Home జాతీయ వార్తలు నమ్మకం నిలబెట్టింది

నమ్మకం నిలబెట్టింది

అంతరిక్ష ప్రయోగాలలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో అనితర విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లోనే కాదు, జిఎస్‌ఎల్‌వి సిరీస్‌లోనూ సక్సెస్‌ కాగలమని చాటి చెప్పింది. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4.10 నిముషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ప్రయో గించిన జిఎస్‌ఎల్‌వి-ఎఫ్‌11 విజయవంతమైంది. ఈ రాకెట్‌ ప్రయోగం ద్వారా 2250 కిలోల బరువుగల జీశాట్‌-7ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది 8ఏళ్ళ పాటు తన సేవలు అందిస్తుంది. కమ్యూని కేషన్‌ రంగంలో మరింత మెరుగైన సేవలకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. వైమానిక, రక్షణ శాఖలకు ఈ ఉపగ్రహం సేవలందిస్తుంది.

మొత్తం మూడు దశలలో ఈ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. 19నిముషాల 20 సెకన్లలో నిర్ణీత కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. మూడో దశలో కీలకమైన క్రయోజనిక్‌ దశ శాస్త్రవేత్తలు నిర్దేశించిన విధంగా పూర్తయ్యింది. ప్రయోగం విజయ వంతం కాగానే శాస్త్రవేత్తలు ఒకర్నొకరు ఆలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో ఛైర్మెన్‌ డాక్టర్‌ కె.శివన్‌ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. పిఎస్‌ఎల్‌వి-సి43ని ప్రయోగించి 20 రోజులు గడవక ముందే మరో కీలక మైన రాకెట్‌ ప్రయోగం జరిపి విజయం సాధిం చిన ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని పామరుడి నుండి ప్రధాని వరకు అందరూ అభినంద నలతో ముంచెత్తారు.

పూర్తి విశ్వాసం…

ఈ ప్రయోగం విజయవంతంతో జిఎస్‌ఎల్‌వి సిరీస్‌పై ఇస్రోకు పూర్తిస్థాయి నమ్మకం ఏర్పడింది. 2001 ఏప్రిల్‌ 18న జిఎస్‌ఎల్‌వి-డి1 పేరుతో ఇస్రో భారీప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. 2010 ఏప్రిల్‌ 15న పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయోజనిక్‌ ఇంజన్‌తో జిఎస్‌ఎల్‌వి-డి3ని ప్రయోగించగా, అది విఫలమైంది. అయితే, మన శాస్త్రవేత్తలు మళ్ళీ పట్టుదలతో అదే యేడాది డిసెంబర్‌ 25న రష్యా సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో తయారుచేసిన ఇంజన్‌తో చేసిన ప్రయోగం కూడా విఫలం అయ్యింది. 2001 నుండి 2010 మధ్య జిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో 7ప్రయోగాలు జరగ్గా 3 విఫలమయ్యాయి. 2014 నుండి ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్‌ ఇంజన్‌ను జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలకు వాడసాగింది. 2014 జనవరి 5వ తేదీ నుండి ఇప్పటివరకు వరుసగా సొంత క్రయోజనిక్‌ ఇంజన్లతో 7 ప్రయోగాలు నిర్వహించగా, అన్నీ విజయవంతం అయ్యాయి. రాబోయే కాలంలో అత్యంత బరువైన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడమే కాకుండా మానవ సహిత అంతరిక్ష యాత్రలకు చంద్రయాన్‌-2 లాంటి భారీ ప్రయోగాలకు ఈ ప్రయోగం పునాది కానుంది. అంతరిక్ష పరిజ్ఞానంలోనే కాదు, అంతర్జాతీయంగా, అంతరిక్ష వాణిజ్యంలో కూడా భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here