Home జిల్లా వార్తలు నడిచింది కొంత దూరమే.. నడవాల్సింది ఇంకా ఎంతో ఉంది!

నడిచింది కొంత దూరమే.. నడవాల్సింది ఇంకా ఎంతో ఉంది!

ఒక ఆశయం ఎందరినో కంకణబద్ధులను చేసింది. ఒకరి లక్ష్యం మరెందరికో స్ఫూర్తినిచ్చింది. ఒకరొకరుగా అందరూ కలసి లక్ష్యసాధనలో ఉండగానే..విధివశాత్తూ వారిలో ప్రధానమైన వ్యక్తే దూరమయ్యారు. కస్తూరిదేవి విద్యాలయాన్ని ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే శ్రీమతి పొణకా కనకమ్మగారు విద్యాలయం క్రమంగా అభివృద్ధి చెందుతున్న దశలో కన్నుమూయడం అందరికీ ఆవేదన కలిగించింది. నడిచింది కొంతదూరమే అయినా.. నడవాల్సింది ఇంకా ఎంతో ఉంది.. సాధించాల్సింది మరెంతో ఉంది.

బాలికలకు విద్య నేర్పడం ద్వారా వారి కుటుంబాలు బాగుపడతాయి.. సమాజం కూడా బాగుపడుతుందనే సదాశయంతో, ఎంతో కష్టపడి.. ఎన్నో కష్టనష్టాలకోర్చి జాతీయభావాలతో విద్యాలయాన్ని నెలకొల్పిన ధీర నారీమణి..ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు..కస్తూరిదేవి విద్యాలయం వ్యవస్థాపకురాలైన శ్రీమతి పొణకా కనకమ్మగారు. ఆమె మరణించినా ఆమె స్ఫూర్తే విద్యాలయాన్ని నేటికీ ముందుకు నడిపిస్తోంది. కనకమ్మగారు భౌతికంగా లేకపోయినా.. ఆమె ఆశయాల బాటలో నడుస్తూ.. విద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి అప్పట్లో కమిటీ తన కృషిని కొనసాగించింది. ఆ దశలో కూడా ఎన్నో అవస్తలు తప్పలేదు. విద్యాలయంలో ఉపాధ్యాయుల కొరత బాగా ఉండడం, ఆశించిన

ఉత్తీర్ణత రాకపోవడం, విద్యాలయానికి అవసరమైన వసతులన్నీ పుష్కలంగా లేకపోవడం వంటి ఎన్నో సమస్యలను కమిటీవారు అధిగమించాల్సి వచ్చింది. అయినా.. కార్యసాధకులైన వారు..సమస్యలను చూసి ఎప్పుడూ వెనుకంజ వేయరు కనుక..అన్ని ఇబ్బందులనూ అధిగమించేందుకు విద్యాలయం కమిటీ మరింత ధీరోదాత్తంగా ముందడుగు వేసింది. కస్తూరిదేవి విద్యాలయం పూర్వకథను పరిశీలిస్తే… నాటి కమిటీ విశేష కృషితో పాటు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా మనకు కనిపిస్తాయి.

జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కస్తూరిదేవి విద్యాలయాన్ని నెలకొల్పిన పొణకా కనకమ్మగారి మరణం(1963 సెప్టెంబర్‌ 15) అందరినీ కలచి వేసింది. తొలి నుంచి ఈ విద్యాలయ స్థాపన అనే మహాయజ్ఞంలో పాల్గొన్న వారంతా కనకమ్మ గారు ఇక లేరనే ఆవేదన నుంచి కొద్దిరోజులు బయట పడలేకపోయారు. అయితే, విద్యాలయం అభ్యున్నతే పరమావధిగా భావించిన కనకమ్మగారి ఆశయాల బాటలో నడిచి.. ఆమె కోరుకున్న విధంగానే ఈ బాలికా విద్యాలయాన్ని ప్రగతిపథంలో నడిపిం చేందుకు అందరూ కంకణబద్ధులయ్యారు. విద్యాలయాన్ని సరైనరీతిలో అభివృద్ధి చేయడమే కనకమ్మగారికి సరైన నివాళి అని భావించిన కమిటీలోని ప్రముఖులంతా విద్యాలయం అభివృద్ధికి… తద్వారా బాలి కల అభ్యున్నతికి బాటలు వేస్తూ..మరింత పట్టుదలతో కృషిచేయడం ప్రారంభించారు. 1964 మార్చి 2న జరిగిన సమావేశంలో.. ఈ విద్యా లయం స్థాప నకు, అభ్యున్న తికి శ్రీమతి పొణకా కనకమ్మగారు చేసిన అపార మైన కృషికి గుర్తుగా కనకమ్మగారి చిత్రపటాన్ని విద్యాలయంలో ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అదేవిధంగా ప్రముఖ వదాన్యుడు..ఈ విద్యాలయానికి తొలినుంచి విశిష్టమైన సేవలందించిన శ్రీ రేబాల పట్టాభిరామిరెడ్డి గారి చిత్రపటాన్ని కూడా విద్యాలయంలో ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఆ తర్వాత, పొణకా కనకమ్మగారి స్థానంలో శ్రీ మరుపూరు పిచ్చిరెడ్డిగారిని ఈ విద్యా లయానికి సభ్యులుగా కోఆప్ట్‌ చేసుకుంటూ కమిటీ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో నాటి కమిటీ సారధులు శ్రీయుతులు టి.రామిరెడ్డిగారు, ఏ.పద్మ నాభరెడ్డిగారు, ఎం.ఆదిశేషారెడ్డిగారు, ఎం.పిచ్చిరెడ్డి గారు, ఎన్‌.శ్రీరామమూర్తిగారు, వై.రామయోగిగారు, శ్రీమతి అన్నపూర్ణమ్మగారు ఉన్నారు.

ఉత్తీర్ణత పెంచేందుకు..

కమిటీ నిర్విరామ కృషి…

ఇదే ఏడాది..అంటే 1963-64కు సంబంధించి వచ్చిన పరీక్షా ఫలితాలు ఏమంత ఆశాజనకంగా లేకపోవడం కమిటీ సభ్యులకు బాధ కలిగించింది. అయితే, మరింత దీక్షతో..పట్టుదలతో విద్యాబోధన మెరుగుపరచాలని, విద్యార్థినుల ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకోవాలని 19-7-1964లో జరిగిన కమిటీ సమావేశంలో గట్టిగా తీర్మానించుకున్నారు. ఈ సమావేశంలోనే విద్యాలయానికి సంబంధించిన అన్ని విషయాలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. 29 అంశాలపై వివరంగా చర్చించి అవసరమైన వాటికి అమోదం తెలిపారు. ముఖ్యంగా ట్వల్త్‌క్లాస్‌ పరీక్షా ఫలితాలను దృష్టిలో పెట్టుకుని విద్యాబోధన బాగా మెరుగుపరచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకున్నారు. ఫిజికల్‌ సైన్స్‌, నాచురల్‌ సైన్స్‌, మేథమేటిక్స్‌లలో విద్యార్థినులకు మార్కులు బాగా తగ్గడంతో ఆయా సబ్జెక్టులను ప్రత్యేకంగా మరికొన్ని గంటలపాటు వారికి బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయులను కూడా ఏర్పాటుచేశారు. విద్యాలయానికి, హాస్టల్‌కు సంబంధించిన అన్ని రకాల జమాఖర్చుల లెక్కల విషయాలను ఈ సంద ర్భంగా కూలంకుషంగా పరిశీలించారు.

అటు విద్యాలయం లోను, ఇటు హాస్టల్‌లోను విద్యార్థినులకు అవసరమైన మరిన్ని వస తుల ఏర్పా టుకు అందరూ చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. ఇదిలావుంటే, కాంపౌండ్‌వాల్‌ పూర్తిస్థాయిలో నిర్మాణం కాక పోవడంతో విద్యాలయం వద్ద రౌడీల బెడద కూడా దాపురించడం మరో సమస్యగా తయా రైంది. అప్పట్లో ఇలాంటి బాధలెన్నో ఉండేవి. ఈ విషయాన్ని కమిటీ తీవ్రంగా పరిగణిస్తూ ఆ రౌడీలపై తగు చర్యలు తీసుకునేందుకు నిర్ణయించారు. అంతే కాక, కాంపౌండ్‌వాల్‌ను పూర్తిస్థాయిలో నిర్మిం చేందుకు సంకల్పించారు.

