Home సంపాదకీయం పాపం పండింది!

పాపం పండింది!

మన దేశంలో ఎప్పుడూ ఇంతే. ఆరంభశూరత్వం అనే మాటకు నిలువెత్తు నిదర్శనాలు మనవాళ్లు. అందులోనూ అధికార యంత్రాంగమైతే అలక్ష్యానికి మారుపేరు. ఎంతటి చిన్నపనికైనా రోజులు, నెలల తరబడి కాలయాపన చేస్తుండడం మనకు రివాజు. అది ఎంత ప్రమాదకరమైన విషయమైనా సరే, అత్యవసరమైనా సరే..అప్పటికప్పుడు హడావిడి, గందరగోళం ఉంటుందే తప్ప ఆ తర్వాత అంతా షరా మామూలే. ఒక్క హైదరాబాద్‌నే కాదు, దేశం మొత్తాన్ని భయభ్రాంతుల్ని చేసిన గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కు జంటపేలుళ్ళ కేసులో దోషుల్ని పట్టుకునే విషయంలో కూడా జరిగిందిదే. సంబంధిత దర్యాప్తు బృందం దోషుల్ని వెంటనే పట్టుకోగలిగి ఉంటే, వారిపై పటిష్టమైన సాక్ష్యాధారాలతో కేసులు పెట్టివుంటే న్యాయస్థానంలో తీర్పు ఎప్పుడో వచ్చి ఉండేది. కానీ, ఏళ్ళ తరబడి దర్యాప్తు బృందాలు కష్టించినా కేసులో ఆశించినంత పురోగతి సాధించలేకపోవడం, ఈ కేసులో ఇద్దరికి శిక్ష విధించినా మరో ఇద్దరి విషయంలో నేరాన్ని రుజువు చేయగలిగే సాక్ష్యాధారాలు లేకపోవడం, కేసు దర్యాప్తు బాగా జాప్యం కావడంతో పాత్రధారులు దొరికినా, అసలు సూత్రధారులైన భత్కల్‌ సోదరులు మాత్రం దేశం దాటి పాకిస్తాన్‌కు పరారైపోవడంతో ఈ దుర్ఘటనకు గురైన బాధితులకు ఆశించిన ఊరట లభించలేదనే చెప్పాలి.

ఉగ్రదాడులతో పవిత్ర భారతదేశ సమైక్యతను, సమగ్రతను సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న ఉగ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ సహించరాదు. హత్యాకాండలు, దారుణ మారణ కాండలతో అమాయ ప్రజల్ని బలితీసుకుంటూ, దేశాన్ని మరుభూమిగా మార్చాలన్నదే నరరూప రాక్షస్తులైన ఉగ్రవాదుల లక్ష్యం. పదకొండేళ్ళ క్రితం హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగిన ఈ ఘోరం వారి కుట్రలోని భాగమే. 2007లో గోకుల్‌చాట్‌, లుంబినీపార్కుల్లో ఉగ్రవాద ముష్కరమూకలు పేల్చిన బాంబుల ధాటికి 44 మంది అమాయకులు అసువులు బాశారు. మరో 68 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ కేసులో నిందితులైన అనిక్‌ షఫీద్‌ సయ్యద్‌, మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ అనే ఇద్దరికి ఉరిశిక్ష పడింది. రియాజ్‌ భత్కల్‌, అతని సోదరుడు ఇక్బాల్‌ భత్కల్‌లకు ఆశ్రయమిచ్చిన మరో నిందితునికి యావజ్జీవ శిక్ష పడింది. మరో ఇద్దరు నిందితులు నిర్దోషులని న్యాయస్థానం ప్రకటించింది. అయితే, ఎప్పటికైనా సరే.. ఈ దారుణ మారణకాండకు మూలకారకులైన భత్కల్‌ సోదరులను కూడా శిక్షించగలిగితేనే బాధితులకు పూర్తిస్థాయి ఊరట కలుగుతుందని వేరే చెప్పనక్కరలేదు.

ఈ జంట పేలుళ్ళ ఉదంతంలో బాధితులు ఎందరో నేటికీ నిత్యవేదన పడుతూనే ఉన్నారు. ఆప్తులను పోగొట్టుకుని అనాధలైనవారు కూడా ఉన్నారు. గాయాలపాలైనవారు అంగవైకల్యంతో బాధలు పడుతున్న వారు, వారిలో కదల్లేని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఎందరో అభాగ్యులు ఉన్నారు. ఉగ్రదాడులతో వారు భయకంపితులైపోయారు. ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు మహారాష్ట్రలోని పుణేలో ఈ దారుణానికి పన్నాగం పన్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుడుకు

