Home సంపాదకీయం పరువా? ప్రాణమా?

పరువా? ప్రాణమా?

ప్రేమ… అక్షరాలు రెండే! దీని శక్తి అనంతం. ప్రాణం తీస్తుంది, ప్రాణం పోస్తుంది, అవసరమైతే ప్రాణం ఇస్తుంది. ప్రపంచాన్ని నడిపే అద్భుత శక్తి ప్రేమ. బిడ్డ మీద తల్లికి, చెల్లి మీద అక్కకు, భర్త మీద భార్యకు, తమ్ముడి మీద అన్నకు… ఒక్క మనుషుల మధ్యనేనా? పశువులు, పక్షులు… ఈ సృష్టిలో సమస్త జీవజాలంలోనూ ప్రేమ ఇమిడి వుంది. ఒక జింక తన బిడ్డలను రక్షించుకోవడానికి పులులతో సైతం తెగించి పోరాడుతుంది. దానికి మనిషికి వున్నంత జ్ఞానం లేదు. స్వార్ధం లేదు. కేవలం బిడ్డ మీద ప్రేమ తప్ప! ప్రేమ అనే రెండక్షరాలు అంత పవిత్రమైనవి.

మరి ఆ ప్రేమను ఈ సమాజం ఏ కోణంలోకి మలిచింది? ‘ప్రేమ’ అనే రెండక్షరాలతోనే ఈరోజు భారతీయ చలనచిత్ర పరిశ్రమ నడుస్తోంది. గత ఏడెనిమిది దశాబ్దాలుగా భారతీయ చలన చిత్రానికి ‘ప్రేమ’ అనే రెండక్షరాలే కథా వస్తువు. అది బాలీవుడ్‌ అయినా, కోలీవుడ్‌ అయినా, టాలీవుడ్‌ అయినా… దేశంలోని ఏ భాషా చిత్రపరిశ్రమలో అయినా సరే ‘ప్రేమ’ కథాంశాలతోనే 90శాతం సినిమాలొచ్చి వుంటాయి. కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఈ ‘ప్రేమ’ అనే సబ్జెక్ట్‌ మీదే జరిగి వుంటుంది. ఏ సినిమాలో అయినా ఒక హీరో, ఒక హీరోయిన్‌… వారి మధ్య లవ్‌ సీన్‌లు కామన్‌ అయ్యాయి. ఈ సినిమాల ప్రభావమే సమాజంపై తీవ్రంగా వుంటోంది. ప్రేమే జీవితం, ప్రేమే శాశ్వతం, ప్రేమే ప్రాణం అనుకునే స్థాయికి యువత వెళుతోంది. మరి సినిమాల్లో చూపించినంత అందంగా ప్రేమ కథలు నిజజీవితంలోనూ విజయవంతమవుతాయా? ఒక తెలుగు సినిమా కథనే తీసుకుందాం. హీరోయిన్‌ తండ్రి పోలీసు కమిషనర్‌. హీరో తండ్రి కానిస్టేబుల్‌. హీరో పోకిరిలా వుంటాడు. హీరో, హీరోయిన్‌లు ప్రేమలో పడతారు. హీరోయిన్‌ తండ్రి వారి ప్రేమను కాదంటాడు. రౌడీలను పెట్టి హీరోను కొట్టిస్తాడు. చివరకు పెద్దలను ఎదిరించి హీరో హీరోయిన్‌లు హీరోయిన్‌ తండ్రి కళ్లెదుటే పెళ్లి చేసుకుంటారు. ఆ సీన్‌లో హీరోయిన్‌ తండ్రిని విలన్‌గా చూపిస్తారు. సినిమాలో ఈ సీన్‌లు చూస్తున్న ప్రతిఒక్కరూ హీరో హీరోయిన్‌ల ప్రేమ గెలవాలనే కోరుకుంటారు. హీరోయిన్‌ తండ్రికి తగిన శాస్తి జరిగిందని మానసిక ఆనందం పొందుతారు. కథ సుఖాంతమైందని సీట్లలోనుంచి లేస్తారు. ఇలా ఫీలయ్యేవాళ్ళలో ప్రణయ్‌, అమృతవర్షిణి లాంటి ప్రేమికులే కాదు, మారుతీరావు లాంటి తండ్రులు కూడా వుంటారు.

అది సినిమా… మరి నిజజీవితానికి వచ్చేసరికి సినిమాలలో ప్రేమ కథలకు మద్దతు పలికిన మారుతీరావు వంటి తండ్రులే తమ బిడ్డల ప్రేమకు, పెళ్లికి మద్దతు పలకలేకపోతున్నారు? మరి లోపం ఎక్కడుంది? ప్రేమ లేనిదే బ్రతుకు లేదనుకున్న ప్రేమికులలోనా? ప్రేమ పేరుతో సినిమా వ్యాపారం చేసే సమాజంలోనా? బిడ్డల ప్రేమను అంగీకరించలేని తల్లిదండ్రులలోనా?