ఆ తర్వాత రోజుల్లో కమిటీ సభ్యునిగా ఏళ్ళ తరబడి సేవలందించిన శ్రీయుతులు ఏ.పద్మనాభరెడ్డి గారు రాజీనామా చేశారు. ఆ విషయాన్ని కూడా ఈ సమా వేశంలో చర్చించుకున్నారు. ఇలా.. అన్ని విషయాలను కమిటీవారు గంటల తరబడి చర్చించిన తర్వాతనే, విద్యాలయం పురోభివృద్ధి దృష్ట్యా.. అందరికీ అమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకునేవారు.

అద్దె డబ్బుల కోసం..

ఎప్పుడూ కక్కుర్తి పడింది లేదు!

స్థలాల లీజును.. అప్పట్లోనే నిర్ద్వందంగా తిరస్కరించిన కమిటీ

ఎట్లయితేనేం.. విద్యాబోధన మెరుగు పరచేందుకు కమిటీ గట్టిగా తీసుకున్న చర్యల తర్వాత 1964-65 సంవత్సరంలో ట్వల్త్‌క్లాస్‌ ఉత్తీర్ణత శాతం కొంత మెరుగు పడడం కమిటీవారికి కొంత సంతృప్తి నిచ్చింది. అయినా మరింతగా బోధన మెరుగుపరచి ఉత్తీర్ణతను బాగా పెంచేం దుకు కమిటీ తనవంతు ప్రయత్నాలన్నీ చేసేందుకు 7-7-1965లో జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయించుకున్నారు.

అదేవిధంగా, 6వ తరగతిలో ఇంగ్లీష్‌ మీడియంకు ఒక తరగతిని అదనంగా ఏర్పాటుచేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. విద్యార్థినుల చదువుకు ఏ లోటు లేకుండా, బోధనను మరింతగా మెరుగుపరచి, వారి విద్యాభివృద్ధికి కమిటీ చర్యలు తీసుకుంటుండంతో క్రమేణా ఉత్తీర్ణతాశాతం కూడా మెరుగుపడుతూ వచ్చింది. కృషితో నాస్తి దుర్భిక్షమ్‌ అన్నట్లుగా.. పట్టుదలతో.. అచంచల కృషితో అన్ని సమస్యలను కమిటీ అధిగమిస్తూ వచ్చింది.

ఆ తర్వాత, 4-9-1965లో జరిగిన సమావేశంలో కమిటీ వద్దకు ఒక ప్రతిపాదన వచ్చింది. కస్తూరిదేవి విద్యాలయం వద్ద కొంత స్థలం లీజుకు ఇవ్వాలని కోరుతూ వచ్చిన ప్రతిపాదన అది. ఈ విద్యాలయం ఉత్తరపు గోడవైపున్న ప్రాంతంలో తమకు మూడెకరాల స్థలాన్ని లీజుకు కేటాయిస్తే, అందులో పూలతోట సాగుచేసుకుంటామని, ఆ స్థలాన్ని పదేళ్ళకు లీజుకు ఇవ్వాలని కోరుతూ వచ్చిన ఆ ప్రతిపాదనను కమిటీ.. ఎలాంటి తటపటాయింపులు లేకుండా తిరస్కరించింది. అదేవిధంగా, 1966 ఫిబ్రవరి 7వ తేదిన మరొక ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ విద్యాలయం దక్షిణవైపు ఉన్న స్థలాన్ని 70 రోజుల పాటు లీజుకు ఇస్తే, అందులో ఒక చిన్న ఎగ్జిబిషన్‌ను దాంతో పాటు అమ్యూజ్‌మెంట్‌ పార్కును ఏర్పాటుచేసుకుంటామని, అందుకు నెలకు 500 రూపాయల వంతున విద్యాలయం వారికి అద్దె చెల్లిస్తామని కోరుతూ వచ్చిన ఆ ప్రతిపాదనను కూడా కమిటీ అనుమతించలేదు. ‘పర్మిషన్‌ రిప్యూజ్డ్‌’ అంటూ కమిటీ నిర్ద్వందంగా తిరస్కరించింది.

