Home జిల్లా వార్తలు ‘దేశం’ సిటింగ్‌లలో సీటు కలవరం

‘దేశం’ సిటింగ్‌లలో సీటు కలవరం

నెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. ఉదయగిరి నుండి బొల్లినేని రామారావు, కోవూరు నుండి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వెంకటగిరి నుండి కురుగొండ్ల రామకృష్ణ 2014 ఎన్నికల్లో గెలిచారు. వీరు కాకుండా గూడూరు నుండి వైసిపి ఎమ్మెల్యేగా గెలిచిన పాశం సునీల్‌కుమార్‌ కూడా ఆ తర్వాత టిడిపిలో చేరాడు. తెలుగుదేశం నుండి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలుండగా ఒక్కరి మీద కూడా వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల్లో సానుకూలత లేదు. ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వురది. తెలుగుదేశం పార్టీయే స్వయంగా ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

చంద్రబాబు సీట్లు ఇచ్చే విషయంలో సర్వేలను, టెక్నాలజీని ఎక్కువుగా నమ్ముతాడు. కాబట్టి సిటింగ్‌ ఎమ్మెల్యేలైన ఈ నలుగురికీ చంద్రబాబు చూస్తూ చూస్తూ మళ్ళీ సీట్లిస్తాడా? ఒకవేళ వీళ్ళకు సీట్లు ఇవ్వకూడదు అనుకుంటే వారి స్థానాలలో వారికంటే ధీటైన ప్రత్యామ్నాయ అభ్యర్థులున్నారా? ఉదయగిరిలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై వ్యతిరేకత వుంది. ఈసారి ఆయనకు సీటు ఇవ్వొద్దని స్థానిక తెలుగుదేశం నాయకులే కొందరు బహిరంగంగా కోరుతున్నారు. మరి రామారావును పక్కన పెట్టాల్సి వస్తే ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరు? మాజీఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డి, బిల్డర్‌ ఎర్రా బ్రహ్మయ్య… ప్రస్తుతానికి వినిపించే పేర్లు. ఎన్నికల నాటికి ఇంకా ఒకరిద్దరి పేర్లు కూడా పరిశీలనలోకి రావచ్చు. బొల్లినేని రామారావు కంటే వీరిలో ఎవరు బెటర్‌ అని రిపోర్ట్‌ వచ్చినా బొల్లినేని సీటుకు బొక్క పడ్డట్లే!

కోవూరులో సిటింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డిపై వ్యతిరేకత బాగానే వుంది. పార్టీ సభ్యత్వ నమోదులో కోవూరు బాగా వెనుకబడిందంటూ ఈమధ్య చంద్ర బాబు కూడా పోలంరెడ్డి శీనయ్యకు చీవాట్లేశాడు. ఇక్కడ పోలంరెడ్డికి ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు. ఒకటి నెల్లూరు పార్లమెంట్‌కు పోకపోతే ఆదాల ప్రభాకర్‌రెడ్డి అసెంబ్లీ నుండి పోటీ చేయాలను కుంటున్నాడు. ఆయన మొగ్గుచూపుతున్నది కోవూరు అసెంబ్లీపైనే! ఇక రెండో నాయకుడు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి. 2014లోనే ఆయన సీటు ఆశించి భంగపడ్డాడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానంటున్నాడు. మరి ఆదాల కాకుండా పెళ్ళకూరు కూడా కోవూరుకు ఒక ఆప్షనే!

వెంకటగిరిలో ఎమ్మెల్యే రామకృష్ణపై వ్యతిరేకత వుండడం నిజమే! కాని వెంకటగిరి టిడిపి టిక్కెట్‌ నాక్కావాలంటూ ఇంతవరకు ఎవరూ తెరమీదకు రాలేదు. కాబట్టి మళ్ళీ అతనికే సీటు ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇక గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కు మళ్ళీ సీటివ్వాలి. ఎందుకంటే అతను వైసిపి నుండి జంప్‌ చేసి వచ్చాడు కదా! ఆ మాత్రం నమ్మకం నిలబెట్టు కోవాలి. ఇక్కడ టీడీపీ పోటీ చేయాల్సి వస్తే ఎంత వ్యతిరేకత వున్నా కూడా సీటు సునీల్‌కు ఇవ్వక తప్పదు. అయితే సునీల్‌కు సీటు ఎగ్గొట్టే అవకాశం ఇప్పుడు చంద్రబాబుకు పొత్తు రూపంలో కలిసి రావచ్చు. పొత్తులో భాగంగా ఈ సీటును కాంగ్రెస్‌కు వదిలేస్తే సునీల్‌ను సూక్ష్మంగా తప్పించేయవచ్చు. రేపు జరగబోయేది కూడా ఇదే!

జిల్లాలో టిడిపికి నలుగురు ఎమ్మెల్యేలుంటే ఖచ్చితంగా ఇద్దరికి సీట్లు ఎగరడం ఖాయ

మనిపిస్తోంది.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here