Home జిల్లా వార్తలు నెల్లూరురూరల్‌ రూలర్‌?

నెల్లూరురూరల్‌ రూలర్‌?

2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన చట్టంలో నుండి పుట్టుకొచ్చింది నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం. నెల్లూరు నగరంలో కొంత భాగాన్ని చీల్చి, అలాగే నెల్లూరురూరల్‌ మండలంలోని గ్రామాలను కలిపి ఏర్పాటు చేసిన నియోజకవర్గం. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి అతి కష్టం మీద 3131 ఓట్ల తేడాతో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిపై నెగ్గాడు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం వాళ్ళు ఆ సీటును బీజేపీకి అప్పగిస్తే వైసిపి అభ్యర్థి విజయం అప్పుడు ఏకపక్షంగా నడిచింది. 2009లోగాని, 2014లో గాని తెలుగుదేశం పార్టీ ఇక్కడ తన అభ్యర్థులను నిలపకపోవడం వల్ల ఆ పార్టీ కేడర్‌ నిర్వీర్యమైపోయింది. ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ బలం ఎంతన్నది ఇంతవరకు తేలనేలేదు. ఆ పార్టీ కేడర్‌ను ఇంతవరకు సమన్వయపరిచే దిశగా ఒక్క ఎలక్షన్‌ కూడా జరగలేదు.

2019 ఎన్నికల్లో మాత్రం నాటకీయ పరిణామాల మధ్య తెలుగుదేశం అభ్యర్థిగా మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పోటీ చేస్తున్నాడు. మొదట నెల్లూరురూరల్‌ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించడం తెలిసిందే! ఆదాల అభ్యర్థి అన్నాక నియోజకవర్గంలోని టిడిపి కేడర్‌లో ఒక ఊపు, ఉత్సాహం కనిపించింది. ఆయనే అభ్యర్థిగా వుండుంటే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవేమో?! తెలుగుదేశంలో చోటుచేసుకున్న వర్గ రాజకీయాల మూలంగా ఆయన వైసిపిలో చేరి పార్లమెంట్‌ అభ్యర్థి కావడం, చివరి నిముషంలో మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెరమీదకు రావడం చకచకా జరిగిపోయాయి. ఆదాల వుండుంటే నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి వేరు. అజీజ్‌ అభ్యర్థి అయ్యేసరికి ఒక్కసారిగా లెక్కలు మారాయి. ఇక్కడ మైనార్టీ ఓట్ల సంఖ్య 30వేలకు పైమాటే అయినప్పటికీ, ఏ పార్టీ ఎంత స్థాయిలో వీరిని ఆకర్షించి ప్రసన్నం చేసుకుంటుందోనన్నది కీలకాంశం. ఒకసారి కాంగ్రెస్‌, ఇంకోసారి వైకాపా ఈ నియోజకవర్గంలో గెలిచాయి. గెలుపు కోసం ఓవైపు తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన అభ్యర్థి మనుక్రాంత్‌ చెన్నారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పోరాటం ఎంత వరకు ఫలిస్తుందన్నది వేచి చూడాలి…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here