ఉగ్రవాదులు కుట్రపన్నినా, అదృష్టవశాత్తు టైమర్‌ సరిగా పనిచేయకపోవడంతో అక్కడ పెనువిషాదం తప్పినట్లయింది. ఏదేమైనా, ఇన్నేళ్ళ తర్వాతనైనా ఈ జంటపేలుళ్ళ కేసు ఒక కొలిక్కి రావడం విశేషమే. అయితే, ఇప్పుడు దోషులిద్దరికీ పడిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. అక్కడ వచ్చే ఫలితాన్నిబట్టి రాజ్యాంగం ప్రకారం ఇతరత్రా మార్గాలు అందుబాటులో ఉండొచ్చు. చివరికి ఏం జరుగు తుందన్న విషయాన్నలా ఉంచితే, ఈ పేలుళ్ళ కేసు దర్యాప్తులో ఇంతకాలం జాప్యం జరిగిన తీరు మాత్రం మన పోలీసు యంత్రాంగం, లేదా దర్యాప్తు బృందాల పనితీరుకు నిదర్శనంగా అనిపిస్తుంది. ఈ దారుణాలకు పాల్పడిన ఉగ్రవాదులను వెంటనే వెంటాడి పట్టుకుని సాక్ష్యాధారాలతో సహా కేసులు పెట్టివుంటే న్యాయస్థానాలు అందుకు తగ్గ శిక్షను త్వరగా ఖరారు చేసేందుకు వీలయ్యేది.విచారణ కూడా సత్వరం ముగిసి తగు శిక్షలు ఎప్పుడో పడుండేవి. ఈ కేసులో అలా జరగకపోవడమే విచారకరం. అయితే, ఇక్కడొక విషయం మాత్రం స్పష్టం. అనేక కేసుల్లో సరైన సాక్ష్యాధారాలను సేకరించలేక, దోషుల్ని రుజువు చెయ్యడంలో దర్యాప్తు బృందాలు వైఫల్యం చెందుతూనే ఉన్నాయనే విమర్శ లున్నాయి. ఫలితంగా నేరం జరిగి ఏళ్ళు గడుస్తున్నా విచారణ మాత్రం ముగియడం లేదు. ఈ కేసులో దాదాపు పదకొండేళ్ళ తర్వాత నిందితులకు శిక్షలు పడ్డాయంటే ఎంత కాలయాపన జరిగిందో ఇట్టే తేటతెల్లమవుతోంది.

ఉగ్రవాదుల్ని మట్టికరిపించే ప్రత్యేకమైన గట్టి యంత్రాంగం, దేశవ్యాప్తంగా ఉగ్ర సమాచారాన్ని రాబట్టే ప్రత్యేక నిఘా వ్యవస్థలు లేకపోవడం, రాష్ట్రాల మధ్య, ఆయా శాఖల మధ్య ఈ విషయంలో అసలు సమన్వయం లేకపోవడం మన యంత్రాంగంలో ఒక పెద్ద లోపం. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని గొప్పలు ప్రకటించుకోవడం తప్ప, అందుకు తగ్గ పటిష్టమైన భద్రత, సరైన నిఘా వ్యవస్థలు మనదేశంలో లేకపోవడమే శాపం. ప్రజల్లో భయోత్పాతం సృష్టించడం, దారుణ మారణకాండలు సృష్టించి రాక్షసానందం పొందడం, తద్వారా తమ ఉనికిని చాటు కోవడం ఉగ్రవాదుల లక్షణం. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అలా పడగవిప్పిన ఆ విషనాగుల్ని అందరూ కలసి, అన్నిదేశాలూ సమాలోచనలతో సమన్వయంగా కదలి ఆ ఉగ్రవాద రాకాసులను సమూలంగా మట్టుపెట్టడమొక్కటే సరైన మార్గం.

ప్రపంచవ్యాప్తంగా మానవాళిపై, శాంతిసామరస్యాలపై భీకరంగా బుసలుకొడుతున్న ఉగ్రవాద విషసర్పాన్ని నిలువరించాలంటే అంతకు పదింతల పటిష్టమైన యంత్రాంగం కావాలి. ఒక్క క్షణమైనా ఏమరుపాటు ఉండని నిఘా వ్యవస్థ ఉండాలి. అలుపెరుగక శ్రమించే దర్యాప్తు బృందాలుండాలి. అందుకు వెంటనే కేంద్రం మరింత పటిష్టమైన వ్యూహంతో సత్వర కార్యాచరణకు దిగాలి. ఉగ్రవాద విషవృక్షాన్ని కూకటివేళ్ళతో సహా పెకలించివేసేదాకా విశ్రమించని పటిష్ట యంత్రాంగం ద్వారా మాత్రమే ఇది సాధ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here