Home జిల్లా వార్తలు నోరుజారి దిద్దుకున్న సోమిరెడ్డి

నోరుజారి దిద్దుకున్న సోమిరెడ్డి

రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే! అయితే రాజకీయ నాయకులకు మధ్యే ఈ విమర్శలు పరిమితమైతే ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఒక నాయకుడు ఇంకో నాయకుడి మీద ఆరోపణలు చేయడం, అతను ప్రత్యారోపణలు చేయడం సర్వసాధారణం. కాని రాజకీయాలతో సంబంధంలేని, అదీగాక ఒక గౌరవప్రదమైన వృత్తిని నిర్వహిస్తున్న వ్యక్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణే వ్యవసాయమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.

సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న నాయకుడు. రాజకీయంగా ఎందరిపైనో విమర్శలు చేస్తుంటాడు. ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్‌ను అయితే సోమిరెడ్డి విమర్శించినంతగా టీడీపీలో ఇంకెవరూ విమర్శించరు. అయితే విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా సబ్జెక్ట్‌ వారీగానే పోతాడనే పేరుంది. మరీముఖ్యంగా ఆనంవాళ్ళలాగా వ్యక్తిగత విమర్శలకు దిగకుండా తన స్థాయిని కాపాడుకుంటూవచ్చాడు. ఎక్కడ ఏ సమావేశంలో అయినా చాలాజాగ్రత్తగా మాట్లాడే సోమిరెడ్డి విజయవాడలో జరిగిన మహానాడు ముందురోజు విలేకరుల సమావేశంలో మాత్రం తొందరపడి నోరు జారాడు. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న టీటీడీ విశ్రాంత ప్రధాన అర్చకులు రమణదీక్షితులను బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయంటూ మాటదొర్లాడు. ఈ మాటలు నాయకుడిగా ఆయన ప్రతిష్టకు కూడా మచ్చతెచ్చాయి. బ్రాహ్మణ కమ్యూనిటీలో వ్యతిరేకతను తెచ్చింది. పార్టీపరంగా రమణదీక్షితులతో ఏదన్నా సమస్యవుంటే వుండేది తెలుగుదేశం ప్రభుత్వమే! ఆయన ఆస్తుల మీద, ఆయన ఆదాయం మీద విచారణ చేయించండి, అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోండి, అంతేగాని చట్ట పరిధిని మించి మాట్లాడడం కరెక్ట్‌ కాదు. అసలు రాజకీయాలను దాటి ఎప్పుడూ విమర్శలు చేయని సోమిరెడ్డి టైం బాగాలేక రమణదీక్షితులపై ఫైర్‌ అయినట్లుంది. చేసింది పెద్ద పొరపాటే… వెంటనే ఆయననే క్షమాపణ కోరి సోమిరెడ్డి జరిగిన పొరపాటును కొంతవరకు సరిదిద్దుకోవడం మంచిదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here