Home రాష్ట్రీయ వార్తలు నారా వారికి.. నందమూరి లోకువ!

నారా వారికి.. నందమూరి లోకువ!

ఇటీవల సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ అందరినీ ఆకర్షిస్తోంది. ”ఎవరైనా పెళ్లి చేస్తే.. అల్లుడికి డబ్బు, బంగారం, భూములు కానుకగా ఇస్తారు, కానీ ఎన్టీఆర్‌ తన అల్లుడు చంద్రబాబుకు కుటుంబాన్నే కట్నంగా ఇచ్చాడు”… నిజంగానే ఈ పోస్ట్‌లో చాలా అర్ధముంది. నందమూరి ఇంటి అల్లుడు కాకపోతే చంద్రబాబు ఎక్కడ? ఒకవేళ రాజకీయాలలో ఉంటే ఉండొచ్చేమో… ఒక పెద్ద పార్టీ ఆయన గుప్పిట్లో వుంటుందా? 14ఏళ్లు ఏపి సిఎంగా పనిచేసే అవకాశం దక్కుతుందా? కేవలం నందమూరి ఇంటి అల్లుడు కావడమే ఆయనకు కలిసొచ్చింది. ఆ సంగతి తెలిసేనేమో… ఆయన తన కొడుకు లోకేష్‌ను కూడా నందమూరి ఇంటికే అల్లుడిని చేశాడు.

చంద్రబాబును అల్లుడిగా చేసుకోవడం దగ్గర నుండి 1985లో పార్టీలోకి తీసుకోవడం మొదలు 1995లో ఎన్టీఆర్‌ను సీఎం కుర్చీ నుండి దించే వరకు నందమూరి కుటుంబం నారా చంద్రబాబుకు ఎంతో ఉపయోగపడింది. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో నందమూరి కుటుంబసభ్యులే సహకరించారు. ఆ తర్వాత కూడా ప్రతి సందర్భంలోనూ నందమూరి కుటుంబాన్ని ఆయన ఎంతగా వాడుకోవాలో అంతగా వాడేసుకుంటున్నాడు. అదే సమయంలో నందమూరి కుటుంబసభ్యులను ఎంతగా తొక్కాలో అంతగా తొక్కేస్తున్నాడు. ముఖ్యంగా చంద్రబాబు రాజకీయ స్వార్ధానికి బలైనవారిలో నందమూరి హరికృష్ణ కుటుంబం ముం దుంటుంది. 1995లో జరిగిన మామ (ఎన్టీఆర్‌), అల్లుడు(చంద్రబాబు)ల సమ రంలో తండ్రిని కాదని హరికృష్ణ బావకు అండగా నిలిచాడు. మొదట హరికృష్ణను అక్కున చేర్చుకున్నట్లే చేర్చుకున్న చంద్ర బాబు, ఆ తర్వాత గాలికొదిలేసాడు. హరికృష్ణ తర్వాత చంద్రబాబు మీద వ్యతి రేకతతో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపిం చడం, కొన్నాళ్ళ తర్వాత దానిని మూసేసి తెలుగుదేశంలో చేరడం వంటివన్నీ జరిగి పోయాయి. ఒక్క హరికృష్ణతో సరి పెట్టాడా? తెలుగు సినిమాలలో దూసుకు పోతున్న జూనియర్‌ ఎన్టీఆర్‌పై ఒకప్పుడు సవతిప్రేమను చూపించారు. అతనిని తొక్కేయాలనుకున్నారు. అతనికి పోటీగా తమ కుటుంబంలో నుండే తారకరత్న అనే హీరోను దింపారు. అవేవీ ఫలించలేదు. 2009 ఎన్నికల్లో మళ్ళీ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇమేజ్‌ను వాడుకోవాలని చెప్పి ఆయనను ప్రచారంలో తిప్పారు. ఆ ఎన్నికలలో ఓడి పోయాక మళ్ళీ దూరం పెట్టారు. 2014 ఎన్నికలప్పుడైతే అసలు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఊసే ఎత్తలేదు. అప్పుడంతా పవన్‌కళ్యాణ్‌ భజనలో వుండిపోయాడు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో అదే హరికృష్ణ కుటుంబాన్ని వాడుకుంటున్నాడు. హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని కూకట్‌పల్లిలో తెలుగుదేశం అభ్యర్థిగా నిలబెట్టాడు. చుండ్రు స్థానంలో ‘నందమూరి’ని చేర్చారు. పేరును వాడుకోవడం ఇక్కడ కూడా జరుగుతోంది.

చంద్రబాబు కొడుకు లోకేష్‌ ఏమో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి, మంత్రి కావొచ్చు. మరి హరికృష్ణ కూతురుకు ఆ అర్హత లేదా? హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటే చుండ్రు సుహాసినిని ఎమ్మెల్సీగా పంపొచ్చు. లేదంటే గతంలో ఆమె తండ్రి వున్న రాజ్యసభ స్థానానికి ఆమెను ఎంపిక చేయవచ్చు… వాళ్ళను ఎన్నికల్లో నిలబెట్టే బదులు తన కోడలు నారా బ్రాహ్మణినే అక్కడ నిలబెట్టి ఉండొచ్చుగా! కాని, చంద్రబాబు అలా చేయడు. అక్కడ బ్రాహ్మణి ఓడిపోతే చంద్రబాబు పరువు పోతుంది. చుండ్రు సుహాసిని అలియాస్‌ నందమూరి సుహాసిని ఓడిపోతే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఈ లెక్కతోనే ‘నందమూరి’ ఇంటి పేరును తెలంగాణ ఎన్నికల్లో మరోసారి వాడుకుంటున్నాడు. నందమూరి వారసులు చంద్రబాబు వాడుకోవడం కోసమే వున్నట్లున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here