Home నెల్లూరులో నేడు దారి తప్పిన సమ్మె

దారి తప్పిన సమ్మె

తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్న జి.ఓ.279ను రద్దు చేయాలంటూ నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె ఇంతవరకు ఆగలేదు, సరికదా రోజురోజుకు సమ్మె తీవ్రత పెరుగుతోంది. కార్మికుల సమ్మెతో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకు మాటేమోగాని పారిశుద్ధ్య అధ్వాన్నపు నగరాలలో నెల్లూరుకు టాప్‌ర్యాంకు వచ్చేటట్లుంది. పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తేనే నెల్లూరు నగరంలో పారిశుద్ధ్యం అంతంతమాత్రంగా ఏడుస్తుంది. అలాంటిదిప్పుడు 1100 మంది కార్మికులు సమ్మెలో వున్నారు. శాశ్వత సిబ్బందితో పాటు 500 మంది తాత్కాలిక సిబ్బందిని పెట్టినా పూర్తిస్థాయిలో చెత్తను ఎత్తలేకపోతున్నారు. ప్రధాన రహదారుల్లో తప్పితే లోపల ప్రాంతాలలో చెత్తసేకరణ జరగడం లేదు. సమ్మెలో వున్న కార్మికులు వీధుల్లో చెత్తను తెచ్చి ప్రధానరోడ్లపై పోస్తూ తమ నిరసనను ఇంకొంచెం తీవ్రం చేస్తున్నారు. సమ్మె విరమిస్తేగాని నెల్లూరుకు పట్టిన చెత్త వదిలేటట్లులేదు.

ఇదేం సంస్కారం…

పారిశుద్ధ్య కార్మికులు చాలా సన్నవేతన జీవులు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు. వారి చేస్తున్న సమ్మెకు అర్ధముంది. వారి సమస్యలు పరిష్కరించాల్సివుంది. అయితే, అంతమాత్రాన చేస్తున్న సమ్మెను అడ్డదారులు పట్టించి, అది జన జీవనానికి ఇబ్బంది కిలిగించే విధంగా మార్చడం పద్ధతికాదు. ఇది స్వయంగా కార్మికులు చేసి వుండకపోవచ్చు. వారిని ప్రోత్సహి స్తున్న నాయకుల పనై వుండొచ్చు. సమ్మెలో భాగంగా వాళ్ళు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాలొనడం లేదు. చెత్తను తొలగించడం లేదు. అంత వరకు సబబే! కానీ, వీధుల్లో వున్న చెత్తను మరీ ఏరుకుని ఎత్తుకొచ్చి… ప్రధాన రోడ్లపై పోయడమేంటి? దీనివల్ల ఇబ్బంది పడుతుంది ఎవరు? ఆ రోడ్లమీద వెళ్ళే వేలాది వాహనదారులు, నడిచిపోయే సామాన్య ప్రజలే కదా! రోడ్డు మీద చెత్తా చెదారం అంతా వేయడం వల్ల దానినుండి వచ్చే దుమ్ముతో ద్విచక్రవాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. మొదలే సందులు, గొందుల్లో భూగర్భ డ్రైనేజీ పనుల వల్ల రోడ్లన్నీ దుమ్ముమయమైవుంటే… ఇది చాలదన్నట్లు ప్రధాన రోడ్లను కూడా చెత్తమయం చేసి అందరికీ ఇబ్బంది కలిగించారు. దీనివల్ల పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై సానుకూలత రావాల్సింది పోయి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశముంది. సమ్మె చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సింది ప్రజల్ని కాదు, వారి సమస్యలను పరిష్కరించడంలో తాత్సారం చేస్తున్న పాలకులను, అధికారులను. వీళ్ళు చేయాల్సింది రోడ్లమీద చెత్తవేయడం కాదు, అదే చెత్తను తీసుకెళ్ళి మున్సిపల్‌ మంత్రి ఇంటి ముందో, మేయర్‌ ఇంటి ముందో, కమిషనర్‌ బంగ్లా వద్దో పోయాలి. తమ సమ్మె వల్ల వచ్చే ఇబ్బందేంటో వాళ్ళకు ప్రత్యక్షంగా చూపిస్తే కొంతన్నా ఫలితముంటుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here