Home జాతీయ వార్తలు దేశంలో.. ‘నమో’నినాదం

దేశంలో.. ‘నమో’నినాదం

భారత రాజకీయ చరిత్రలో కొత్త శకం మొదలైంది. ఇందిరా కుటుంబీకులు తప్పితే ఈ దేశాన్ని ఎవరూ పాలించలేరు అనే పరిస్థితి నుండి ‘టీ’ అమ్ముకునే సామాన్యుడు కూడా ఈ దేశ రాజకీయాలను శాసించగలడు, దేశ భవిష్యత్‌ను నిర్దేశించగలడు అనే స్థితికి దేశ రాజకీయాలు వచ్చాయి. ఒక సామాన్యుడు ఈరోజు దేశ రాజకీయ చరిత్రను తిరగరాశాడు. తనను అధికారపీఠం నుండి దించడమే లక్ష్యంగా చేసుకుని కుట్రలు, కుయుక్తులు పన్నుతున్న దాదాపు డజను పార్టీల అధినేతల ఆశలను సమాధి చేశాడు. దేశ యవనికపై కొత్త బీజాక్షరాలు లిఖించాడు. కేంద్రంలో కాషాయం జెండాను రెండోసారి రెపరెపలాడించాడు.

నరేంద్ర దామోదర్‌దాస్‌ మోడీ… 50ఏళ్ల క్రితం గుజరాత్‌ రైల్వేస్టేషన్‌లో టీ అమ్మి వుండొచ్చు. 40ఏళ్ల క్రితం నాగపూర్‌ ఆరెస్సెస్‌ కార్యాలయంలో గదులు చిమ్మి ఉండొచ్చు. కాని ఇప్పుడు మాత్రం దేశంలో కాంగ్రెస్‌ అనే పార్టీనే లేకుండా క్లీన్‌ చేస్తున్నాడు. 130ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి పునర్జన్మ లేకుండా చేస్తున్నాడు.

భారత పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ మరోసారి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగాను, 542 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా దాదాపు 350 స్థానాలలో ఎన్డీఏ తిరుగులేని ఆధిక్యం సాధించి, వరుసగా రెండోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టడానికి సిద్ధమైంది. ఎన్డీఏకు పూర్తి మెజార్టీ రాకుంటే అన్ని పార్టీలను కలుపుకుని బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సోనియా, చంద్రబాబు, మమతా బెనర్జీ, మాయావతి, శరద్‌పవార్‌ వంటి నాయకులు చేసిన ప్రయత్నాలన్నీ నిర్వీర్యమైపోయాయి. దేశ వ్యాప్తంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలలో తప్పితే మిగిలిన అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఘనమైన ఫలితాలు సాధించడం విశేషం. అన్నీ తానై, అంతా తానై బీజేపీని విజయబాటలో నడిపించిన నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి రంగం సిద్ధమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here