Home రాష్ట్రీయ వార్తలు నెగ్గితే నారా.. తగ్గితే తార

నెగ్గితే నారా.. తగ్గితే తార

2019 ఎన్నికలు… అధికార తెలుగుదేశంకు ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌కు ఫైనల్‌ మ్యాచ్‌లాంటి ఎన్నికలు! ఒకరకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం వైసిపికి ఎంతో అవసరం. అధికారంలోకి వస్తేనే ఆ పార్టీ నిలబడగలదు. అధికారంలోకి రాలేకపోతే మాత్రం మరో ఐదేళ్ళు ప్రతిపక్ష పాత్రలో మనుగడ సాగించడం కష్టమే! వైసిపి అధికారంలోకి వచ్చినా రాకపోయినా దాని నాయకుడు మాత్రం జగన్మోహన్‌రెడ్డే!

అయితే 2019 ఎన్నికలు ఇంకో యువనాయకుడి రాజకీయ భవిష్యత్‌ను కూడా నిర్దేశించనున్నాయి. ఆయనే మన ఐటి మంత్రి నారా లోకేష్‌. చంద్రబాబు పుత్రరత్నం. లోకేష్‌కు సొంతంగా పార్టీని నడిపే సత్తా లేదు. ఎన్నికలను ఎదుర్కొనే సామర్ధ్యం లేదు. చంద్రబాబు నీడలో నాయకుడిగా ఎదగాల్సిందే! రాజకీయంగా ఆయన వేసిన తొలి అడుగే దొడ్డిదారిలో పడింది. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజాక్షేత్రంలో తన సామర్ధ్యం చూపించుకోకుండా గవర్నర్‌ కోటాలో శాసనమండలి సభ్యుడై తండ్రి కేబినెట్‌లో మంత్రి బెర్త్‌ దక్కించుకున్నాడు. చంద్రబాబు తర్వాత పార్టీని హ్యాండిల్‌ చేయగల శక్తి లోకేష్‌కు లేదని పార్టీ కేడర్‌కు అర్ధమైంది. అయితే లోకేష్‌ను తన రాజకీయ వారసుడిగా చూసుకోవాలన్నది చంద్రబాబు కోరిక!

ఆయన కోరిక నెరవేరాలంటే 2019 ఎన్నికల్లో నెగ్గాలి. తాను యాక్టివ్‌గా వున్న ప్పుడే లోకేష్‌ను సీఎంను చేయాలి. తన శిక్షణలో లోకేష్‌ను రాటుదేలేలా తీర్చి దిద్దాలి. పార్టీపై లోకేష్‌ పట్టు బిగించేలా చూడాలి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తే చంద్రబాబు ఆలోచనకు తగ్గట్లే అన్నీ జరిగిపోతాయి. లోకేష్‌ను ఎలాగోలా సీఎం కుర్చీలో కూర్చో బెడితే అతని తంటాలు అతను పడతాడు. పార్టీ కూడా చేతుల్లో నుండి జారకుండా వుంటుంది. అలాకాకుండా తెలుగుదేశం ఓడిపోతే… సీన్‌ పూర్తిగా మారొచ్చు. పార్టీపై చంద్రబాబు పట్టు సడలిపోతుంది. ఇప్పటికే పార్టీపై చంద్రబాబు పట్టు కొంత సడలింది. గతంలో చంద్రబాబు ముందు కుక్కిన పేనుల్లా వుండే నాయకులు గత నాలుగేళ్ళుగా ఆయన ముందే తోకాడిస్తు న్నారు. చంద్రబాబు పరిస్థితి కూడా వారి మీద ఆధారపడక తప్పడం లేదు. రేపు పార్టీ ఓడిపోతే చంద్రబాబు ప్రాబల్యం తగ్గిపోతుంది. పార్టీని నిలబెట్టాలంటే లోకేష్‌ సరిపోడని, నందమూరి వారసులు కావాలనే డిమాండ్‌ పార్టీ కార్యకర్తల్లోనే రావచ్చు. ఈ కోణంలో చూస్తే ఇప్పుడు నందమూరి కుటుంబసభ్యుల్లో క్రేజ్‌ వుండేది జూనియర్‌ ఎన్టీఆర్‌(తారక్‌)కే! పెద్ద ఎన్టీఆర్‌ ఇమేజ్‌ వుండేది కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌కే! నందమూరి కుటుంబంలో ఇంకెవరివల్ల కూడా పార్టీ నిలబడే పరిస్థితి లేదు. లోకేష్‌కు అడ్డొస్తాడని చెప్పే చంద్ర బాబు వ్యూహాత్మకంగా జూనియర్‌ను తొక్కిపెడుతూ వచ్చాడు. 2009లో జూని యర్‌ ఎన్టీఆర్‌ను ప్రచారానికి వాడుకున్న చంద్రబాబు 2014 ఎన్నికల్లో మాత్రం దగ్గరకు రానీయలేదు. ఎందుకంటే లోకేష్‌ రాజకీయ ప్రయాణం అక్కడనుండే మొద లైంది. జూనియర్‌ను సీన్‌లోకి తెస్తే లోకేష్‌ ఫోకస్‌ కాలేడనే భయం. అందుకే జూని యర్‌ను పార్టీకి దూరం పెట్టారు.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడి పోతే జూనియర్‌ నాయకత్వం కావాలని పార్టీలోనే డిమాండ్‌ రావచ్చు. అయితే ఇక్కడా చంద్రబాబు ప్రత్యామ్నాయం ఆలో చించి పెట్టాడని తెలుస్తోంది. నందమూరి కుటుంబం నుండే నాయకత్వం కావాలని పార్టీ శ్రేణులు కోరుకుంటే జూనియర్‌కు పోటీగా తన కోడలు, ఎన్టీఆర్‌ మనుమరాలు నారా బ్రాహ్మణిని ఆయన తెరమీదకు తెచ్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి 2019 ఎన్నికలు నారా, నందమూరి కుటుంబాలలో వినూత్న రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here