Home రాష్ట్రీయ వార్తలు పప్పు.. నిప్పు.. చెప్పు

పప్పు.. నిప్పు.. చెప్పు

2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన దారుణాతి దారుణంగా జరిగింది. ఏపిని ఏపి ప్రజలను నిలువునా ముంచారు. ఈ ద్రోహంలో ప్రధాన ముద్దాయి కాంగ్రెస్‌పార్టీ. రెండో ముద్దాయి బీజేపీ, మూడో ముద్దాయి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం. అయితే వీరందరికీ మించి ఆరోజు రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది అప్పుడు సీఎంగా వున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఢిల్లీలో విభజన ప్రక్రియ శరవేగంగా జరిగిపోతున్నా చివరి బంతి మిగిలే వుందంటూ ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చి ప్రజలను నిలువునా మోసం చేసినవ్యక్తి కిరణ్‌. రాష్ట్ర విభజన తంతు ముగిసి, రాష్ట్రానికి జరగాల్సిన అన్యాయం జరిగిపోయాక జనం తన నెక్కడ తంతారోనని భయపడి కాంగ్రెస్‌ మీద కోపం నటిస్తూ బయటకొచ్చి జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో చెప్పుల పార్టీ పెట్టుకున్నాడు. రాష్ట్రం విడిపోయాక సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టడమే ఆయన కుట్రకు నిదర్శనం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్‌ సీజన్‌ వచ్చేసరికి సొంత గూటికే చేరి రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తానని బీరాలు పలుకుతున్నాడు. మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ చెప్పినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరడం వల్ల ఆ పార్టీకి అదనంగా ఒక ఓటు పెరిగింది తప్పితే ఇంకేమీ ఒరగదు.

ఈయన కాంగ్రెస్‌లో చేరీ చేరగానే జగన్‌ను అడ్డుకుంటామని స్టేట్‌మెంటిచ్చాడు. జగన్‌ను అడ్డుకుని చంద్రబాబును మళ్ళీ సీఎంను చేద్దామనే ఈయన కాంగ్రెస్‌లోకి వచ్చాడా? ఎందుకంటే కాంగ్రెస్‌కు ఎలాగూ ఇక్కడ సీన్‌ లేదు. అది కిరణ్‌కు కూడా తెలుసు. అయితే తెలుగుదేశమా? లేకుంటే వైయస్సార్‌ కాంగ్రెస్సా… గెలుపోటములు ఈ రెండు పార్టీల మధ్యే వుంటాయి. మరి కిరణ్‌కుమార్‌రెడ్డి జగన్‌ను అడ్డుకుంటామని చెప్పడమంటే తెలుగుదేశానికి మద్దతునిస్తున్నట్లే కదా!

అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయిన నాయకుడు కిరణ్‌! 2009 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుండి బొటాబొటి మెజార్టీతో గెలిచాడు. ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యతిరేకంగా చేసుంటే ఓడిపోయి వుండేవాడు. కాని, వై.యస్‌. గట్టిగా చెప్పబట్టి పెద్దిరెడ్డి పీలేరులో కిరణ్‌కు అనుకూలంగా పనిచేశాడు. అప్పుడు ఉన్నతాధికారుల సహకారం కూడా వుండింది. కాబట్టే తక్కువ ఓట్లతోనైనా గెలిచాడు. వై.యస్‌. కొలువులో స్పీకర్‌ అయ్యాడు. స్పీకర్‌ కావడమే ఆయనకు వరమైంది. వై.యస్‌. మరణం తర్వాత రోశయ్య సీఎం అయినా ఎక్కువ కాలం పనిచేయలేకపోయాడు.

కాంగ్రెస్‌ అధిష్టానం ఏపి విభజన ప్లాన్‌ను 2010లోనే ప్రభుత్వానికి పంపింది. అయితే సీఎంగా వున్న రోశయ్య… తన హయాంలో ఆ పాపం జరిగితే చూడలేనని విభజనకు తాను వ్యతిరేకమని చెప్పడంతో, విభజనకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన స్థానంలో కూర్చోబెట్టింది. 2013 చివర్లో విభజన ప్రక్రియ మొదలయ్యాక విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు కిరణ్‌ కలరింగ్‌ ఇస్తూ వచ్చాడు. కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనను బలంగా అడ్డుకుంటాడని ప్రజలు భ్రమపడ్డారు. చివరి బంతి మిగిలేవుందంటూ విభజన చివరి క్షణం దాకా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి చివరకు నిలువునా ముంచేసాడు.

ఏ వై.యస్‌. పుణ్యాన అయితే సీఎం స్థాయికి వెళ్లాడో అదే వై.యస్‌. కుటుంబానికి వ్యతిరేకంగా అధిష్టానం పన్నిన కుట్రలను అమలు చేయడంలో కిరణ్‌ తనవంతు సహకారం అందించాడు. జగన్‌ పై కేసులు నమోదు, విచారణ, జైలుకు పంపడం వంటి అన్ని ప్రక్రియలలోనూ కిరణ్‌ హస్తముంది. కిరణ్‌ ప్రభుత్వం పడిపోకుండా అప్పట్లో కాపాడింది చంద్రబాబు కాబట్టి… ఇప్పుడు చంద్రబాబుకు కిరణ్‌ తనవంతు సాయమందిస్తున్నాడు. అందుకే జగన్‌ టార్గెట్‌ అంటూ ఈ చిత్తూరు జోడు నేతలు తోడల్లుళ్ళులాగా కలిసిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here