Home జాతీయ వార్తలు నింగి కెగసింది.. నేల మురిసింది

నింగి కెగసింది.. నేల మురిసింది

జిఎస్‌ఎల్‌వి… ఈ సిరీస్‌ అంటేనే ఇస్రో శాస్త్రవేత్తలకు ఎంతో టెన్షన్‌… దాని ప్రయోగం అంటేనే ఒకటే ఒత్తిడి. ఎందుకంటే పిఎస్‌ఎల్‌వి సిరీస్‌ను లొంగ తీసుకుని దానిని క్రమశిక్షణ బాటలో బుద్దిగా నడిపిస్తున్న ‘ఇస్రో’కు ఈ జిఎస్‌ఎల్‌వినే ఇంకా మింగుడు పడడం లేదు. ఒక్కోసారి బుద్ధిగా వుంటూ చెప్పిన చోటకు వెళుతుంది. మరోసారి దారిమధ్యలోనే అడ్డం తిరుగుతుంది. అలాంటి టెన్షన్‌ మధ్యే ఈ నెల 14వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుండి మరోసారి జిఎస్‌ఎల్‌విని ప్రయోగించారు. అయితే ఈసారి మొండికేయలేదు సరికదా ఎంతో క్రమశిక్షణ పాటిస్తూ చెప్పిన చోటికి చక్కగా వెళ్లిపోయింది.

అంతరిక్ష ప్రయోగాలలో మరో చారిత్రాత్మక ప్రయోగానికి షార్‌ సెంటర్‌ వేదికైంది. 14వతేదీ సాయంత్రం 5.08గంటలకు షార్‌లోని సెకండ్‌ లాంచ్‌ప్యాడ్‌ నుండి ప్రయోగించిన జిఎస్‌ఎల్‌వి మార్‌3-డి2 విజయవంతమైంది. 16.43 నిముషాల వ్యవధిలో 3423 కిలోల బరువు గల భారీ జీశాట్‌-29 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే జిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో ఇది చాలా కీలక ప్రయోగం. భవిష్యత్‌లో చంద్రయాన్‌-2, మానవ సహిత అంతరిక్ష యానంపై ఇస్రో చేయబోయే ప్రయోగాలకు ఈ ప్రయోగం పునాది వంటిది. కాబట్టి ఇది విజయ వంతం కావడం ఇస్రో అంతరిక్ష చరిత్రలో ఓ కీలక మలుపనే చెప్పాలి. ఈ ఉపగ్రహం ద్వారా ఇండియాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రయో గాన్ని ఇస్రో ఛైర్మెన్‌ శివన్‌ పర్యవేక్షించారు. ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here