Home జిల్లా వార్తలు దిద్దుబాటలో ‘దేశం’

దిద్దుబాటలో ‘దేశం’

నెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పరిస్థితి ఏమంత బాగాలేదు. గతంకంటే మెరుగు పడిందీ లేదు. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి వచ్చింది 3 సీట్లే! ఇవి కూడా కొద్దిపాటి మెజార్టీతో గెలుచుకున్నవే! వీటిలో వైసిపి సంస్థాగత లోపాల కారణంగా 2 సీట్లు పోయాయి. ఇక నెల్లూరు లోక్‌సభతో పాటూ నెల్లూరుజిల్లాలోని నాలుగు అసెంబ్లీలు కలిసి వున్న తిరుపతి లోక్‌సభ స్థానాన్ని కూడా వైసిపి గెలుచుకోవడం జరిగింది.

ఈ సీన్‌ను బట్టి జిల్లాలో తెలుగుదేశం ఎంత బలహీనంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళయ్యింది. ఈ నాలుగేళ్ళ కాలంలో తెలుగుదేశం ఏమన్నా బలం పుంజుకుందా? ఈ నాలుగేళ్ళలో ఆనం సోదరులతో పాటు మెట్టు కూరు ధనుంజయరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి వంటి నాయకులు టీడీపీలో చేరారు. వైసిపిలో గెలిచిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ కూడా టీడీపీలో చేరాడు. ఏమన్నా ఒరిగిందా? పార్టీకి ఓటింగ్‌ శాతం పెరిగిందా? గతంలోకన్నా ఎక్కువ సీట్లు గెలిచే అవ కాశాలు ఏర్పడ్డాయా? తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందా? జిల్లాలో అలాంటి వాతావరణమేదీ కనిపించడం లేదు సరికదా, 2014 కన్నా జిల్లాలో పార్టీ బలహీనపడ్డ వాతావరణం కనిపిస్తోంది.

చంద్రబాబు చిన్నచూపు

మొదట అధికారంలోకి వచ్చాక ఈ జిల్లా అభి వృద్ధిపై చంద్రబాబు చిన్నచూపు చూసాడు. ఈ జిల్లా అంటే గిట్టనట్లు వ్యవహరించాడు. ఐదేళ్ళ వై.యస్‌. పాలనతో పోల్చి చూసినప్పుడు ఈ జిల్లాకు ఆయన చేసిందేమీ కనిపించలేదు. దాంతో స్వతహాగానే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఇక నియోజక వర్గాల వారీగా కూడా పార్టీ బలహీనంగానే ఉంది. టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలుంటే(జంపింగ్‌ ఎమ్మెల్యేతో కలిపి) ఆ నాలుగు నియోజకవర్గాలలోనూ వారి పట్ల వ్యతిరేకత వుంది. నెల్లూరు నగరం, రూరల్‌ నియోజక వర్గాలలో తెలుగుదేశాన్ని చంద్రబాబే పడుకోబెట్టాడు. ఏ జిల్లా కేంద్రంలోనూ తెలుగుదేశం నెల్లూరులో వున్నంత బలహీనంగా వుండదేమో! సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా గట్టిగా పోరాడుతున్నాడు. ఇది రైతాంగం ఎక్కువ వుండే నియోజకవర్గం. ప్రభుత్వంపైన అన్నిచోట్లా వుండే వ్యతిరేకత ఇక్కడా వుంది. కాకపోతే సోమిరెడ్డి సొంతంగా గట్టిగా నిలబడుతున్నాడు. కావలిలో బీద సోదరుల నాయకత్వం వల్ల అక్కడ పార్టీ కనిపిస్తోంది. జిల్లాలో టీడీపీ వీక్‌ అనే సంకేతాలు అధిష్టానాన్ని తాకాయి. చంద్రబాబు నెల్లూరు జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

నిలబెట్టుకోవడంలో విఫలం

ముఖ్యంగా మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీని వదిలిపోతున్నాడన్న విషయం టీడీపీలో ఆందోళన కలిగిస్తోంది. పార్టీలోకి వచ్చిన వాళ్ళను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యామనే భావన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఆనం సోదరులకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వివేకా చివరి రోజుల్లో వున్నప్పుడైనా ఆయనకు గౌరవప్రదమైన స్థానం కల్పించి వుంటే వాళ్ళు పార్టీని వదిలిపోకుండా వుండేందుకు ఆస్కార ముండేది. ఆనంను పార్టీలో నిలబెట్టుకోలేక పోవడ మన్నది పూర్తిగా చంద్రబాబు వైఫల్యమే! ఆనం పార్టీని వదిలి వైసిపిలోకి పోతే ఆ ఎఫెక్ట్‌ ఆత్మకూరు నియోజక వర్గంతో పాటు మరో నాలుగు నియోజకవర్గాల మీద కూడా పడుతుంది.

తిరుగుబాటులో పెళ్ళకూరు

ఆనం అలా వుండగా కోవూరుకు చెందిన మరో నాయకుడు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి కూడా తిరుగుబాటు బాటలో వున్నాడు. ఆయన ఎదురు తిరిగినా కూడా కోవూరులో పార్టీకి నష్టం తప్పదు. వీరితో పాటు మరికొందరు నాయకులు కూడా టీడీపీని వీడే ఆలోచనలో వున్నట్లు సమాచారం.

నిలబెట్టుకొనే ప్రయత్నాలు

చేతులు కాలాక ఆకులు పట్టుకోవాల్సిన దశలో తెలుగుదేశం అధిష్టానం అలర్ట్‌ అయ్యింది. ఆనం రామనారాయణరెడ్డి చేజారినట్లేనని ఖరారు చేసు కున్నారు. కాకపోతే వారి కుటుంబంలో వున్న మరో ఇద్దరిని నిలబెట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డిని బుజ్జగించే పనిలో కొందరున్నారు. ఎన్నికలనాటికి పార్టీ మారుతాడనే ప్రచారం వున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డిని జాగ్రత్తగా పట్టుకురావాలని నిర్ణయించి ఆయనకు అదనపు బాధ్యతలంటూ కొత్త పదవులు అప్పగిస్తున్నారు.

ఉదయగిరిలో కంభం విజయరామిరెడ్డి చేజారిపో కుండా ఆయనకు రాష్ట్ర స్థాయి పార్టీ పదవిని గాలంగా విసురుతున్నట్లు తెలుస్తోంది. అలాగే డీసీసీబీ ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.

ఇటీవలే నవనిర్మాణ దీక్షల ముగింపు సభను నెల్లూరుజిల్లాలోనే నిర్వహించిన చంద్రబాబు, ఈ నెల 30న దళిత తేజం ముగింపు సభకు కూడా నెల్లూరునే వేదికగా ఎంచుకున్నారు. దీనికి కారణం నెల్లూరు జిల్లాలో పార్టీపై ప్రత్యేక దృష్టి పెట్టి దిద్దుబాటు చర్యలకు పూనుకోవడమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here