Home రాష్ట్రీయ వార్తలు పవన్‌ పరువు పోగొట్టుకుంటాడా?

పవన్‌ పరువు పోగొట్టుకుంటాడా?

మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి రాజకీయాల్లోకి రాకపోయి వుంటే రాష్ట్రంలో ఆయన ఇమేజ్‌ ఈరోజుకీ చెక్కు చెదరకుండా వుండేది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే అత్యధిక ఇమేజ్‌ వున్న వ్యక్తిగా అలాగే నిలిచిపోయేవాడు. ఆయన రాజకీయ పార్టీ పెట్టడం, పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే 18 అసెంబ్లీ సీట్లకు పరిమితం కావడంతో చిరంజీవి ఇమేజ్‌ ఇంతేనా అన్నది ఒకటి తేలిపోయింది.

సినీ గ్లామర్‌ ఎక్కువుగా వున్నోళ్లు రాష్ట్రంలో వాతావరణం అనుకూలంగా వున్నప్పుడు అడుగుపెట్టాలి. సినీ గ్లామర్‌ను ఓట్లుగా మలుచుకోవాలి. ఎన్టీఆర్‌ మాదిరిగా ఒకే షాట్‌తో అధికారంలోకి రావాలి.

ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిన కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూశారు. ఎన్టీఆర్‌ ఆ ప్రత్యామ్నాయాన్ని భర్తీ చేశాడు. ఆయన సినీ గ్లామర్‌ కూడా పార్టీ గెలుపుకు ఉపయోగపడింది. కాని, చిరంజీవి రాష్ట్రంలో అటు అధికార కాంగ్రెస్‌, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం బలంగా వున్న కాలంలో పార్టీ పెట్టాడు. ఆ రెండింటి మధ్య సక్సెస్‌ కాలేకపోయాడు.

కనీసం చిరంజీవి పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనన్నా అన్ని సీట్లకు అభ్యర్థులను పెట్టాడు. 18సీట్లన్నా గెలిచాడు. ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు అంత సీన్‌ కూడా కనిపించడం లేదు. పార్టీ పెట్టాక 2014 ఎన్నికల్లోనే ఎక్కడా పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీలకు మద్దతునిచ్చాడు. అప్పుడే ఆయనకు సొంత సీన్‌ లేదని అర్ధమైపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం, బీజేపీలతో విభేదిస్తున్నట్లు నటిస్తున్నాడు. కాని ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా పదేపదే ప్రతిపక్ష వైకాపాపై విమర్శలు గుప్పిస్తున్నాడు. ఆయన వాలకం చూస్తుంటే… మరోసారి చంద్రబాబుతో డీల్‌ కుదిరిందేమోనన్న అనుమానాలు రాకమానవు.

ఇక ఆయన వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తాడా, లేక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటాడా అన్నది ఒక ప్రశ్న! ఎటు చూసినా ఈ ఎన్నికల తర్వాత ఆయన ఇమేజ్‌ పూర్తిగా డామేజీ కావడం ఖాయం. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం సీట్ల కోసం పోటీ పడ్డ నాయకులున్నారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ను నమ్మి జనసేన తరఫున పోటీ చేయడానికి సాహసించే నాయకులు లేరు. చేస్తే ఆయన అభిమానులు చేయాల్సిందే! జనసేనలో నాయకులు పెద్దగా చేరడం లేదు. పవన్‌ కళ్యాణ్‌ సొంత సామాజికవర్గానికి సంబంధించిన కాపు నాయకులు కూడా అటు తెలుగుదేశమో, లేదంటే ఇటు వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపో చూస్తున్నారు కాని, జనసేన వైపు చూడడం లేదు.

కర్నాటకలో మాదిరిగా ఇక్కడ కూడా తమకు పాతిక ముప్ఫై సీట్లొస్తే రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పుతామని గతంలోనే పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించి వున్నాడు. ఉభయగోదావరి జిల్లాల్లో పవన్‌కు ఎక్కువ సీట్లొస్తాయనే ప్రచారం ఒకటి వుండింది. ఇప్పుడు రాష్ట్రంలో వాతావరణం చూస్తుంటే పోటీ చేసి ఆయన పరువు పోగొట్టుకోవడం తప్పితే, సాదించేదేమీ లేదని, నాలుగైదు సీట్లు కూడా రావని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here