Home జిల్లా వార్తలు పాపానికి ప్రాయశ్చిత్తమా?

పాపానికి ప్రాయశ్చిత్తమా?

దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు విమర్శించొచ్చు, ఎర్రన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు, గార్లపాటి రామ్మోహన్‌ రావు, కేశినేని నాని, దేవినేని ఉమ… ప్రత్యర్థి పార్టీలోని వీళ్లే కాదు కాంగ్రెస్‌ పార్టీలో వున్న వి.హెచ్‌.హనుమంతురావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మధు యాష్కీ… ఇలాంటివాళ్ళు విమర్శించినా అర్ధముంది.

ఎందుకంటే ఒకే పార్టీలో వున్నప్పటికీ వారికి వై.యస్‌.తో పడేది కాదు. కాని వై.యస్‌. కుటుంబాన్ని ఆనం సోదరులు విమర్శించడం… అది కూడా అట్లా ఇట్లా కాదు… జగన్‌ను ఉరితీయాలి, జగన్‌ లాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదు… ఈ కొడుకును జయమ్మ ఎలా పెం చిందో… వంటి ఘాటు మాటలతో విమర్శించడమే చరిత్రలో మాయని మచ్చ. రాజకీయంగా పడకుంటే జగన్‌తో విభే దించవచ్చు, ఇంకో పార్టీలో వుండొచ్చు. కాని ఈరోజు ఎంత సరిదిద్దుకోవాలను కున్నా ఆనాడు మాట్లాడిన మాటలను చరిత్ర రికార్డుల నుండి తుడిపేయగలరా? ఎందుకంటే వై.యస్‌.తో ఆనం సోదరుల కున్న అనుబంధం అటువంటిది. వాళ్ళ మధ్య రాజకీయ సంబంధాలే కాదు స్నేహ సంబంధాలు అంతగా బలపడ్డాయి. రాష్ట్రంలో ఆనం సోదరులను అత్యంత ఎక్కువుగా నమ్మాడు వై.యస్‌. పదవుల కతీతంగా వాళ్ళ మధ్య బంధం కొన సాగింది. అలాంటి వై.యస్‌. కుటుంబం పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తించారు ఆనం సోదరులు. ఆ కుటుంబంపై అన రాని మాటలన్నారు. చేసిన తప్పుకు ప్రాయ శ్చితమో, జరిగిన పొరపాటును సరిదిద్దు కోవడమో… మొత్తానికి ఆనం రామనారా యణరెడ్డి ఈ నెల 2వ తేదీన విశాఖ జిల్లాలో జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరాడు. రామనారాయణ రెడ్డి పార్టీ మారుతాడని గత 4 నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరదించారు. ఇక నెల్లూరుజిల్లా వైసిపిలో ఆయన పాత్ర ఏంటి? ఎక్కడ నుండి పోటీ చేస్తాడు? ఆయన వల్ల పార్టీకి ఎంతవరకు లాభం? అన్నది భవిష్యత్‌ తేల్చాలి!

ఆనం చేరిక.. మేకపాటి కినుక…

ఆనం రామనారాయణరెడ్డి అడుగు పెట్టడంతోటే నెల్లూరుజిల్లా వైసిపిలో అలజడి మొదలైంది. ప్రశాంతంగా వున్న సరస్సులో రాయి వేసినట్లుగా పార్టీలో అలకలు, కలతలు మొదలయ్యాయి. ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరే కార్యక్రమానికి మేకపాటి కుటుంబం దూరంగా ఉండిపోయింది. ఆనం రాకతో వారిలో ఒకరికి సీటు పోతుందనే ప్రమాదం కూడా దీనికి కారణం. అలాగే ఆనం వస్తే తమ ఆధిపత్యం దెబ్బతింటుందనే అనుమానం కూడా వారిలో వుంది. కాబట్టే ఆనం రావడం వారికిష్టం లేదు. మరోపక్క వెంకటగిరికి నాలుగున్నరేళ్ళ నుండి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కూడా ఆనంను పార్టీలోకి తీసుకోవడం పట్ల కినువహించాడు. వెంకటగిరి సీటుపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని వున్నాడు. ఇప్పుడు ఆనం రూపంలో ఆయన సీటుకు ఎసరొచ్చేటట్లుండడంతో ఆయన అసంతృప్తికి లోనవుతున్నాడు. ఆనం అలా పార్టీలో అడుగుపెట్టాడో లేదో ఎప్పుడూ లేని విధంగా జిల్లా వైసిపిలో ఒక్కసారిగా అలకలు, అసంతృప్తులు బయటపడ్డం ఆందోళన కలిగించే విషయమే! జిల్లాలో ఆనం వల్ల పార్టీకి మేలు జరిగే మాటేమోగాని ఈ రూపంలో నష్టం జరిగేటట్లుండడం వైసిపి శ్రేణులను కలవరపరుస్తోంది!

సోషల్‌ మీడియాలో సెటైర్లు

విశాఖలో ఆనం రామనారాయణరెడ్డి అలా వైసిపిలో చేరాడో లేదో సోషల్‌ మీడియాలో సెటైర్లు హల్‌చల్‌ చేసాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిగా వున్నప్పుడు జగన్‌ను ఉరితీయాలి అంటూ ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్లతో వచ్చిన పత్రికల క్లిప్పింగ్‌లు సోషల్‌ మీడియాలో వీరవిహారం చేసాయి. కొందరైతే వైసిపిలో చేరడానికి ఆనంకు సిగ్గు లేకపోయినా చేర్చుకోవడానికి జగన్‌కు సిగ్గు లేదా అంటూ కామెంట్లు పెట్టడం కొసమెరుపు. ఇలా పోస్ట్‌లు పెట్టినవాళ్ళలో టీడీపీ వాళ్ళకంటే వైసిపి అభిమానులే ఎక్కువుగా వుండడం ఇంకో ప్రధానాంశం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here