Home గల్పిక దేవాన్ష్‌ పేరును రాష్ట్రానికే పెట్టాలి

దేవాన్ష్‌ పేరును రాష్ట్రానికే పెట్టాలి

పాతిక ప్రపంచ మేటి నగరాలను మిక్సీలో వేసి తిప్పి తీస్తే వచ్చినటువంటి అమరావతి నగరం. ఉండవల్లిలోని హైటెక్‌ రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్ర బాబు నివాసం. ఆ ఇంటి ప్రాంగణ మంతా రంగు రంగుల ముగ్గులతో అలంకరించారు. ఇంటికంతా సీరియల్‌ లైట్స్‌ వేశారు. రంగు రంగుల కాగితాల తోరణాలు కట్టి వున్నారు. ఒక పండుగ వాతావరణం వుందక్కడ. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌లు పట్టపగలు ఆ ప్రాంగణంలో కాకర వత్తులు, చిచ్చుబుడ్లు, లక్ష్మీ టపాసులు కాలుస్తూ… ”ఈరోజే అచ్చమైన దీపావళి… వెయ్యేళ్ళు నిత్యమైన దీపావళి” అనే పాట పాడుతూ నృత్యాలు చేస్తున్నారు. అప్పుడే ఎంపి జేసీ దివాకర్‌ రెడ్డి అక్కడకు వచ్చాడు. అక్కడున్న వాతావరణాన్ని చూసి ఆయనకే ఆశ్చర్య మేసింది. ఏయ్‌… ఇక చాల్లే ఆపండి… అని గట్టిగా అరిచాడు. జేసీ అరుపుకు అందరూ ఆగిపోయారు. జేసీ కోపంగా… మీకేమన్నా మైండ్‌ దొబ్బిందా.. అవతల సర్వేలు రాష్ట్రంలో టిడిపి పరిస్థితి బాగా లేదని చెబుతున్నాయి… నా అంతు చూస్తానని నా మీదే మీసం తిప్పిన ఆ సిఐ గోరంట్ల మాధవ్‌ వైసిపిలో చేరాడు. రేపు అతని చేతిలో ఓడిపోతే నా పరిస్థి తేంటో నాకే అర్ధం కావడం లేదు. నా బాధేంటో చెప్పుకుందామని ఇక్కడకు వస్తే… మీరంతా ఇలా పట్టపగలు దీపావళి పండుగ చేసుకుంటున్నారు. అయినా ఈరోజు దీపావళి కాదు. ఏ పండగ కూడా కాదు. మీ విపరీత ఆనందానికి కారణమేంటని అడిగాడు. అప్పుడు చంద్రబాబు చేతిలో వున్న కాకరపువ్వొత్తును పక్కన పడేసి… ఈరోజు మాకు అసలైన దీపావళి… ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె ఆకర్షణతో కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాబో తోంది. ఆ నరేంద్ర మోడీని దించేయా లన్న నా పంతం నెరవేరుతుంది అని చెప్పాడు. అందుకు జేసీ… ఇది కరెక్ట్‌ కాదు, మీ మనసులో వున్న వాస్తవం చెప్పండి అని అడిగాడు. అప్పుడు చంద్రబాబు… నీ దగ్గర ఈ డొంక తిరుగుడు మాటలు పని చేయవు కదా… మనసులో వున్న మాట చెబుతా వినూ… మా లోకేష్‌ను నమ్ముకుని తెలుగుదేశం పార్టీని గెలిపించాలనుకోవడం ఎంత అమాయకత్వమో, ఆ రాహుల్‌ గాంధీని నమ్ముకుని కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. రాహుల్‌ నాయకత్వంలో అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు. మళ్ళీ ఆ మోడీ వచ్చాడంటే నన్ను కేసుల్లో ఇరికిస్తాడనే భయం వెంటాడుతూ వచ్చింది. నా ప్రార్ధనలు ఫలించి ప్రియాంకగాంధీ రంగంలోకి వచ్చింది. ఇక కేంద్రంలో అధికారం కాంగ్రెస్‌దే అంటూ మళ్ళీ చిందులు తొక్కసాగాడు.

అంతలో అక్కడకు ఎంపీలు మురళీ మోహన్‌, ఎన్‌.శివప్రసాద్‌, మాగంటి బాబు, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పి.నారా యణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావులు వచ్చారు. సార్‌, రాజమండ్రిలో నారా దేవాన్ష్‌ కాలనీ ప్రారంభోత్సవం వుంది. మనం బయ ల్దేరాలని నారాయణ చెప్పాడు. ‘నారా దేవాన్ష్‌ కాలనీ’నా… ఆయన ఎవరు? ఈ పేరెప్పుడూ వినలేదే! ఆయనేమన్నా స్వాతంత్య్ర సమరయోధుడా? తెలుగుజాతి కీర్తిని దిగంతాలకు చాటిన తెలుగు వీరుడా? ఎవరబ్బా అని జేసీ దివాకర్‌రెడ్డి అయోమయంగా ప్రశ్నించాడు. వెంటనే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అందు కుని… స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు ఇలాంటి వాటికి పెట్టే సాంప్రదాయం మన దేశంలో లేదుకదన్నా, దేవాన్ష్‌ అంటే మన చంద్రబాబు గారి మనుమడే అని చెప్పాడు. అప్పుడు జేసీ… ఓ అవునా… అలాగైతే ఓకే. పెట్టాల్సిన పేరే… అని చెప్పి అక్కడనుండి వెళ్లిపోయాడు.