ఎందరోవదాన్యులు, సహృదయులైన వారందరి సహకారంతో బాలికల విద్యకోసం విద్యాలయం నెలకొల్పేందుకు ఎంతో కష్టపడి సాధించుకున్న కస్తూరిదేవి స్థలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ లీజుకు ఇచ్చేందుకు కమిటీ అంగీకరించేది కాదు.

అద్దె డబ్బుల కోసం కక్కుర్తిపడి స్థలాలను ఇతరులకు ధారాదత్తం చేయడం కమిటీకి ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. తమపై ఎన్ని ఒత్తిడులు వచ్చినా… కమిటీ తమ నిర్ణయాలను ఏనాడూ మార్చుకునేది కాదు. విద్యాలయం అభివృద్ధితో పాటు, విద్యాలయం స్థలాల పరిరక్షణ పట్ల కమిటీవారికి ఎంత ఖచ్చితమైన అవగాహన ఉండేదో తెలుసుకునేందుకు ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే!… ఇవన్నీ నాటి మహనీయుల చిత్తశుద్ధికి.. నిబద్దతకు నిదర్శనాలేనని చెప్పక తప్పదు!…

తిక్కవరపు రామిరెడ్డి వారసులం అంటున్న…

ప్రత్యూషారెడ్డి గారూ!.. మీకిది తగునా…?

స్వర్గీయ తిక్కవరపు రామిరెడ్డి గారి మనుమరాల్ని అంటూ శ్రీమతి ప్రత్యూషారెడ్డి పాతపేపరు వేదికగా ఓ లేఖ వ్రాసినట్లుగా ఆ పేపరు ఇటీవల ప్రచురిం చింది. ఆ లేఖలోని సారాంశాన్ని పరిశీలిస్తే ఎంతో ఉన్నత కుటుంబానికి చెందిన తిక్కవరపు రామిరెడ్డి గారి మనుమరాలు ఇంతటి చండాలమైన పద జాలాన్ని, పచ్చి అబద్ధాలని రాసే స్థాయికి దిగజారి పోయిందా..? లేక ఆమెను అడ్డం పెట్టుకుని వేరెవ రైనా ఆ నీచపు భాషను రాసారా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది.

2001లో అప్పటి కమిటి ఆమోదంతో మేనకూరు గోపాలకృష్ణారెడ్డి అభ్యర్ధన మేరకు జి.వి.కె.రెడ్డి కమిటీలోకి కమిటీ ఆమోదంతోనే రాచమార్గాన ప్రవేశిస్తే, జి.వి.కె.రెడ్డి దొడ్డిదారిన కమిటీలో ప్రవేశిం చాడని ఆమె ప్రస్తావించడం ఆమె అవివేకానికి నిదర్శ నంగా కనిపిస్తోంది. అంతేకాకుండా మల్లెతోటలను ఖాళీ చేయించడానికి జి.వి.కె.రెడ్డి కేవలం 6లక్షల రూపాయలే ఖర్చు చేశాడని చెప్పడం ఆమె అమాయ కత్వాన్ని రుజువు చేస్తుంది. ఓ వైపు సంస్థ కోసం జి.వి.కె.రెడ్డి చిల్లిగవ్వ కూడా ఖర్చుపెట్టలేదని చెప్తూనే ఇప్పుడు మరోవైపు ఆయన ఇచ్చింది కేవలం 6లక్ష లేనని చెప్పడం హాస్యాస్పదంగా వుంది.

జె.వి.రెడ్డి సెక్రటరీ మరియు కరెస్పాండెంట్‌గా, ఆయన సారధ్యంలో ఇటీవల వరకూ సభ్యులుగా కొనసాగిన జి.వి.కె.రెడ్డిని, పి.వి.ప్రసన్నరెడ్డిని, నందనారెడ్డిని, మాగుంట పార్వతమ్మని, వేణుంబాక వెంకటకృష్ణారెడ్డిని, డేగా అనూరాధమ్మని వేలిముద్రలు వేసే వారితో పోల్చడం ప్రత్యూషారెడ్డి మూర్ఖత్వానికి తార్కాణం అనిపిస్తోంది.

