Home జిల్లా వార్తలు నీళ్లొస్తే వీ(ఇ)ళ్ళ గతేంటి?

నీళ్లొస్తే వీ(ఇ)ళ్ళ గతేంటి?

కాలువలను ఆక్రమిస్తున్నాం, వాగులను ఆక్రమిస్తున్నాం… చివరకు నదులనూ ఆక్రమిస్తున్నాం, కొన్ని దేశాలలో అయితే సముద్రాలను కూడా ఆక్రమించేసి నగరాలను కడుతున్నారనుకోండి… వారితో పోలిస్తే మనం చాలా నయం. ఇలా కాలువలు నదులు ఆక్రమించి నిర్మాణాలు చేస్తాం. ఖర్మకాలి ఏదో ఒక సంవత్సరం భారీ వర్షాలు పడి వరదలొస్తే… కాలువలు, నదులు ఉప్పొంగి సమీపంలోని నిర్మాణాలు మునిగిపోతే దానికి బాధ్యులెవరు? ఏది కూడా సంఘటన జరగనంతవరకు బాగానే వుంటుంది. జరగరానిది జరిగితే అప్పుడు ఏడ్చి ఏం లాభం!

నెల్లూరు, వెంకటేశ్వరపురంలోని యాష్‌పాండ్‌ స్థలంలో సర్వే నెంబర్‌ 2062, 2332, 2214-2, 2217, 2218, 2219, 2222లలో రాష్ట్ర ప్రభుత్వం హౌస్‌ ఫర్‌ ఆల్‌ స్కీం క్రింద 6వేల ఇళ్లతో గృహ సముదాయాలను నిర్మించడం తెలిసిందే! మున్సిపల్‌ మంత్రి నారాయణ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన కలల పంటగా ఈ ఇళ్లను నిర్మించారు. ఒకటికి పదిసార్లు ఆయన వీటిని పరిశీలించడం జరిగింది. ఇటీవల లబ్దిదారులకు గృహాల కేటాయింపు కూడా జరిగింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు రావడం, ఈ ఇళ్లను ప్రారంభించడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో నెల్లూరుకు చెందిన పల్లవరం జయ, షేక్‌ రసూల్‌, షేక్‌ బీబీజాన్‌, లేబూరు కామాక్షి, కొత్తూరు లక్ష్మి అనేవాళ్ళు ఈ ఇళ్లను పెన్నా పరివాహక ప్రాంతంలో కడుతున్నారని, వాటర్‌ బాడీ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టడం చట్ట విరుద్ధమని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు. పెన్నకు వరదలొస్తే ఈ ప్రాంతంలో ఇళ్లన్నీ మునిగిపోతాయని, ప్రాణ నష్టం, ఆస్థి నష్టం సంభవిస్తుందని వారు ఆ పిటిషన్‌లో పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏపిటిఐడిసి మేనేజింగ్‌ డైరె క్టర్‌కు, నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు, నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే వాళ్ళు వివరణ ఇవ్వడం ఆలస్యం కావడంతో ఈ నెల 5వ తేదీన ఈ నిర్మాణాలను వెంటనే ఆపాలంటూ స్టే విధించింది. ఇళ్లను మొదలుపెట్టిన దశలో స్టే ఇస్తే ఏ ఇబ్బందీ వుండదు. ఇళ్లు పూర్తయిన తరుణంలో, ఇక ఇళ్లను లబ్దిదారులకు అందజేసి ఓట్లపరంగా లబ్ది పొందుతామని అధికారపార్టీ నాయకులు అంచనాలు వేసుకుంటున్న తరుణంలో ఇలా కోర్టు స్టే ఇవ్వడం తెలుగుదేశం నాయకులకు మింగుడు పడడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here