Home రాష్ట్రీయ వార్తలు పవన్, చంద్రబాబు ఒకేమాట!

పవన్, చంద్రబాబు ఒకేమాట!

అటు తెలుగుదేశం అధినేత, ఇటు జనసేన అధినేత ఒకే మాట చెబుతున్నారు. అదేమంటే.. మోసపోయాం అని. మోడీని నమ్మి, బీజేపీ చేతిలో మోసపోయా.. అని చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబు నమ్మి మోసపోయా.. అని పవన్ కల్యాణ్ అంటున్నాడు. విశేషం ఏమిటంటే.. ఈ ఇద్దరు అపరమేధావులకూ తాము మోసపోయామనే అంశం నాలుగేళ్ల తర్వాత తెలిసింది.

గత ఎన్నికల నాడు నమ్మి మోసపోయామని.. మళ్లీ ఎన్నికలు వస్తున్న వేళ వీళ్లకు అర్థం అయ్యింది. తాము మోసపోయామని వీళ్లిద్దరూ ఇప్పుడు ప్రజలకు చెప్పుకుంటున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు తనకు మించిన మేధావి లేడని చెప్పుకుంటాడు. దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నేతను తనే అని చెప్పుకుంటాడు. తనకు మించినోడు ఈ దేశంలోనే లేడని అంటాడు.

ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు నాయుడుకు మించినోడు లేడు. అలాంటి చంద్రబాబు నాయుడు.. తను మోసపోయానని చెప్పుకోవడం ప్రహసనం. అది కూడా నాలుగేళ్ల తర్వాత ఇలా ప్రజల ముందుకు వచ్చి మోసపోయాను అని సానుభూతి ఆశిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతకీ బీజేపీ ఏ విషయంలో మోసం చేసిందో చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు.

ప్రత్యేకహోదా అంశమే అనుకుంటే.. బీజేపీతో కలిసి ఉన్నన్ని రోజులూ.. హోదా వద్దు అని అన్నది చంద్రబాబు నాయుడే కదా. హోదా సంజీవని కాదని, హోదాతో ఏమీ రాదని, హోదా అని ఎవరైనా అంటే జైలుకే అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇప్పుడు మాత్రం హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని చంద్రబాబు వాపోతున్నాడు.

ఒకసారి మోసపోయాను కాబట్టి.. మరోసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నాడు. అసలైన మోసం అంటే ఇది. ఇక చంద్రబాబును నమ్మి మోసపోయా అని పవన్ వాపోతున్నాడు. పవన్ కు కూడా ఈ విషయం చాలా లేటుగా అర్థమైంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ చంద్రబాబును తీవ్రంగా విమర్శించాడు. మరి గత ఎన్నికల ముందు బాబును నమ్మేటప్పుడు పవన్ కు తెలియదా.. ఈయన మోసం చేస్తాడని.

ఇక మూడు నాలుగేళ్ల పాటు అన్ని సందర్భాల్లోనూ బాబును సమర్థించినప్పుడు తెలియదా మోసం చేస్తున్నాడని? ఓవరాల్ గా తమ తప్పులు ప్రజలు మరిచిపోవాలని.. మోసపోయామని వీళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు అయితే ఈ టర్మ్ మోసపోయా, కాబట్టి ఇంకో ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. మరి బాబు మళ్లీ మోసపోడని నమ్మకం ఏంటబ్బా?

Gurava Reddy Atlanta

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here