Home గ్రామ సమాచారం దుర్గంపల్లిని వణికిస్తున్న.. చిరుత

దుర్గంపల్లిని వణికిస్తున్న.. చిరుత

ఉదయగిరి మండలంలోని దుర్గంపల్లి అటవీప్రాంతంలో ఒక చిరుతపులి 22 మేకల్ని చంపేసింది. దీంతో మేకల యజమానుల గోడు వర్ణనాతీతం. ఈ నెల 21న ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళ నలు చెందుతున్నారు. బాధితుల కధనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దుర్గంపల్లికి చెందిన సింగనబోయిన రత్తమ్మ, పెద్దచెన్నయ్య, మోహన్‌, గడ్డం మల్లికార్జునలకు చెందిన 21 మేకలు, రెండు మేకపోతులను మేత కోసం గ్రామానికి ఆనుకుని ఉన్న కొండపై అటవీప్రాంతంలోకి తోలుకెళ్ళారు. పొదల్లో మాటువేసి ఉన్న చిరుతపులి ఒక్కసారిగా వాటిపైకి దూకడంతో వారు భయపడి గ్రామంలోకి పరుగుతీశారు. చిరుతదాడిలో గాయపడిన ఒక మేక మాత్రం వారితోపాటు ప్రాణం ఉగ్గబట్టుకుని ఊళ్ళోకి వచ్చేసింది. ఆ తర్వాత, గ్రామస్తులంతా కలసి అటవీప్రాంతంలో మేకల కోసం వెతుకుతుండగా 20 మేకలు, 2 మేకపోతులు చిరుతపులి దాడితో చచ్చిపడి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై భయం గొలిపేవిధంగా ఉంది. మేకలు మేపుకుంటూ జీవనం సాగించుకునేవారు మేకల కళేబరాలను చూసి పెద్దపెట్టున రోదించారు. తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాగా, దుర్గంపల్లి అడవుల్లో చిరుత సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. హనుమాన్‌కాలువ సమీపంలో ఆ చిరుతపులి కనిపించిందని కూడా కొందరంటున్నారు. అటవీశాఖవారు వెంటనే ఈ విషయం పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని దుర్గంపల్లి ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here