Home రాష్ట్రీయ వార్తలు పవనే.. ముంచబోతున్నాడా?

పవనే.. ముంచబోతున్నాడా?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రయోగించిన పాశుపతాస్త్రం జనసేన పవన్‌ కళ్యాణ్‌. 2014 ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ ద్వారా ప్రత్యక్ష లబ్ది పొందాడు చంద్రబాబు. పవన్‌ కళ్యాణ్‌ కూడా అరమరికలులేకుండా తెలుగుదేశానికే అప్పుడు ఓట్లేయమన్నాడు. ఆయనను అభిమానించేవాళ్ళు గాని, సొంత సామాజికవర్గం వాళ్ళు గాని తెలుగుదేశంకే మద్దతునిచ్చారు. కాబట్టే ఆ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు మొత్తం ఆరు జిల్లాల్లో తెలుగుదేశం స్వీప్‌ చేసి అధికారంలోకి రాగలిగింది.

ఈ ఐదేళ్లలో పరిణామాలు మారాయి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యాడు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఈ పరిస్థితులను వూహించే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు విడిపోయినట్లుగా నటించసాగారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన పవన్‌ పదేపదే ప్రతిపక్ష నేతను ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ పక్క టిడిపితో విభేదిస్తున్నట్లు నాటకాలాడుతూనే వైకాపాకు లబ్ది చేకూరకుండా చేయాలనుకున్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల ఉమ్మడి ప్రణాళిక ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసిపికి పోకుండా పవన్‌ కళ్యాణ్‌ జనసేనకు డైవర్ట్‌ చేయడం. ఈ ప్లాన్‌ అమలులో భాగంగానే జనసేన, బిఎస్పీ, వామపక్షాలతో కూటమి కట్టించాడు. ముఖ్యంగా కృష్ణ, ఉభయగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో జనసేన అభ్యర్థులను ఎక్కువుగా నిలబెట్టారు. అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తెలుగుదేశమన్నా గెలవాలి, లేదంటే జనసేన అభ్యర్థులన్నా గెలవాలి. ఎవరు గెలిచినా ఒకటే.! దీనికితోడు కొంత తెలుగుదేశం, వైసిపి ఓట్లు కూడా పవన్‌కళ్యాణ్‌కు పోతాయని, కొన్ని సీట్లలో అయినా జనసేన గెలుస్తుందని, తద్వారా వైసిపి గెలవకుండా చేయొచ్చని అంచనా వేశారు.

అయితే చంద్రబాబు అనుకున్నదొక్కటైతే, ఇప్పుడు జరుగుతున్నదొకటి. పవన్‌ విషయంలో ఏదైతే ఆశించారో అది పూర్తిగా రివర్స్‌ అయ్యింది. చంద్రబాబు, పవన్‌ వేర్వేరు కాదని, వీళ్ళిద్దరూ ఒకటేనన్న విషయం జనానికి అర్ధమైపోయింది. జనసేనకు ఓటేయడమంటే మళ్ళీ చంద్రబాబుకు మద్దతివ్వడమేనని పవన్‌ సానుభూతిపరులు తెలుసుకున్నారు. అందుకే చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళంతా పవన్‌ను నమ్ముకోకుండా వైసిపికి మద్దతుదారులుగా మారిపోయారు. గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇతర పార్టీల నుండి వైసిపిలోకి భారీ ఎత్తున వలసవచ్చిన నాయకులే దీనికి ఉదాహరణ. జనసేన ఈ ఎన్నికల్లో బలమైన తృతీయ శక్తిగా వుండుంటే చంద్రబాబు ఓటు చీలిక పాచిక పనిచేసుండేది. కాని, వీరి ప్లాన్‌ తెలిసి ఆ జిల్లాల్లో తెలుగుదేశాన్ని వ్యతిరేకించే నాయకులంతా కూడా ప్రత్యామ్నాయ శక్తిగా వున్న వైసిపిలో చేరిపోయారు. ఆ జిల్లాల్లో వైసిపి బలమైన శక్తిగా మారింది.

ఇప్పుడు పవన్‌తోటి ఎవరన్నా వున్నారు అంటే… అతను ఎక్కడ దూకమంటే అక్కడ దూకే అభిమానులే! ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికే ఓటెయ్యాలని చెబితే వాళ్ళు అలాగే వేస్తారు. పవన్‌ను చంద్రబాబు ఇంకోసారి ఈ విధంగా వాడుకుని వుండొచ్చు. సీక్రెట్‌ పొత్తు కాకుండా పబ్లిక్‌గానే పొత్తుపెట్టుకుని వున్నా అభిమానుల ఓట్ల రూపంలో కొంత ఉపయోగం వుండేది. కాని, ఇప్పుడు పవన్‌ మూలంగా చీలేది ఆయన అభిమానుల ఓట్లే… దీనివల్ల తెలుగుదేశానికి నష్టమేగాని లాభం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here