————-

రాజమండ్రిలో నారా దేవాన్ష్‌ కాలనీ… చంద్రబాబు కుటుంబసభ్యులు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వున్నారు. అప్పుడే ఓ కారొచ్చి ఆగింది. అందులో నుండి నారా బ్రాహ్మణి, ఆమె చేతులో దేవాన్ష్‌… అందరూ చప్పట్లు తడుతుండగా ‘దేవాన్ష్‌’ తన చిట్టి చేతులతో కత్తెర పట్టుకుని రిబ్బన్‌ కట్‌ చేయబోతుండగా… ‘ఆపండి’ అనే కేక వినిపించింది. అందరూ ఆ సౌండ్‌ వచ్చిన వైపు చూసారు. అక్కడ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వున్నాడు. ఆయన ఆవేశంగా… ఏం చేసాడని ఈ కాలనీకి దేవాన్ష్‌ అనే పేరు పెట్టారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరా డాడా? దీనజనులను ఆదుకున్నాడా? పాఠశాలలు పెట్టాడా? ఆసుపత్రులు కట్టించాడా? ఎందుకని ఈ కాలనీకి దేవాన్ష్‌ అనే పేరు పెట్టారు అని ప్రశ్నిం చాడు. అప్పుడు చంద్రబాబు… మూడేళ్ల లోనే 13కోట్ల ఆస్థి సంపాదించాడు. ప్రపంచంలో ఇంత చిన్న వయసులో ఇంత ఆస్థి సంపాదించిన వాళ్లెవరన్నా వున్నారా? ఆస్థి సంపాదనలో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన దేవాన్ష్‌ పేరును ఒక కాలనీకి కాదు… వీలైతే ఈ రాష్ట్రానికి పెట్టినా తప్పులేదు… అసలు పేరు పెట్టింది అతనికున్న ఆస్థిని బట్టి కాదు, అతనిలో వున్న టాలెంట్‌ను బట్టి. ఆ టాలెంట్‌ ఏమిటో చూపిస్తా చూడు… అంటూ చంద్రబాబు లాప్‌టాప్‌ తీసి దేవాన్ష్‌ టాలెంట్‌ డాట్‌ కామ్‌ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేశాడు.

స్క్రీన్‌ మీద సీన్‌లు మొదలయ్యాయి. అది విజయవాడలోని పోలీస్‌ మైదానం. రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరుగు తున్నాయి. గవర్నర్‌ నరసింహన్‌ జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభిం చారు. ఒక్కో స్కూలు విద్యార్థులు ఒక్కో దేశభక్తి గేయానికి తమ నృత్యాలు ప్రదర్శిస్తూ వెళుతున్నారు. చివరగా ఎన్టీఆర్‌ హీరోగా నటించిన మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలోని ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి – ధన్యభూమి నా దేశం సదా స్మరామి!’ పాటకు ఓ మూడేళ్ళ బుడతడు అచ్చం ఆ సినిమాలో ఎన్టీఆర్‌లాగే హావభావాలు ప్రదర్శిస్తూ యాక్షన్‌ చేస్తున్నారు. గాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్‌, సుభాష్‌చంద్రబోస్‌, వీర పాండ్య కట్టబ్రహ్మన, అల్లూరు సీతారామ రాజు గెటప్‌లలో కనువిందు చేశాడు. ఆ చిన్నారి యాక్షన్‌కి అందరూ మురిసి పోయి చప్పట్లు కొట్టారు. పాట ముగిసాక అందరూ లేచి అభినందించారు. అక్క డితో లాప్‌టాప్‌ మీద సీన్‌లు అయి పోయాయి. చంద్రబాబు లాప్‌టాప్‌ను క్లోజ్‌ చేశాడు.

ఉండవల్లి ఉండి… మంచి దేశ భక్తి సన్నివేశం చూపించావు… ఆ చిన్నారి ఎవరో బాగా యాక్షన్‌ చేశాడు. అతను చాలా గొప్పోడవుతాడు అని చెబుతుం డగా… టక్కున చంద్రబాబు అందు కుని… ఆ గొప్పోడి పేరు ఓ కాలనీకి పెట్టడం తప్పా? అని ప్రశ్నించాడు. అప్పుడు అర్ధమైంది ఉండవల్లికి ఆ బుడతడు చంద్రబాబు మనుమడు దేవాన్ష్‌ అని.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here