Home జిల్లా వార్తలు ‘దేశం’లో కుల చిచ్చు బాబుపై కన్నెర్రజేస్తున్న ‘కమ్మోరు’

‘దేశం’లో కుల చిచ్చు బాబుపై కన్నెర్రజేస్తున్న ‘కమ్మోరు’

సొంత బిడ్డ వద్దు… పరాయి బిడ్డ ముద్దా… కానివారికి కంచాలలో… అయిన వారికి ఆకుల్లోనా… మా పార్టీలో మేమే కానివాళ్ళమయ్యామా? వాళ్ళకేమో పెద్దపీట… మాపై చిన్నచూపా… నెల్లూరుజిల్లా తెలుగు దేశం పార్టీలో చంద్రబాబు నిర్ణయాలపై కుతకుత ఉడికిపోతున్న కమ్మ సామాజికవర్గ నేతల మనోవేదన ఇది. ఇటీవల నెల్లూరుజిల్లా తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ వర్గీయులంతా ఒకేచోట చేరి నిరసన గళం విప్పడం జిల్లా రాజకీయాలలో సంచలనాత్మకంగా మారింది.

తెలుగుదేశం అంటేనే కమ్మ సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యతనిచ్చే పార్టీ అని లెక్క! అయితే బయట జిల్లాల్లో ఎలా వున్నా నెల్లూరుజిల్లా వద్దకొచ్చేసరికి ఏ పార్టీ అయినా రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. ఇక్కడ చంద్రబాబు లెక్క కూడా ఒక్కటే! కమ్మ కులస్థులు ఎలాగూ తెలుగుదేశంకే ఓట్లేస్తారు. సీట్ల విషయంలో రెడ్లకు ప్రాధాన్యతనిస్తే వారి ఓటు బ్యాంకులో చీలిక తేవొచ్చని ఆయన ఆలోచన. అందుకే రెడ్లకు ప్రాధాన్యత పెంచాడు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే నెల్లూరు రూరల్‌ ఇన్‌ఛార్జ్‌గా కూడా వున్నాడు. ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడిపోవడంతో ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌గా ఆదాలనే పెట్టడం జరిగింది. ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ కోసం ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన గూటూరు కన్నబాబు తీవ్రంగా ప్రయత్నించాడు. పార్టీ ఆఫీసులో కూడా ఆందోళనకు దిగాడు. అయినా ఆయనను పక్కనపెట్టి ఆదాలను ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు. 2015లో ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరినప్పుడు అప్పటిదాకా ఇన్‌ఛార్జ్‌గా వున్న కన్నబాబును పక్కకు నెట్టేసి ఆనంకు ఆత్మకూరు బాధ్యతలు అప్పగించారు. ఇలా ‘రెడ్ల’ మూలంగా కన్నబాబు రెండుసార్లు ఇన్‌ఛార్జ్‌ హోదాను కోల్పోయాడు.

2014 ఎన్నికల్లో జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి సీట్లను కమ్మ సామాజికవర్గం నేతలకు కేటాయించారు. వాటిలో రెండింటిలో గెలిచారు. అయితే ఈసారి మూడింటిలో రెండు సీట్లలో ‘రెడ్డి’ సామాజిక వర్గం అభ్యర్థులను నిలబెట్టాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వెంకటగిరి, ఉదయగిరిలలో సిటింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వుండడంతో అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం వుంది. అలాగే నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికలో పార్లమెంటు ఇన్‌ఛార్జ్‌ ఆదాల ప్రభాకర్‌రెడ్డికే అధిక ప్రాధాన్యతనిస్తుండడం కూడా ఈ వర్గీయులకు మింగుడు పడడం లేదు.

ఈ అసంతృప్తితోనే ఇటీవల తిరుపతిలో నెల్లూరుజిల్లా కమ్మ సామాజికవర్గ నేతలు కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, బొల్లినేని కృష్ణయ్య, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కన్నబాబు, కిలారి వెంకటస్వామినాయుడు తదితర నేతలంతా హాజరై చంద్రబాబుపై తమ ఆవేదన వెళ్లగక్కారని తెలుస్తోంది. వీళ్ళు సమావేశమైన విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here