Home జిల్లా వార్తలు ‘దేశం’లో కల్లోలం

‘దేశం’లో కల్లోలం

2019 ఎలక్షన్స్‌… రాష్ట్ర రాజకీయాలలోనే సెన్సేషన్‌ ఎవరంటే ఆదాల ప్రభాకర్‌రెడ్డి. అవును నిజమే! ఆయన కొట్టిన దెబ్బకు రాజకీయ వ్యూహాల్లో యోధులైన చంద్రబాబునాయుడుకే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాకయ్యింది. రాజకీయాలలో చంద్రబాబు అందరికీ తల తిరిగేలా చేస్తుంటాడు. అలాంటి చంద్రబాబు అంచనాలకే అందని విధంగా షాకిచ్చాడు ఆదాల.

తెలుగుదేశం నుండి నెల్లూరురూరల్‌ అభ్యర్థిగా ఖరారై వారంరోజులకు పైగా ప్రచారంలో తిరుగుతున్న ఆదాల ఆ పార్టీ అధిష్టానానికి కోలుకోలేని షాకిచ్చాడు. నెల్లూరు పార్లమెంట్‌ నుండి వైసిపి అభ్యర్థిగా పోటీ చేయడాన్ని మేకపాటి రాజ మోహన్‌రెడ్డి విరమించుకోవడంతో ఆదాలకు రాత్రికి రాత్రే ఆ సీటు ఆఫర్‌ తగిలింది. అంతే 14వతేదీ రాత్రికే రాజకీయం మారిపోయింది. 15వ తేదీ ఉదయం నెల్లూరు మినీబైపాస్‌లోని ఆదాల ఇంటిపై అప్పటిదాకా ఎగురుతున్న పసుపు జెండా ఎగిరి పోయింది. ఫ్యాన్‌ జెండా రెపరెపలాడింది. 16న హైదరాబాద్‌లో జగన్‌ సమక్షంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరడం,నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి కావడం ఒక కలలా జరిగిపోయింది. ఆదాల చాలా సింపుల్‌గా టిడిపిలో నుండి వైసిపిలోకి వెళ్లిపోయాడు. తాను పార్టీ మారడానికి ప్రధాన కారణం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డేనంటూ ఆయననో పాపాలభైరవుడి మాదిరిగా వర్ణించాడు. పార్టీలో తనకు చాలా అవమానాలు జరిగాయని, సోమిరెడ్డి తనను పార్టీ నుండి వెళ్లగొట్టడానికే కంకణం కట్టుకున్నాడంటూ తాను పార్టీ వీడడానికి ఆదాల కారణాలు వివరించాడు. ఆయన పోవడంవరకు సరే… ఆయన ఇచ్చిన షాక్‌కు జిల్లాలో తెలుగుదేశం భారీ కుదుపులకు లోనైంది. ఆదాల పోటీతో నెల్లూరురూరల్‌లో హోరాహోరీ పోటీ వుంటుందనుకున్నారు. ఆయన వైసిపిలోకి పోవడంతో నెల్లూరురూరల్‌లో వార్‌ వన్‌సైడ్‌ అయినట్లయ్యింది. తెలుగుదేశం వాళ్ళు నెల్లూరురూరల్‌కు అప్పటికప్పుడు కొత్త అభ్యర్థి అన్వేషణ సాగించి చివరకు మేయర్‌ అజీజ్‌ను నిలబెట్టారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి పక్కకు తప్పుకోవడం ఆదాల పార్లమెంట్‌ అభ్యర్థి కావడంతో ఒక్కసారిగా జిల్లా వైకాపాలో తెలియని వూపొచ్చింది. నెల్లూరురూరల్‌లో వైసిపికి గట్టి పోటీ లేకుండా పోయింది. నెల్లూరు సిటీలోనూ జోష్‌ వచ్చింది. కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయ గిరి నియోజక వర్గాల్లో వైసిపి అంతకుముందుకంటే ఇంకా పుంజుకుంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపి అభ్యర్థి అయ్యుంటే ఆయనపై వున్న వ్యతిరేకత ఎమ్మెల్యే అభ్యర్థులపై కూడా కొంతవరకు ప్రభావం చూపుండేది. అభ్యర్థిగా మేకపాటి వుంటే లోక్‌సభ పరిధిలోని నాలుగైదు నియోజకవర్గాల్లో పోటీ నువ్వా-నేనా అన్నట్లు మారుండేది. ఆదాల కావడంతో లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైసిపి అనూహ్యంగా వేగం పెంచింది. ఆదాల కొట్టిన దెబ్బకు జిల్లాలో టిడిపికి పెద్ద నష్టమే జరుగుతుందని అంచనా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here