Home జాతీయ వార్తలు నా ఊరే.. నా ఊపిరి!

నా ఊరే.. నా ఊపిరి!

కన్నతల్లి… జన్మభూమి… ఈ రెండు అమృత పదాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌, భారత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు. 45ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో విద్యార్థి నాయకుడి స్థాయి నుండి భారత దేశ రెండో పౌరుడు స్థాయికి ఆయన ఎదిగినా… ఈ సుధీర్ఘ ప్రయాణంలో ఆయన ఈ రెండు పదాలకు వున్న విలువను ఎప్పుడూ మరువలేదు. ఏ పదవిలో వున్నా ఎప్పుడు నెల్లూరొచ్చినా తన జన్మభూమిపై చెప్పలేని మమకారాన్ని ఆయన చాటుకుంటూనే వుంటారు. ఈ క్రమంలోనే ఈ నెల 20వ తేదీన నెల్లూరొచ్చిన ఆయన జన్మభూమిపై ప్రేమను తన హృదయాంతరాళాల్లో నుండి వచ్చిన మాటలతో పంచుకున్నారు. 20 నుండి 23వ తేదీ వరకు నెల్లూరుజిల్లాలో పర్యటించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరులోని వేదాయపాలెం రైల్వేస్టేషన్‌లో అభిమానులు ఆత్మీయస్వాగతం పలికారు. రేణిగుంట నుండి ఆయన ప్రత్యేకరైలులో ఇక్కడకు చేరుకోవడం జరిగింది. తొలుత సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌ నగర్‌లోని తన ఇంటికి చేరుకుని ఆయన బంధువులు, ఆత్మీయులు, అభిమానులు, బీజేపీ కార్యకర్తలతో ముచ్చటించారు. సాయంత్రం స్వర్ణాల చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ నెక్లెస్‌రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడే పలు పార్కులకు, మరికొన్ని అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో నెల్లూరుపై తన మనసులో వున్న ప్రేమనంతా కురిపించారు. ఒకప్పుడు తాను చూసిన నెల్లూరుకు ఇప్పటి నెల్లూరుకు ఎంతో తేడా వుందని, నెల్లూరు అభివృద్ధి చెందుతుండడం పట్ల తనకెంతో ఆనందంగా వుందని చెప్పారు. నెల్లూరు నగరాన్ని ఇకముందు ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై తన కుమార్తె దీపా వెంకట్‌ ‘నెల్లూరు నెక్ట్స్‌’ కార్యక్రమాన్ని రూపొందించిందని, ఆ కార్యక్రమానికి ప్రతిరూపంగా నెల్లూరు నగరం అభివృద్ధిపథంలో దూసుకెళుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరుజిల్లాతో పాటు ఏపిలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్నెన్ని నిధులు విడుదల చేసింది కూడా చెప్పారు.

21వ తేదీన నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో వెంకయ్య నాయుడుతో పాటు కేంద్రమంత్రులు పియూష్‌గోయల్‌లు పాల్గొన్నారు. 100కోట్లతో కార్పొరేట్‌ తరహాలో ఆధునీక రించనున్న రైల్వేస్టేషన్‌ పనులకు వారు శంకు స్థాపన చేశారు. అలాగే నెల్లూరు, చెన్నైల మధ్య ఫాస్ట్‌ మెమూ రైలును ప్రారంభించారు. పలు రైల్వే అభివృద్ధి పనులను కూడా వారు ప్రారం భించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎన్డీఏ పాలనలో రైల్వేలో సాధించిన ప్రగతిని గురించి వెంకయ్యనాయుడు, పియూష్‌ గోయల్‌లు వివరించారు.

దీనితర్వాత పొదలకూరురోడ్డులో ఎఫ్‌ఎం రేడియోస్టేషన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అలాగే వెంకటాచలం వద్ద కృష్ణపట్నం – ఓబులాపురం రైల్వేలైన్‌ శిలాఫలకాన్ని ఆవిష్క రించడంతో పాటు ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనులను ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు ప్రారంభించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య పర్యటనతో నెల్లూరులో పెద్దఎత్తున సందడి నెలకొంది. ఎక్కడచూసినా పోలీసుల హడావిడే… సైరన్‌ల మోతలే! వెంకయ్యనాయుడు 23వ తేదీ వరకు జిల్లాలో వుంటుండగా, 22వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ పర్యటనతో మరింత పండగ వాతావరణం కనిపించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here