Home రాష్ట్రీయ వార్తలు నేస్తమా? భస్మాసుర హస్తమా?

నేస్తమా? భస్మాసుర హస్తమా?

”రికార్డులు సృష్టించాలన్నా మేమే… రికార్డులు బద్ధలు కొట్టాలన్నా మేమే…”

ఓ తెలుగు సినిమాలో బాలకృష్ణ డైలాగ్‌! సినిమాల మాటేమోగాని రాజకీయాలలో పొత్తుల రికార్డులు బద్దలు కొట్టాలన్నా, కొత్త రికార్డులు సృష్టించాలన్నా ఎవరైనా చంద్రబాబు కిందే!

జాతీయ రాజకీయాలలోనే ఏ పార్టీ అధినాయకుడికి కూడా చంద్రబాబు లాంటి రికార్డు ఉండదేమో?! బీజేపీ, సిపిఎం, సిపిఐ, టిఆర్‌ఎస్‌ మళ్ళీ బీజేపీ, జనసేన… ఇప్పుడు కాంగ్రెస్‌… రాష్ట్ర రాజకీయాలలో మనుగడలో వున్న అన్ని పార్టీలతో తెలుగు దేశం పొత్తు అయిపోయింది. ఇక మిగి లింది వైసిపి ఒక్కటే! అది కూడా చంద్ర బాబు పార్టీకి ఎసరుపెట్టడానికి రెడీగా వుండేది ఆ పార్టీయే కాబట్టి పొత్తు కుద రడం లేదు. మిగతా అన్ని పార్టీలతో పొత్తు ఒకెత్తు. కాంగ్రెస్‌తో పొత్తు మరోఎత్తు. కాంగ్రెస్‌తో పొత్తు అన్నది ఒరిజనల్‌ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఓ పట్టాన జీర్ణించుకోలేరు. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశంలో డామినేషన్‌ కాంగ్రెస్‌ నుండి వలసొచ్చిన నాయకులు, కార్యకర్త లది కాబట్టి కాంగ్రెస్‌ పొత్తుపై పార్టీలో పెద్దగా నిరసన స్వరాలు వినిపించడం లేదు. ఒకరిద్దరు వినిపించాలని చూసారు కాని… చంద్రబాబు అప్పుడే తొక్కేసాడు!

మోడీ భయంతోనేనా..?

టీడీపీ, కాంగ్రెస్‌ల పొత్తు అన్నది ఎవరూ వూహించరు. ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని పెట్టిందే ఆనాటి కేంద్రంలోని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా! కాంగ్రెస్‌ భావ జాలానికి, టీడీపీ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధం. ఇప్పుడంటే రాష్ట్రంలో వైసిపి ప్రత్యర్థిగా వుంది కాని, మొన్నటి వరకు కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి కదా!

రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని చెప్పి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసాడు. మరి కాంగ్రెస్‌ రాష్ట్రానికి చేసిందేమిటి? కాంగ్రెస్‌ ఏపికి చేసిన దానిని ద్రోహం కూడా అనరు… దారుణం, దుర్మార్గం అం టారు. ఈ రాష్ట్ర ప్రజలెప్పుడూ బీజేపీని ఆదరించలేదు. కాబట్టి వాళ్లను పట్టించు కోనవసరం లేదు. కాని, కాంగ్రెస్‌ను ఎన్నో సార్లు నెత్తిన పెట్టుకున్నారు. దానికి ప్రతి ఫలంగా కాంగ్రెస్‌ ఏమి చేసిందో చూసాం. విభజన పేరుతో వట్టి గుడ్డలతో ఆంధ్రు లను నడిరోడ్లో నిలబెట్టింది. ఇలాంటి కిరాతక కాంగ్రెస్‌ను ఆంధ్రులెవరూ క్షమిం చరు. అలాంటి దుర్మార్గపు పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకూ గుణపాఠం తప్పదు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ భయంతోనే చంద్రబాబు ఇంతగా దిగజారి కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. రాజకీయాలలో దిగజారి పోవడానికి ఎంత లోతు వుంటుందో చంద్రబాబు అంతకంటే ఎక్కువ లోతుకే వెళ్లిపోయాడు. ఇక ఇంతకంటే పోయేది ఏమీ వుండదు. సరే వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా? కాంగ్రెస్‌తో పొత్తు చంద్ర బాబుకు ఏ విధంగా ప్రయోజనం కలిగి స్తుంది. ముందు మోడీ భయం బాబును వెంటాడుతోంది. ఇప్పటికే బాబు అనుచరులపై ఏపిలో ఐటి దాడులు జరుగు తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాల చిట్టా కేంద్రం వద్ద వుంది. ఓటు-నోటు కేసు మళ్ళీ రన్నింగ్‌లోకి వచ్చింది. ఏ ఒక్క అంశం మీద సిబిఐ ఎంక్వయిరీ జరిగినా చంద్రబాబు 40ఏళ్ళ ఇండస్ట్రీ కథాకమామిషు అంతా మటాష్‌.!

మోడీని భయపెట్టడానికా?

చంద్రబాబు తలచుకుంటే జాతీయ స్థాయిలో అన్ని పక్షాలను ఏకం చేయగలడు. బీజేపీని ఓడించగలడు! ఆయనతో పెట్టుకో వద్దు… గతంలోనే ఆయనకు ఆ రికార్డు వుంది… అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆయన కాంగ్రెస్‌తో కలిసాడన్నది సూచాయగా తెలుస్తోంది. బాబు జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని మోడీకి చేసిన హెచ్చరిక బాబూ – రాహుల్‌ కలయిక. ఇక్కడ చంద్రబాబు గమనించాల్సిన విషయం ఏంటంటే… ఆల్‌రెడీ బీజేపీకి వ్యతిరేకంగా యూపిఏ వుంది. బీజేపీని వ్యతిరేకించే పక్షాలన్నీ అందలో భాగస్వాములే! కాం గ్రెస్‌తో, బీజేపీతో కలవని కొన్ని పార్టీలు తటస్థంగానే వున్నాయి. చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసాడని చెప్పి వాళ్ళు కూడా కాంగ్రెస్‌ నీడన చేరే అవకాశాలు లేవు. జాతీయ రాజకీయాలలో పెను మార్పులు అంటూ పచ్చమీడియా కొన్ని రోజులుగా ఊదరకొడు తోంది. అలాంటి పెనుమార్పులేమీ అక్కడ లేవు. ఎన్డీఏ నుండి బయటకొచ్చిన తెలుగుదేశం కాంగ్రెస్‌ గూటికి చేరిందంతే! ఈ పరిణామం వల్ల కాంగ్రెస్‌కు ఊహించని స్నేహితుడు దొరికినట్లే! కాని, చంద్రబాబుకే… కాంగ్రెస్‌ హస్తం అభయహస్తమా? లేక భస్మాసుర హస్తమా? అన్నది వచ్చే ఎన్నికలు తేల్చాలి!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here