Home రాష్ట్రీయ వార్తలు పని గడ్కరీది.. ఫోజు బాబుది!

పని గడ్కరీది.. ఫోజు బాబుది!

పోలవరం… ఆంధ్రప్రదేశ్‌కు వరం. తెలుగు ప్రజల చిరకాల స్వప్నం. ఈ ఒక్క ప్రాజెక్ట్‌ పూర్తయితే రాష్ట్రంలో ఎన్నో జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇబ్బందులుండవు.

ఈ ప్రాజెక్ట్‌ ప్రాధాన్యతను గుర్తించాడు కాబట్టే దివంగత నేత వై.యస్‌. రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఏ ప్రాజెక్ట్‌లోనైనా ప్రధాన అంకం కాలువల నిర్మాణం. డ్యాం అన్నది ఒక చోట కట్టడానికి నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కాని ఏళ్ళ తరబడి కట్టాల్సింది, కొన్నేసిసార్లు కోర్టుల్లో కేసుల వల్ల ఆగేది కాలువల నిర్మాణమే! అదీగాక కాలువల నిర్మాణానికి భూసేకరణ కూడా పెద్ద సమస్య. దీన్ని పసిగట్టాడు కాబట్టే వై.యస్‌. ముందుగా పోలవరం కాలువలను మొదలుపెట్టించాడు. కాలువలు పూర్తయ్యాక డ్యాం నిర్మాణం చేపట్టాలన్నది ఆయన ప్రణాళిక. దురదృష్టవశాత్తు 90శాతం కాలువలు నిర్మాణం జరగ్గానే ఆయన హఠాన్మరణం చెందారు. పోలవరం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. గత యూపిఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలలో పోలవరం ప్రాజెక్ట్‌ను చేర్చడం తెలిసిందే! 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ఆచరణలోకి తెచ్చింది. అయితే ప్రత్యేకహోదా డిమాండ్‌ను వదిలేసి ప్రత్యేకప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా తమకు అప్పగిస్తే తామే కట్టుకుంటామని చెప్పాడు. ఇది కేంద్రం మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌. చంద్రబాబు ఏ ఉద్దేశ్యంతో ఆ ప్రాజెక్ట్‌ మేం చేస్తామన్నాడో ఆ తర్వాత బీజేపీ నాయకులకు తెలిసింది. 16వేల కోట్ల అంచనాలను చంద్రబాబు 56వేల కోట్లకు తీసుకుపోయాడు. ఈ అంచనాలను చూసి కేంద్ర పెద్దలే కళ్ళు తేలేసారు. ప్రాజెక్ట్‌పై పెట్టిన ఖర్చుకు కేంద్రం యుసిఆర్‌లు అడగడం, పక్కాగా లెక్కలు చెప్పలేక చేతులెత్తేసిన చంద్రబాబు అసెంబ్లీలోనే పోలవరం ప్రాజెక్ట్‌ బాధ్యతను కేంద్రమే చూసుకోవాలని చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న ‘ట్రాక్స్‌ట్రాయ్‌’ కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ పనులను నత్తనడకన సాగిస్తుంటే అప్పుడు కేంద్ర జలవనరుల శాఖామంత్రి నితిన్‌ గడ్కరీ జోక్యం చేసుకున్నారు. దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లను వేగవంతంగా పూర్తి చేసిన నవయుగ ఇంజనీరింగ్‌ యాజమాన్యాన్ని ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఒక్క ఏడాదిలో పోలవరం కాంక్రీట్‌ పనులను పూర్తి చేయగలరా అని వారిని అడిగాడు. అందుకు వాళ్ళు పాతరేట్లతోనే డ్యాం కాంక్రీట్‌ పని పూర్తి చేయడానికి అంగీకారం తెలిపారు. దీంతో ఎంఓయూ కుదిరింది. ఈ పనితో లాభం వస్తుందా లేదా అని ఆలోచించకుండా నవయుగ సంస్థ రంగంలోకి దిగింది. వేలమంది సిబ్బందిని, ఇంజనీర్లను, వేల సంఖ్యలో వాహనాలను, మిషినరీని సిద్ధం చేసింది. తక్షణమే కాంక్రీట్‌ పనులను మొదలుపెట్టింది. రేయింబవళ్ళు పనిచేస్తూ నితిన్‌గడ్కరీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద ఇప్పుడు ఏ పని వేగవంతంగా జరుగుతున్నా అది నితిన్‌గడ్కరీ పుణ్యమే. పని ఆయనదైతే ఫోజులు మాత్రం చంద్రబాబువయ్యాయి. డయాఫ్రంవాల్‌ అంటూ శంకుస్థాపన… ప్రపంచ రికార్డు నిర్మాణం అంటూ పచ్చ మీడియాలో వార్తలు… సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here