Home రాష్ట్రీయ వార్తలు దారి తెలియని ‘అన్నయ్య’

దారి తెలియని ‘అన్నయ్య’

తెలుగు సినిమా రంగంలో చూస్తే మొదటి తరానికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు రారాజు లైతే, రెండో తరానికి మగమహారాజు మెగాస్టార్‌ చిరంజీవి. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పునాదిరాళ్ళతో ప్రస్థానాన్ని మొదలుపెట్టి అత్యున్నత స్థాయిని అందుకున్నవాడు. ‘స్వయంకృషి’తో సినిమా తెరపై తారాజువ్వలా వెలిగిన ‘హీరో’.

సినిమాలలో రాణించిన చిరంజీవి రాజకీయాలకొచ్చేసరికి చతికిలపడడం తెలిసిందే! 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ 294 అసెంబ్లీ లకు పోటీ చేస్తే 18స్థానాలే గెలిచింది. ఆ తర్వాత పార్టీని నడపలేక చిరంజీవి ప్రజా రాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేయడం, ప్రతిఫలంగా చిరంజీవిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడం జరిగిపోయాయి. 2014 దాకా చిరంజీవి కేంద్రమంత్రిగా కొనసాగడం తెలిసిందే! 2014 తర్వాత ఏపిలో కాంగ్రెస్‌ లేకుండాపోయింది. ఆ పార్టీలో మిగిలిన నాయకులందరూ నామమాత్రంగానే వున్నారు. తెలిసో తెలియకో చిరంజీవి రాజకీయ బురద గుంటలోకి దిగాడు. ఇప్పుడు తిరిగి సినిమాలు చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి రాజకీయాల్లో కొనసాగడమా, లేకుంటే తన మానాన తాను మిన్నకుండా వుండిపోవడమా… కాంగ్రెస్‌లో అయితే వుండలేడు. పోనీ తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ పెట్టిన జనసేనకు మద్దతుగా నిలుద్దామా అంటే ఆయనే చంద్రబాబు చంకనెక్కి వున్నాడు. పోయిపోయి చంద్రబాబు పంచన చిరంజీవి చేరుతాడా? అదీగాక చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు మెగా ఫ్యామిలీ అంటే చూపుడువేలి మీద వెంట్రుకతో సమానం. మా బ్రీడ్‌ ఏంటి… మా బ్లడ్‌ ఏంటి… వాళ్ళ బ్రీడ్‌ ఏంటి… అంటూ లెక్కలేకుండా మాట్లాడుతుంటాడు. ఓ పక్క చిరంజీవి తమ్ముడు, పవన్‌ అన్న అయిన నాగబాబు, తమ ఫ్యామిలీ గురించి చులకనగా మాట్లాడుతున్న బాలయ్యపై ఓ రేంజ్‌లో విరుచుకు పడుతుండడం చూస్తూనే వున్నాం. నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య ఓ పక్క వార్‌ జరుగుతుంటే మరోపక్క అదే ఫ్యామిలీకి చెందిన పవన్‌ మాత్రం బాబుకు బాడీగార్డ్‌లా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి చిరంజీవి తన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ వెళుతున్న రాజకీయ మార్గంలో కూడా నడవలేడు.

ఇక ఆయన ముందున్న మార్గం తటస్థంగా వుండడం, లేదంటే కేసీఆర్‌, జగన్‌లతో కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌లో కీలకపాత్ర పోషించడం. టిఆర్‌ఎస్‌, వైసిపి శ్రేణులు కూడా చిరంజీవి నుండి ఇలాంటి చిరు సహకారాన్ని ఆశిస్తున్నాయి. కేసీఆర్‌ గట్టిగా పూనుకుంటే చిరును ఇందుకు ఒప్పించగలడు. చిరు అంగీకరిస్తే ఏపిలో వైసిపికి అది ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి చిరు త్వరలోనే కాంగ్రెస్‌ను వదిలేసి ఫెడరల్‌ ఫ్రంట్‌కు సహకారం అందించవచ్చని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here