Home గ్రామ సమాచారం నెల్లూరు రాధయ్య దాతృత్వంతో… కాళయకాగొల్లుకి కళొచ్చింది

నెల్లూరు రాధయ్య దాతృత్వంతో… కాళయకాగొల్లుకి కళొచ్చింది

జూన్‌ 10వ తేదీ నెల్లూరుజిల్లాలో ఓ అరుదైన రోజుగా నిలిచిపోతుంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని కాళయకాగొల్లు గ్రామంలో 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్క రించబడి జిల్లా చరిత్రలో ఇది ఓ చిరస్మరణీయ సంఘటనగా మిగిలి పోయింది.

ప్రియా సిమెంట్‌ రాధయ్యగా అందరూ పిలుచుకునే నెల్లూరు రాధాకృష్ణారెడ్డి తనకు జన్మనిచ్చిన ఊరిని ఊపిరి పోసిన అమ్మా నాన్నలను స్మరించుకుంటూ అత్యాధునిక విద్యా వైద్యాలయాలను ఈ మారుమూల గ్రామంలో నిర్మించి ప్రారంభించాడు.

జూన్‌ 10వ తేదీ సాయంత్రం కాళయకాగొల్లు గ్రామ ప్రజలంతా ముస్తా బయ్యారు. తమ ఊర్లో ”ప్రజ్ఞ్యప్రియ ఫౌండేషన్‌” ఆధ్వర్యంలో నెల్లూరు రాధా కృష్ణారెడ్డి, ఆయన శ్రీమతి ఇందిరమ్మ, కుమారులు జగన్‌మోహన్‌రెడ్డి, సుజిత్‌రెడ్డి చేపట్టిన మహత్కార్యం ప్రారంభోత్సవానికి హాజరుకావడానికి, ఆ ఆనందక్షణాలను వీక్షించడానికి గ్రామం మొత్తం తరలి వచ్చింది.

తాను పుట్టిన ఊరికి ఊరి జనానికి తన వంతు సేవ చేయాలనే తపనతో 5 యకరాల విస్తీర్ణంలో నెల్లూరు లక్ష్మీ దేవమ్మ ఉచిత ఆసుపత్రిని, నెల్లూరు చంద్రారెడ్డి హైస్కూల్‌, ఇంగ్లీషు మీడియం & డిజిటల్‌ క్లాసెస్‌ ప్రాంగణాలను అత్యంత ఆధు నికంగా అందంగా తీర్చిదిద్ది రెండింటినీ ఒకేసారి ప్రారంభించారు.

రాధాకృష్ణారెడ్డి ఏ పని చేసినా ప్రత్యేకతను చాటుకుంటాడు. మనం చేసే పనిలో అంకితభావం, చిత్తశుద్ధి, నాణ్యత వుంటే విజయం తప్పక లభిస్తుందని భావించే తత్వం ఆయనది. తన స్వగ్రా మంలో చేపట్టిన సేవా కార్యక్రమాలలో సైతం ఆయన ఎక్కడా రాజీపడలేదు. ప్రతి అంగుళంలోనూ కొత్తదనాన్ని ఆధునీకతని కనపరచాడు. రెండు ప్రాంగణాలనూ కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దాడు.

10వ తేదీ సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో సైతం వైవిద్యాన్ని చూపించాడు. సరిగ్గా 6 గంటల 5 నిము షాలకు వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపజేసి భవనాల ప్రారంభోత్సవం జరిపించాడు. ఎలాంటి అతిథుల ప్రసంగాలు లేకుండా తన చిన్న కుమారుడు సుజిత్‌రెడ్డి ప్రారంభోపన్యా సంతో చెప్పాల్సిందంతా చెప్పించేసి ”ఆరభి” సాంస్కృతిక సంస్థ నిర్వాహకులు అశోక్‌గురజాలి ఆధ్వర్యంలో సుమారు 100మందికి పైగా కళాకారులను రప్పించి వీనులవిందైన సుమధుర సంగీతాన్ని వినిపింపజేశారు.

తన గ్రామ ప్రజలే అతిథులుగా తమ ఊరి పిల్లలే అతిరథులుగా ఈ కార్య క్రమాన్ని నిర్వహించి అందరి ప్రశంసలూ అందుకున్న రాధాకృష్ణారెడ్డికి వారి కుటుంబసభ్యులకు ‘లాయర్‌’ అభి నందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here