Home జిల్లా వార్తలు నాతో వచ్చేదెవరు..? నా వెంట నడిచేదెవరు…?

నాతో వచ్చేదెవరు..? నా వెంట నడిచేదెవరు…?

దాదాపు మూడు నెలలుగా జిల్లాలో జరుగుతున్న ఒక రాజకీయ చర్చకు సెప్టెంబర్‌ 2వ తేదీన తెరపడబోతోంది. మరో కొత్త చర్చకు ఆరోజే తెరలేవబోతోంది. ఈ మూడు నెలలుగా సాగిన చర్చ మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశాన్ని వీడుతాడా? వైసిపిలో చేరుతాడా? వైసిపిలో చేరితే ఎక్కడ నుండి పోటీ చేస్తాడు? అసలు జగన్‌ ఆయనను పార్టీలో చేర్చుకుంటాడా?

ఇలా ఎన్నో సందేహాలు… దీనికితోడు ఆనం పార్టీ మారే విషయంలో జరిగిన జాప్యం… అనుమానాలను మరింతగా పెంచింది. వాస్తవంగా జరిగిన పరిణామాలకు జరగనివి కూడా కొన్ని తోడై ప్రచారంలోకి వచ్చాయి.

ఎట్టకేలకు వై.యస్‌. వర్ధంతి అయిన సెప్టెంబర్‌ 2వ తేదీన విశాఖపట్నంలో వై.యస్‌.జగన్‌ సమక్షంలో ఆయన వైసిపి కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధమైంది.

మరి ఆనం పార్టీలో చేరుతున్నాడంటే ఆయన వెనుక బలముండాలి కదా! పార్టీ వల్ల ఆయనకు రాజకీయ ప్రయోజనం ఉంటుంది. అలాగే ఆయన వల్ల కూడా పార్టీ బలం పుంజు కుందని చూపించాలి కదా! అందుకే ఆనం తరఫున బల సమీకరణకు తీవ్ర ప్రయత్నాలే జరిగాయి. ఆత్మకూరు నియోజక వర్గంలో ఆనంకు సొంత అనుచర బలం బాగానే వుంది. అయితే 2014 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా నామి నేషన్‌ వేసి వదిలేసాడు. ఎలక్షన్‌ను పట్టించుకోలేదు. దీంతో ఆయన అనుచరులైన వాళ్ళు ఎక్కువశాతం మంది వైసిపిలోకి, కొద్ది శాతం మంది టీడీపీలోకి వెళ్లిపోయారు. వైసిపిలో చేరినవాళ్లు రేపైనా, అభ్యర్థి ఎవరైనా వైసిపికే మద్దతు పలుకు తారు. కాకపోతే ఆనం పార్టీలో చేరాడుకాబట్టి గౌతంరెడ్డికి బదులు ఆనం రామనారాయణరెడ్డి వద్ద ఎక్కువుగా కనిపిస్తుం టారు. ఆత్మకూరులో గతంలో గౌతంకి పనిచేసిన వాళ్లొచ్చి ఇప్పుడు ఆనం పంచన చేరడం వల్ల పెద్దగా లాభం లేదు. ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి ఎంత మంది లీడర్‌లను, ఎంత కేడర్‌ను వైసిపిలోకి తీసుకురాగలడనే దానిపైనే చర్చ నడుస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనంకు బలమైన మద్దతుదారులుగా వున్న వాళ్ళలో బొల్లినేని కుటుంబం ఒకటి! డీసీసీబీ ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి మరొకడు. బొల్లినేని కృష్ణయ్యను ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలోకి తెచ్చారు. మెట్టుకూరు ధనుంజయరెడ్డి కూడా తెలుగుదేశంలో వుండడమే కాక ఆత్మకూరు నియోజకవర్గానికి ‘రెడ్డి’ సామాజికవర్గం నుండి అభ్యర్థిని నిర్ణయించాల్సి వస్తే ఆయన పేరే ప్రతిపాదనలో వుంది. కాబట్టి వీళ్లిద్దరూ ఆనం వెంట వెళ్ళే అవకాశాలు లేవు. ఇక మండల స్థాయి నాయకులు ఎంతమంది వస్తారన్నది చేరేనాటికి గాని లెక్కరాదు. ప్రస్తుతానికైతే ఆయన అన్ని మండలాలలోని నాయకులను కలుస్తూ తన వెంట వైసిపిలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రజల్లో సానుకూలత…