ఆస్తులతో అభివృద్ధి జరుగుతుందా…?

ఇక ఆమె చివరగా పేర్కొన్న అంశాలు చూస్తే ఆమె అంతర్గత ఆలోచనల ప్రతిరూపాలుగా ఆమె అభిప్రాయాలు కనిపిస్తాయి. సంస్థకు 800కోట్ల రూపాయలు ఆస్తులున్నాయని, అభివృద్ధి చేయాలంటే ఆ ఆస్తులు చాలని, ఎవరి భిక్ష అవసరం లేదంటూ ఆమె వ్రాసుకొచ్చారు. అంటే ఉండే ఆస్తులను అమ్మేసి సంస్థను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన నందనా రెడ్డిని ఆమె సమర్ధిస్తుందా..?

ఆస్తులు అమ్మేవారా… రక్షించేవారా…

ఎవరు రాబందులు…?

ఓ వైపు సంస్థ ఆస్తులను విడిపించింది జి.వి.కె. రెడ్డి అని, అందుకు తన వద్ద సాక్ష్యాలు వున్నాయని చెప్తూనే.. నిజానికి ఆనాడు లక్షలాది రూపాయలు చెల్లించి సంస్థ ప్రాంగణంలోని మల్లెతోటలు ఖాళీ చేయించి, అన్యాక్రాంతంలో వున్న సంస్థ ఆస్తులను రక్షించి, విడిపించిన జి.వి.కె.రెడ్డిని రాబందుతో పోలుస్తూ.. ‘ఇప్పటివరకూ దోచుకుతిన్న రాబందులు రాజీనామా చేయాలని’ ఆమె ఆ లేఖలో కోరడం చూస్తే ఆమె మానసిక స్థితి మనకి అర్ధమౌతుంది. ఆమె చెప్పినట్లుగా ఆయన ఒకవేళ 6లక్షలే ఇచ్చున్నా, 2001లో 6లక్షల రూపాయలంటే ఈరోజు దాని విలువ ఎంతో ఆమే ఆలోచించుకుంటే బాగుంటుంది. సంస్థను అమ్మాలని చూసేవాళ్ళని ”రాబందులు”గా పేర్కొనడానికి బదులుగా ఆస్తులను కాపాడుకొస్తున్న వారిని రాబందులనడం విడ్డూరంగా ఉంది.

అసలు ఈ లేఖ ఆమె రాసిందా లేక ఆమెను వెనకుండి నడిపిస్తున్న ”ముఠామేస్త్రి” ఆమె పేరును వాడుకున్నాడా అన్న అనుమానం కూడా ఆమె బంధువులలోనే కలుగుతోంది.

అనసూయమ్మ, శకుంతలమ్మల పేరుతో

దొంగ లేఖ…!

ఇక కస్తూరిదేవి స్థాపనలో తమ పాత్రను ప్రస్తా విస్తూ…. అభివృద్ధి కోసం తన బంధువులు విజయ నారాయణరెడ్డిని, నందనారెడ్డిని తీసుకోవాలంటూ నందనారెడ్డి ప్రతిభా పాటవాల్ని కీర్తిస్తూ తిక్కవరపు రామిరెడ్డి గారి సోదరీమణులు శ్రీమతి అనసూయమ్మ, శకుంతలమ్మగార్లు డిసెంబర్‌ 2, 2012న రాసినట్లుగా ఓ లేఖను కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రచురింపజేసుకుంది. అయితే జె.వి.రెడ్డి దగ్గర నుండి ఆ లేఖను ‘లాయర్‌’ సంపాదించింది. అసలు ఆ లేఖ వాళ్ళు రాయలేదని, వాళ్లెప్పుడూ తనకు తమ స్వదస్తూరితోనే లేఖ వ్రాసేవాళ్ళని చెప్తూ అక్టోబర్‌ 2వ తారీఖు 2012న టైపింగ్‌ ద్వారా తనకు పంపిన లేఖను చూపించారు. అందులో వున్న సంతకాలు రెండూ అటు అనసూయమ్మది కాని ఇటు శకుంతలమ్మది కానీ కాదని, వాళ్లు ఏనాడూ తమ పేర్ల తరువాత రెడ్డి అనే పదాలు వాడరని, గతంలో శకుంతలమ్మ తనకు రాసిన కొన్ని లేఖలను ఆయన చూపించారు. ఆ లేఖల్లో వున్న సంతకానికి, ఆమె పంపిందని చెప్తూ ప్రచురించబడిన లేఖలో వున్న సంతకానికి అసలు పొంతనే లేదు.

