Home జాతీయ వార్తలు నెల్లూరుకు రహదారుల మాల

నెల్లూరుకు రహదారుల మాల

రూపాయికి కిలో బియ్యం… ఇంటింటికి కిరోసిన్‌ ఫ్రీ… పనీపాట లేని వారికి పింఛన్‌లు… సోమరిపోతులకు పక్కా ఇళ్ళు… ఇలాంటి పథకాలు ప్రజలను సోంబేరులను చేస్తాయి. సబ్సిడీలతో ప్రభుత్వ ఖజానాకు బొక్క. ఒక పనిచేస్తే పదిమందికి ఉపాధి అవకాశాలు, ఒక ప్రాంతం అభివృద్ధి చెందేలా వుండాలి. వాజ్‌పేయి నాలుగులైన్ల జాతీయ రహదారులు నిర్మించాడు. దానిమూలంగా దేశ ఆర్ధిక వ్యవస్థలో ఎన్నో మార్పులు సంభవించాయి. వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, సెజ్‌లు ఏర్పాటు చేశాడు. రైతులు, నిరుద్యోగులకు పండుగ అయ్యింది. ఏ ప్రభుత్వమైనా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తే దాని మూలంగా ఆయా ప్రాంతాలే అభివృద్ధి చెందుతాయి.

ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత మాల ప్రాజెక్టుతో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. భారత మాలలో భాగంగా నెల్లూరుజిల్లాకు సరికొత్త జాతీయ రహదారులు రాబోతున్నాయి. డబుల్‌లైన్లు నాలుగు లైన్లుగా విస్తరించ బోతున్నాయి. ఇప్పటికే ఏర్పేడు నుండి మార్కాపురం వరకు ఒక జాతీయ రహదారి జిల్లాలోని మర్రిపాడు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల మీదుగా పోతోంది. ఈ రహదారి మెట్ట ప్రాంతంలో వారికి ఎంతగానో ఉపయోగపడుతోంది. అలాగే తాజాగా 500కోట్ల వ్యయంతో సీతారాంపురం నుండి కావలి వరకు 120 కిలోమీటర్ల జాతీయ రహదారి మంజూరైంది. దీనిని కడప జిల్లాలోని పోరుమామిళ్ళ వరకు పొడిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, కడప జిల్లా బద్వేలు నుండి నెల్లూరుజిల్లా కృష్ణపట్నం వరకు మరో జాతీయ రహదారి మంజూరైంది. బద్వేలు నుండి మొదలై మర్రిపాడు మండలం చుంచులూరు, అనంతసాగరం మండలంలోని లింగంగుంట, కలువాయి మండలంలోని తెలుగురామపురం, చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి, పొదలకూరు మండలంలోని కనుపూరు మీదుగా వెంకటాచలం వద్ద కృష్ణపట్నం రహదారిలో కలిపే విధంగా ఈ హైవేను డిజైన్‌ చేశారు. దాదాపు 1700 కోట్ల వ్యయంతో ఈ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. బెంగుళూరు-చెన్నై కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం పోర్టును అనుసంధానిస్తూ నాయుడుపేట, కోటల మీదుగా పోర్టు వరకు మరో రహదారిని ప్లాన్‌ చేస్తున్నారు. విశాఖ – చెన్నై కారిడార్‌లో భాగంగా జిల్లా తీర ప్రాంతంలో మరో హైవే నిర్మితంకానుంది. ఇవన్నీ రూపు దాలిస్తే నెల్లూరుజిల్లాలో ఎటుచూసినా హైవేలే కనిపిస్తాయని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here