నాయకులు వచ్చినా రాకొన్నా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల్లో ఆనం రామనారాయణరెడ్డి పట్ల సానుకూల అభిప్రాయముంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయన వల్లే అభివృద్ధి జరిగిందనే నమ్మకముంది. వైసిపికి ఇది కలిసొచ్చే అంశమే!

నియోజకవర్గాలలో కొత్త ఊపు…

జిల్లా వైసిపిలో ఒకరిద్దరు నాయకులు తప్పితే ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. సరికదా స్వాగతిస్తున్నారు కూడా! ఆనం రామనారాయణరెడ్డి చేరడంవల్ల ఆత్మకూరు నీయోజకవర్గంలోనే కాక సర్వేపల్లి, వెంకటగిరి, నెల్లూరు సిటీ, రూరల్‌, ఉదయగిరి నియోజకవర్గాలలో వైసిపికి ఎంతో కొంత అదనపు బలం చేకూరుతుందనడంలో అనుమానం లేదు! ఆయా నియోజకవర్గాలలో పోటీ చేయబోయే అభ్యర్థులకు ఆయన చేరడం వల్ల ఉపయోగమేగాని నష్టం లేదు.

పోటీ ఎక్కడ?

ఆనం పార్టీలో చేరేది ఖాయం. మరి ఎక్కడ నుండి పోటీ చేస్తాడన్నదానిపై స్పష్టత రాలేదు. ఆత్మకూరు నాకే కావాలని సిటింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి పట్టుబడితే ఆయన వెంకటగిరి నుండి పోటీ చేయాల్సి రావచ్చు. అయితే వెంకటగిరి ఆయనకు కొత్తవుతుంది. ఒకప్పుడు రాపూరు నియోజకవర్గంలోని సగం ప్రాంతం వెంకటగిరి నియోజకవర్గంలో వున్నప్పటికీ ఆ ప్రాంతంతో టచ్‌ పోయి ఆయనకు పదేళ్ళవుతుంది. కాబట్టి వెంకటగిరిలో నిలబడితే జీరో నుండి ఎన్నికల యుద్ధాన్ని మొదలు పెట్టాల్సి వుంటుంది. అలాకాకుండా ఆత్మకూరు ఇస్తే బాగా అలవాటైన ప్రాంతం కాబట్టి తన నియోజకవర్గంతో పాటు తమకు పట్టున్న మిగిలిన నియోజకవర్గాలపై కూడా కొంత దృష్టి పెట్టే అవకాశముంటుంది.

అసెంబ్లీ కాకుంటే లోక్‌సభ!

ఆనం రామనారాయణరెడ్డిని అసెంబ్లీ కోణంలో కంటే లోక్‌సభ కోణంలో చూస్తే బెస్ట్‌ ఆప్షన్‌ కాగలడు. ఆదాల ప్రభాకర్‌ రెడ్డి టీడీపీని వీడి వైసిపిలోకి వస్తే ఆదాలే లోక్‌సభకు బెటర్‌ క్యాండిడేట్‌! ఆదాల తెలుగుదేశంలోనే ఉండి లోక్‌సభకు పోటీ చేస్తే ఆయనకు వైసిపి నుండి ధీటైన అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కాగలడు! అంతేగాని గతంలో లాగే ఈసారి ఆదాలకు మేకపాటి రాజమోహన్‌రెడ్డే ప్రత్యర్థి అయితే లోక్‌సభే కాదు, లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో కూడా ‘నువ్వా- నేనా’ అనే రీతిలో పోటీ నడవడం ఖాయం. రాజకీయంగా ఆయనను ఏ కోణంలో వాడుకుంటే మంచిది అన్నదానిపై వైసిపి అధిష్టానం లోతుగా విశ్లేషణ చేయాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here