లేఖపైన తారీఖు అక్టోబర్‌ 2 అని వుంటే అది డిసెంబర్‌ 2 అని ప్రత్యూషారెడ్డి ప్రస్తావించడమే అసలు ఆ లేఖ వెనుక వున్న గూడుపుఠాణి మనకు అర్ధమైపోతుంది. ఎప్పుడో 2012లో అనసూయమ్మ శకుంతలమ్మలు జె.వి.రెడ్డికి రాసిన లెటర్‌ అంటూ ఇప్పుడు ప్రత్యూషారెడ్డి ఆ లేఖను బయటపెట్టిందంటే ఆ లేఖ ప్రతి అసలు ఆమెకు ఎక్కడనుండి లభిం చిందో… ఆనాడు ఎవరి డైరెక్షన్‌లో ఆ లేఖ తయారై వుంటుందో మనం ఊహించుకోవచ్చు. 2012లో సంస్థ ఆస్తులను అమ్మేద్దాం అని నందనారెడ్డి పెట్టిన ప్రతిపాదనను కమిటి తిరస్కరించిన కొద్దికాలంలోనే ఈ లేఖ జె.వి.రెడ్డికి అందిందంటే ఆ లేఖ ఎవరు రాసారో.. ఆ లేఖలో శకుంతలమ్మ, అనసూయమ్మల సంతకాలు ఎవరు చేశారో మనం వూహించుకోవచ్చు.

జి.వి.కె.రెడ్డిపై ఎందుకంత కక్ష…?

ప్రపంచమే ఆయన పేరువింటేనే ఆయనను గుర్తుపట్టే స్థాయికి ఎదిగిన జి.వి.కె.రెడ్డికి ఇప్పుడు 83యేళ్ళ వయస్సులో తన స్వంత జిల్లాలో కస్తూరిదేవి విషయంలో స్వార్ధం ఎందుకు వుంటుందో సంయ మనంతో ఆలోచిస్తే ఎవరికైనా అసలు నిజాలు అర్ధమైపోతాయి. ఇన్నేళ్ళు కస్తూరిదేవి విద్యాలయం కోసం దాదాపు 2కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే కాకుండా ఇప్పుడు కోటి రూపాయలతో భవన మరమ్మతులు చేపట్టి, బాలికల కోసం అధునాతన టాయిలెట్లు నిర్మిస్తూ మరోవైపు సంస్థను కనీవినీ వూహించని స్థాయిలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడానికి ఆయన ముందుకు వస్తే… ఎవరో ఒక వ్యక్తి తన స్వప్రయోజనాల కోసం చేస్తున్న రాద్ధాం తానికి తోడుగా నిలిచి ఆయనపైన అదేపనిగా

రాళ్ళు వేయడం, మంచి వ్యక్తిపై బురద చల్లి నిరాధార ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు. తిక్కవరపు రామిరెడ్డి గారి వారసులు విజ్ఞతతో ఆలోచించాలి. రాత్రికి రాత్రి ఆ కమిటీలోకి వచ్చి సంస్థని, సంస్థ ఆస్తులను ఆమ్మేసి సర్దుకోవాలనే ఆలోచన మానేసి కొంత కాలం వేచివుంటే జి.వి.కె.రెడ్డి చేయబోయే అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. వ్యక్తిగత దూషణే ధ్యేయంగా దాతల పేరు చెప్పుకుని సంస్థ పురోగతిని అడ్డుకోవడం ఎంతవరకూ సమంజసమో వారే ఆలోచించుకోవాలి.

ఎవరో ఒక వ్యక్తి స్వార్ధం కోసం వీళ్ళు పావులుగా మారి చరిత్ర కలిగిన కుటుంబ గౌరవాన్ని బజారు పాలు చేయడం తమ పెద్దల ఆత్మలను క్షోభ పెట్టినట్లే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here