Home రాష్ట్రీయ వార్తలు దెబ్బకు దెబ్బ తప్పదా?

దెబ్బకు దెబ్బ తప్పదా?

2004, 2009… రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్‌ సారధ్యంలోని యూపిఏ అధికారంలోకి రాగలిగిందంటే కారణం డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఏ.పి నుండి ఆ రెండుసార్లు కాంగ్రెస్‌కు అత్యధిక లోక్‌సభ సీట్లను అందివ్వబట్టే! కేంద్రంలో కాంగ్రెస్‌ను నిలబెట్టడమేకాక రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత వై.యస్‌.ది.

అలాంటి వై.యస్‌. కుటుంబానికి కాంగ్రెస్‌ ఏం చేసింది. వై.యస్‌. మరణా నంతరం ఆయన కుటుంబంపై కక్ష పెట్టుకుంది. జగన్‌ ఓదార్పు యాత్రను వద్దంది. జగన్‌ సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజల్లోకి వెళితే కక్ష సాధింపు చర్యలకు దిగింది. అడ్డగోలు కేసులు వేయించి జగన్‌ను జైలుకు పంపింది. ఆయన కుటుంబసభ్యులను వీధుల్లోకి లాగింది. జగన్‌ మీద కక్షతో తమకు బద్ధశత్రువైన తెలుగుదేశంతో సైతం చేతులు కలిపింది.

వై.యస్‌. కుటుంబం విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం చేయరాని పాపాలన్నీ చేసింది. దానికి తగ్గట్లే రాష్ట్రాన్ని విభజించిన దుర్మార్గం వల్ల ఇటు ఏ.పిలో సమాధి కావడంతో పాటు తెలంగాణలోనూ అధికారానికి దూరంగా ఉండిపోయింది. కర్కశంగా విభజన చేసిన పాపానికి కాంగ్రెస్‌ ఈ రూపంలో ఫలితం అనుభవించింది. సరే, 2014 ఎన్నికలంటే అలా జరిగిపోయాయి. రాబోయే ఎన్నికల్లో ఏపిలో కాంగ్రెస్‌కు ఎలాగూ అంత సీన్‌లేదు. కాస్తో కూస్తో నమ్మకముండేది తెలంగాణలోనే! అది కూడా ప్రతిపక్షంగా వుంది కాబట్టి! ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నామ మాత్రం. ఇక్కడ అధికారం కోసం పోటీపడేది తెలుగుదేశం, వైకాపానే! ఏదన్నా వుందంటే కాంగ్రెస్‌కు ప్రధాన శత్రువు అధికారంలో నున్న తెలుగుదేశం కావాలేగాని ప్రతిపక్షంలో వున్న వైకాపా కాదు. కాని, కాంగ్రెస్‌ అధిష్టానం వైకాపా ఓటమినే లక్ష్యంగా చేసుకుంది. కాంగ్రెస్‌ ఇక్కడ అధికారం ఆశించడం లేదు. తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావాలనుకుంటోంది. అందు కోసం వైసిపి ఓట్లను చీల్చాలనుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో రెడ్డి, దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులను నిలబెట్టే ఆలోచనలో వుంది. తద్వారా జగన్‌ ఓటు బ్యాంకుకు గండి కొట్టి టీడీపీ విజయానికి బాటలు వేయాలన్నది కాంగ్రెస్‌ ఆలోచన! ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. కాంగ్రెస్‌ ప్రయత్నాలను వారి ఆలోచనా ధోరణితోనే పోయి తిప్పికొట్టాలి. ఇందుకు జగన్‌ ముందున్న మార్గం తెలంగాణలో వైసిపిని బలోపేతం చేయడం. ఈసారి తెలంగాణలో అధికారంపై కాంగ్రెస్‌ కన్నేసింది. అవసరమైతే తెలుగుదేశంతో కూడా పొత్తుపెట్టుకునే అవకాశ ముంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ఓటుబ్యాంకుకు గండి పెట్టగల శక్తి వైసిపికి వుంది. వైసిపి తెలంగాణలోని అన్ని స్థానాలలో అభ్యర్థులను నిలబెడితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా వున్న ‘రెడ్ల’ సామాజిక వర్గం ఓట్లలో చీలిక రావచ్చు. అలాగే కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే క్రైస్తవ, మైనార్టీ ఓట్లలో కూడా గండి పెట్టొచ్చు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో వైసిపి ఒక ఎంపీ సీటును గెలవడమే కాక మరికొన్ని అసెంబ్లీలోనూ గెలిచింది. గణనీయంగా ఓట్లను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ చేస్తున్న విషపు ఆలోచనలను అడ్డుకోవాలంటే వైసిపిని తెలంగాణలో నిలబెట్టడం ఎంతైనా అవసరం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here