Home జిల్లా వార్తలు నెల్లూరువైపు మాగుంట చూపు

నెల్లూరువైపు మాగుంట చూపు

రాష్ట్ర రాజకీయాలలో ఒక బ్రాండ్‌ క్రియేటర్‌ స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి. ‘మాగుంట’ అనే ఇంటి పేరును మానవత్వానికి, దాతృత్వానికి బ్రాండ్‌గా మాలిచారాయన! మాగుంట సుబ్బరామరెడ్డి రాజకీయ ప్రవేశం, ముగింపు అంతా కూడా నాలుగేళ్ళలోనే జరిగిపోయింది. ఆయన ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా పనిచేసింది నాలుగేళ్ళే అయినా నాలుగు తరాలు గుర్తుపెట్టుకునేంత కీర్తిని, నాలుగు తరాల వారు మరచిపోలేనంత చరిత్రను సృష్టించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో, ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాజకీయాలలో మాగుంట సుబ్బరామరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన మరణానంతరం ఆయన వారసులుగా మాగుంట పార్వతమ్మ, ఆ తర్వాత మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు రాజకీయాలలో కొనసాగుతుండడం చూస్తున్నాం.

ఏ ఎంపి కూడా తమ పార్లమెంట్‌ నియోజకవర్గానికి చేయనంతగా మాగుంట వాళ్ళు ఒంగోలు పార్లమెంట్‌ ప్రజల బాగు కోసం చేశారు. తమ సొంత డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సాధారణ రాజకీయ వాతావరణంలో అయితే ఒంగోలులో మాగుంటకు ఓటమి వుండదు అనే నమ్మకం వుండేది. అలాంటి నియోజకవర్గంలో కూడా మాగుంట కుటుంబం రెండుసార్లు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 1992లో మాగుంట సుబ్బరామరెడ్డి, 1996లో మాగుంట పార్వతమ్మ ఒంగోలు లోక్‌సభ నుండి విజయం సాధించారు. 1998 మాగుంట శ్రీనివాసులురెడ్డి రంగప్రవేశం చేశాడు. ఆ ఎన్నికలలో విజయం సాధించిన ఆయన 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. మళ్ళీ 2004, 2009లలో ఒంగోలు నుండి గెలిచాడు.

రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులు కాంగ్రెస్సే ఊపిరి అనుకున్న మాగుంట కుటుంబసభ్యులలోనూ మార్పు తెచ్చాయి. 2014లో మాగుంట శీనయ్య తొలుత వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరాలని భావించాడు. అయితే వైసిపి అధినాయకత్వం వారి విషయంలో స్పందించిన తీరు సరిగా లేక తెలుగుదేశంలో చేరి ఆ ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశాడు. అయితే ప్రకాశం జిల్లాలో వై.యస్‌. ప్రభావం అధికంగా ఉండడంతో వైసిపి అభ్యర్థి వై.వి.సుబ్బారెడ్డి చేతిలో పరాజయం పొందాడు. ఆ తర్వాత మాగుంట శీనయ్యను ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా పోటీకి పెట్టి వైసిపి సభ్యులను కొని గెలిపించి మండలికి పంపించాడు చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్సీ అన్నది మాగుంట శీనయ్య స్థాయికి తగిన పదవి కాదు, కాకపోతే మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని చెప్పి చంద్రబాబు మాయమాటలు చెప్పి ఎమ్మెల్సీకి నిలబెట్టాడు. కాని, మాకు ఈ పదవి కావాలి అని నోరు తెరిచి అడిగే తత్వం శీనయ్యకు లేదు. కాబట్టే చంద్రబాబు మంత్రి పదవి మాట చెప్పినా కూడా శీనయ్య ఏ రోజూ దానిని చంద్రబాబుకు గుర్తు చెయ్యలేదు.

ఇంతవరకు సాగిన రాజకీయం ఒకెత్తు, 2019 ఎన్నికలలో మాగుంట శీనయ్య అడుగులు ఎటుపడనున్నాయన్నది మరో ఎత్తు. ఒంగోలు తెలుగుదేశం అభ్యర్థిగా ఆయనను నిలపడానికే చంద్రబాబు కంకణం కట్టుకుని వున్నాడు. ఆయన ఎంపి అభ్యర్థి అయితేనే అసెంబ్లీలో కూడా రసవత్తర పోటీ వుంటుందన్నది చంద్రబాబు ఆలోచన. శీనయ్య ఎక్కడ వైసిపిలోకి వెళతాడోననే ముందుచూపుతోనే గతంలోనే ఒంగోలు సీటును ఆయనకు ఖరారు చేస్తున్నట్లు చంద్రబాబు ఒక సీన్‌ క్రియేట్‌ చేశాడు.

మరోపక్క వైసిపి అధిష్టానం కూడా గత ఎన్నికలప్పుడు జరిగిన పొరపాటును సరిదిద్దుకోవాలనుకుంటోంది. ఆయన వైసిపిలోకి వస్తే ఆయనకు ఒంగోలు… ఏ సీటు ఇవ్వడానికైనా సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం ప్రకాశం జిల్లా ప్రజలకు కాంగ్రెస్‌, తెలుగుదేశం అభ్యర్థిగానే పరిచయమైన శీనయ్య మూడోపార్టీ ద్వారా అక్కడ ప్రజలలోకి వెళ్ళే ధైర్యం చేయలేకపోవచ్చు. అందుకని వైసిపిలో చేరాల్సి వస్తే ఆయన నెల్లూరు పార్లమెంటుకే రావచ్చు. ఇదే జరిగితే నెల్లూరు లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల నెత్తిన పాలు పోసినట్లవుతుంది. మరి మాగుంట శీనయ్య నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందన్నది వేచిచూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here