాలుగా వీరి బ్రతుకులే అటు ఇటు కాకుండా నలుగుతూ వచ్చాయి.

ఇన్నేళ్లకు అగ్రవర్ణాలలోని పేదల గురించి ఆలోచించే ప్రభుత్వమొకటి కేంద్రంలో వుందనే ధైర్యం వచ్చింది. జనరల్‌ కేటగిరిలోని పేదలకు విద్య, ఉపాధి అవకాశాలలో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు కల్పించిన రిజర్వేషన్‌లను కదిలించకుండానే జనరల్‌ కేటగిరి పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాకపోతే దీనిని అమలు చేయడానికి 15, 16 అధికరణల ద్వారా చట్టసవరణలు చేయాల్సి వుంది.

భారత రాజ్యాంగంలో కేవలం సామాజిక వెనుకబాటును పరిగణనలోకి తీసుకునే రిజర్వేషన్లు పొందుపరిచారు. మతాల పరంగా గాని, ఆర్ధిక వెనుకబాటు తనం కారణంగా గాని ఇంతవరకు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియకు రాజ్యాంగ సవరణలు చేయలేదు. రిజర్వేషన్‌ల కోటా 50శాతానికి మించకూడదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పునాధారంగా చేసుకుని ఎవరో ఒకరు మళ్ళీ సుప్రీంకోర్టుకెక్కినా ఎక్కొచ్చు. కేంద్రం ప్రతిపాదన అమలైతే రిజర్వేషన్‌ల కోటా 60శాతానికి పెరిగి, ఓపెన్‌ కేటగిరిలో 40శాతం మిగులుతుంది. అయితే 10శాతం కోటాలోకి అన్ని మతాలలోని పేదలు చేరుతారు కాబట్టి ఎవరూ దీనిని వ్యతిరేకించకపోవచ్చు.

కాకపోతే 1991లోనే పి.వి.నరసింహరావు ప్రభుత్వంలోనే అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించారు. అయితే సుప్రీం కోర్టు దీనిని కొట్టేసింది. రిజర్వేషన్‌ కోటా 50శాతం మించడానికి వీల్లేదని చెప్పింది. అప్పటినుండి ఏ ప్రభుత్వం రిజర్వేషన్‌ల జోలికెళ్లలేదు. కాకపోతే అగ్రవర్ణ పేదలలో మాత్రం విద్య, ఉపాధి అవకాశాలలో తమకు అన్యాయం జరుగుతుందనే ఆవేదన మాత్రం వుంది.

గత కొన్నేళ్లుగా ఆయా రాష్ట్రాలలో కొన్ని అగ్ర వర్ణాలు తమకూ రిజర్వేషన్‌లు కావాలని పోరాడు తున్నాయి. ఆంధ్రాలో కాపులు, మహారాష్ట్రలో మరాఠాలు, రాజస్థాన్‌లో జాట్‌లు, గుజరాత్‌లో పటేల్‌లు ఉద్యమిస్తుండడం చూస్తూనే వున్నాం. వీళ్లంతా ఆయా రాష్ట్రాలలో అగ్రవర్ణాల ప్రజలే!

అయితే ఏ కులానికి ప్రత్యేకంగా రిజర్వేషన్‌లు అమలు చేసినా అది వివాదాస్పదమే అవుతుంది. రిజర్వేషన్‌ల పరిధిలోకి ఇంకా కొత్త కులాలను చేర్చడం పద్ధతి కాదు. రిజర్వేషన్ల ద్వారా ఏదన్నా అవకాశం ఇవ్వదలిస్తే అది కేవలం ఆర్ధికంగా వెనుకబడినవారికి మాత్రమే ఇవ్వాలి. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేసింది.

ఆర్ధికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్‌లు సాధ్యం కాదని, రాజ్యాంగంలో అది లేదని, సుప్రీంకోర్టు అందుకు ఒప్పుకోదని అప్పుడే కొందరు మేధావులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాజ్యాంగం వ్రాసుకున్నదెవరు? సుప్రీం కోర్టు జడ్జిలకు జీతాలిచ్చేదెవరు? ఈ రెండు వ్యవస్థలు కూడా దేశ ప్రజల మంచి చెడ్డలు చూసుకోవడానికేగా! అగ్రవర్ణాలలో పేదవాళ్ళకు రిజర్వేషన్‌లు ఇవ్వడం తప్పు కాదు. 70ఏళ్ల పాటు వాళ్ళకు అన్యాయం జరిగింది. అగ్రవర్ణం అనే పేరుతో ఆకలి కూడా తీర్చుకోలేని స్థితిలో వున్న వాళ్ళకు దీని ద్వారానన్నా న్యాయం జరిగే ప్రక్రియను న్యాయస్థానం అడ్డుకుంటుందా? లేదా వాళ్ళకు రిజర్వేషన్లు వద్దని రాజ్యాంగం చెబుతుందా? పాలకులు తమకు అవసరమైన సందర్భాలలో ఎన్నోసార్లు ఇదే రాజ్యాంగానికి సవరణలు చేశారు. మరి అగ్రవర్ణాలలో వుండే పేదల కోసం ఇంకొక్కసారి సవరణ చేస్తే దేశంలో మునిగిపోయేదేమీ లేదు.

నరేంద్ర మోడీది అగ్రవర్ణ పేదలపై ప్రేమ కావచ్చు, లేదా రాజకీయ ఎత్తుగడలతో ప్రతిపక్షాలను చిత్తుచేసే ప్రయత్నం కావచ్చు. కాని, ఈరోజు కేంద్రం తీసుకున్న నిర్ణయం కులం ముసుగులో ఆర్ధిక వివక్షకు గురైన ఎన్నో లక్షల కుటుంబాలలో ఆశలు రేకెత్తించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here