ప్రణయ్‌ దారుణ హత్య… గత కొన్నిరోజులుగా తెలుగురాష్ట్రాలలో సంచలనాత్మక సంఘటన. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని జ్యోతి ఆసుపత్రి వద్ద జరిగిన దారుణ సంఘటన… ప్రణయ్‌ క్రైస్తవుడు. అమృతవర్షిణి వైశ్యులు. ఇద్దరి మధ్య 9వ తరగతిలోనే పరిచయం. ఇంజనీరింగ్‌ కాలేజీ కొచ్చేసరికి ప్రేమగా మారింది. వీరి పరిచయం గురించి తెలిసి అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్‌కు ముందుగానే వార్నింగ్‌ ఇచ్చాడు. అయినా వీళ్ళు ప్రేమను వదులుకోలేదు. కాలేజీలో వుండగానే ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ప్రణయ్‌ ఇంట్లోనే కాపురం పెట్టారు. తమ ప్రేమను గెలిపించుకున్నామనే ఆనందంలో వాళ్ళు… నీ కూతురు లేచిపోయిందంటగా… అనే చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలతో ఆవేశంతో రగిలిపోయిన మారుతీరావు. కూతురిపై ఆయనకున్న ప్రేమ పగగా మారింది. పంతొమ్మిదేళ్ళు పెంచిన ప్రేమను కాదని కూతురు వెళ్లిపోయిందనే ఆక్రోశం.. అదీగాక దళిత క్రైస్తవుడితో కూతురు వెళ్లిపోయిందనే మానసిక అవమాన భారం… వెరసి ఆ తండ్రిని హంతకుడిలా మార్చాయి. కోటి రూపాయలు సుఫారీ మాట్లాడుకుని కిరాయి మూకలచే ప్రణయ్‌ను హత్య చేయించాడు మారుతీరావు. ఇప్పుడు హత్య చేయించిన మారుతీరావు, హత్యకు పాల్పడ్డ కసాయి ముఠా పోలీసుల అదుపులో వున్నారు. బిడ్డను కోల్పోయి ప్రణయ్‌ తల్లిదండ్రులు, భర్తను కోల్పోయి అమృత దుఃఖసాగరంలో వున్నారు. ఇటు కూతురు దూరమై అటు భర్త జైలు పాలై మారుతీరావు భార్య పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇందరి జీవితాలలో చిచ్చు రగల్చడానికి కారణం… తల్లిదండ్రులను కాదనుకుని వెళ్లిపోయిన అమృతవర్షిణి ప్రేమా? బిడ్డ ప్రేమను అంగీకరించలేని మారుతీరావు కుల జాడ్యమా?

ఎవరి కోణంలో వారిది రైట్‌ అని సమర్ధించుకుం టున్నారు. ఇప్పుడు జరిగిన విషయం పక్కకు పోయింది. ఈ దుర్ఘటనను వేదికగా చేసుకుని మళ్ళీ కుల సంఘాలు, కుల దూషణలు తెరకెక్కాయి. కుల వ్యవస్థ దేశానికి పట్టిన చీడ పురుగే! అయితే కుల వ్యవస్థను నిర్మూలించాలంటున్న వాళ్ళే కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు దేశంలో ప్రతి కులానికి ఓ సంఘం వుంది. ప్రతి కులానికి ఓ పార్టీ వుంది. కులాల ఆధారంగానే ఓటు బ్యాంకులు ఏర్పడు తున్నాయి. తాజాగా రాజకీయ నాయకుల హామీలలో కుల కార్పొరేషన్‌లు కూడా చోటుచేసుకుంటున్నాయి. కులాల మధ్య అంతరాలు తగ్గడం మాట అటుంచితే రాజకీయ నాయకులే సమాజంలో కుల తత్వాన్ని ప్రేరేపించుకుంటూ పోతున్నారు. దేశంలో అగ్రవర్ణాలు, దళితులు, బడుగువర్గాలు అనే పదాలను ప్రభుత్వాలే వాడుతున్నాయి. ప్రభుత్వమే అగ్రవర్ణం, బలహీనవర్గం అని ప్రజల మధ్య అంతరాలు పెడుతుంటే ఇక మనుషుల మధ్య ఆ అంతరాలు తొలగేదెన్నడు?

భారత రాజ్యంగంలో పదేళ్ళవరకే రిజర్వేషన్‌లు వుండాలని డాక్టర్‌ అంబేద్కర్‌ పొందుపరిస్తే 70ఏళ్ళ తర్వాత కూడా కొత్తగా కొన్ని కులాలు రిజర్వేషన్‌ల కోసం రోడ్లెక్కుతుంటే ఈ కులం జాడ్యం పోయేదెప్పుడు? పుట్టిన బిడ్డకు తనది ఏ కులమన్నది తల్లో తండ్రో చెప్పడం లేదు. స్కూల్‌లో చేర్చేటప్పుడు పూర్తి చేసే దరఖాస్తులో కులం అనే కాలమ్‌ను భర్తీ చేయాల్సినప్పుడు మాత్రమే ఆ బిడ్డకు కులం తెలుస్తోంది. అంటే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే వారి కులాన్ని గుర్తు చేస్తోంది. ఆ కులం అన్న విషబీజం వారితో పాటు మొలకెత్తి మహావృక్షమై పెరుగుతోంది. కులమే పునాదులుగా పుట్టిన ఈ సమాజంలో, ప్రతి ఒక్కరూ మానవత్వంకంటే కులం, పరువు, ప్రతిష్టలకే పెద్దపీట వేస్తున్న ఈ దేశంలో ‘ప్రణయ్‌’ లాంటి సంఘటనలు జరుగుతూనే వుంటాయి. ‘కులం’ అనే విష మొక్కను పెకిలించిన నాడే ఇలాంటి సంఘటనలు సమాజం అనే తెర నుండి మాయమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here