Home జిల్లా వార్తలు నామకరణ దినోత్సవం సరే… ఆచరణ ఏదీ

నామకరణ దినోత్సవం సరే… ఆచరణ ఏదీ

నెల్లూరుజిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పదేళ్ళయ్యింది. దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని ఆర్యవైశ్యుల కోరికమేరకు నెల్లూరుజిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టి అసెంబ్లీలో ఆమోదింప జేశారు. ప్రస్తుతం ఏపిలో వ్యక్తుల పేర్లు మీద మూడే మూడు జిల్లాలున్నాయి. ఒకటి ప్రకాశం, రెండోది వై.యస్‌.ఆర్‌.జిల్లా(కడప), మూడోది పొట్టి శ్రీరా ములు నెల్లూరుజిల్లా. అయితే రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పాపులర్‌ అయినంతగా మిగతా రెండు జిల్లాలు పాపులర్‌ కాలేదు. ప్రకాశం అనే పేరు పలకడానికి సులభంగా వుంటుంది. వై.యస్‌.ఆర్‌.జిల్లా కూడా ఇప్పుడిప్పుడే వాడుకలో పడుతుంది. కాని నెల్లూరుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పదేళ్ళయినా కూడా ప్రభుత్వ రికార్డులు, ప్రభుత్వ అధికార పత్రాలలో కనపడినంతగా పబ్లిక్‌లో పాపులర్‌ కాలేదు. దీనికి పేరు కొంచెం పొడుగ్గా వుండడమే కారణం కావచ్చు. ఏదిఏమైనా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని కనీసం ఆయన పేరు పెట్టిన జిల్లాను ఉచ్ఛరించడం వల్లనైనా గౌరవిద్దాం.

నెల్లూరుజిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టి పదేళ్లయిన సందర్భంగా ఈ నెల 4వ తేదీన నెల్లూరు, ఆత్మకూరు బస్టాండ్‌ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతర్జాతీయ ఆర్యవైశ్య సమాఖ్య ఉపాధ్యక్షులు కె.వి.చలమయ్య, నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, డిప్యూటి మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌, మాజీఎమ్మెల్యే సి.వి.శేషారెడ్డి, మాజీ జడ్పీ ఛైర్మెన్‌ పి.చెంచలబాబుయాదవ్‌, డిసిసి అధ్యక్షులు పనబాక కృష్ణయ్య, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు చేవూరు దేవకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొని అమరజీవికి నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here