Home జిల్లా వార్తలు పివిఆర్ చేతికి.. మాగుంటోళ్ళ హాళ్ళు

పివిఆర్ చేతికి.. మాగుంటోళ్ళ హాళ్ళు

మాగుంట కుటుంబం అంటే ఒక్క నెల్లూరుజిల్లాలోనే కాదు, భారతదేశంలోనే ప్రాముఖ్యత కలిగిన కుటుంబాలలో ఓ కుటుంబం. 1991లో మాగుంట సుబ్బరామరెడ్డి రాజకీయ అరంగేట్రం చేసే వరకూ ఈ కుటుంబం మూడు హాలోళ్ళుగానే నెల్లూరీయులకి పరిచయం. మూడుహాళ్ళ తర్వాతే మాగుంట కుటుంబం పేరు ప్రజల్లోకి వచ్చింది. తమ తండ్రి మాగుంట రాఘవరెడ్డి పేర రాఘవ సినీ కాంప్లెక్స్‌ అని నిర్మించి ఆ ప్రాంగణంలో కృష్ణ, కావేరి, కళ్యాణి అనే సినిమాహాళ్ళను ప్రారంభించారు. రాష్ట్రంలోనే ఈ మూడుహాళ్ళు అప్పట్లో పెద్ద ఆకర్షణగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు.

తరువాత కాలంలో నెల్లూరులోని శేషమహల్‌, రంగమహల్‌, లీలామహల్‌, అలాగే చెన్నైలో వెంకటగిరి రాజాలకు చెందిన సత్యం సినిమాలను వీళ్ళు కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలో యువతరం వ్యాపార వ్యవహారాలు చూడడం ప్రారంభించాక మాగుంటోళ్ళ సినిమాహాళ్లు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. దాదాపు 10నగరాలలో సత్యం, ఎస్కేప్‌, ప్లాజో, ది సినిమా మరియు యస్‌2 పేర్లతో 76స్క్రీన్‌లు త్వరత్వరగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నెల్లూరులోని కృష్ణ, కావేరి, కళ్యాణిలు కూడా కొత్త హంగులు సమకూర్చుకుని యస్‌2 గా రూపాంతరం చెందాయి.

భారతదేశంలో ఇప్పటికే 53 నగరాల్లో 634 స్క్రీన్‌లు కలిగిన పి.వి.ఆర్‌ సినిమాస్‌ ఇప్పుడు మాగుంటోళ్ళ దగ్గర నుండి స్పై సినిమాస్‌లో 71.69 శాతాన్ని 633 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో నెల్లూరు మూడుహాళ్ళకు మినహాయింపు ఉంటుందా లేక అవి కూడా కలిపి కొన్నారా…? అన్న విషయం ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాము అమ్మగా మిగిలిన వాటాతో ఇప్పుడు మాగుంట కుటుంబం పి.వి.ఆర్‌కి భాగస్వామ్యులుగా మారిపోయారు. సినిమాహాళ్ళ ద్వారా సంచలనాలు సృష్టించిన మాగుంట కుటుంబం ఇప్పుడు అదే సినిమాహాళ్ళ ద్వారా భారతదేశమంతా విస్తరించడం నెల్లూరుకు గర్వకారణమే. అయితే నెల్లూరులోని మూడుహాళ్ళని మాత్రం మాగుంటోళ్ళ హాళ్ళగానే వుంచేస్తే బాగుంటుందనేది మాగుంట అభిమానుల కోరిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here