Home సంపాదకీయం దాడులు నేర్పిన పాఠాలు

దాడులు నేర్పిన పాఠాలు

పుల్వామా ఉగ్రదాడి… భారత్‌కు ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో విషయాలను తెలియజెప్పింది. కొందరి ముసుగులను తొలగించింది. కొందరిపై అనుమానాలను పటాపంచలు చేసింది. ద్రోహులెవరో, దేశ ప్రేమికులెవరో తేల్చిచెప్పింది. మన లోపాలను బయటపెట్టింది. మన శక్తిని ప్రపంచానికి చాటింది. ఈ దాడి పర్యవసానంలో విజయాలున్నాయి, వైఫల్యాలున్నాయి.

పుల్వామా ఉగ్రదాడి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఉగ్రశిబిరాలపై చేసిన మెరుపుదాడులు, ఆపై పాక్‌ యుద్ధ విమానాలు భారత్‌ భూభాగంలోకి వచ్చి బాంబులు వేయడం, వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఫైలట్‌ అభినందన్‌ పాక్‌ ఆర్మీకి చిక్కడం, భారత్‌ దౌత్య ఒత్తిడితో పాకిస్థాన్‌ అభినందన్‌ను మనకు అప్పగించడం… ఇవన్నీ ముఖ్యఘట్టాలు. ఈ సంఘటనల నేపథ్యంలో భారతదేశంలో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపించింది. ఈ సంఘటనల తర్వాత ‘హమారా భారత్‌’ అంటూ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ముస్లింలు బయటకు వచ్చి స్వచ్ఛంధంగా ర్యాలీలు నిర్వహించారు. పాకిస్థాన్‌ అధ్యక్షుడి దిష్టిబొమ్మలను, పాకిస్థాన్‌ జెండాలను తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ వాళ్ళు ముస్లింలుగా వ్యవహరించలేదు. భారతీయులుగా వ్యవహరించారు. ఇంతకాలం భారతావని కోరుకుంటున్నది కూడా అదే! ఈ దేశంలోని ముస్లింలు కూడా తాము భారతీయు లమనే భావనతోనే వుండినారు. కాని, సుధీర్ఘ కాలం ఈ దేశాన్ని పాలించిన పార్టీ వాళ్ళే… వాళ్ళలో మీరు భారతీయులు అనే భావం కంటే కూడా మీరు మైనార్టీలు, ముస్లింలు అనే భావాన్ని నూరిపోశారు. దానిమూలంగానే ఇంతకాలం కూడా దేశ ప్రజలలో ఒకరకమైన అభిప్రాయం ఉండేది. కొందరు ముస్లింలు భారతదేశంలోనే వున్నా పాకిస్థాన్‌పై అభిమానం చూపిస్తారనే అనుమానం వుండేది. ఈరోజు ఆ అనుమానాన్ని తుంచేశారు. ముఖ్యంగా ఈ దేశంలో ఓట్ల కక్కుర్తికి పాల్పడే అవకాశవాద నాయకులకంటే కూడా తాను ఎంతో మేలనిపించుకున్నాడు మజ్లిస్‌ పార్టీ అధినేత, ఎంపి అసదుద్దీన్‌ ఓవైసి. పుల్వామా

ఉగ్రదాడి, ఉగ్రశిబిరాలపై భారత వాయుసేనల మెరుపుదాడి అంశాలపై అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించిన తీరు దేశ ప్రజల మన్ననలందుకుంది.

అదే సమయంలో ఓట్ల కోసం, రాజకీయ స్వలాభాల కోసం కొన్ని రాజకీయ పక్షాల నాయకులు వ్యవహరించిన తీరు జుగుప్స కలిగించింది. ఎయిర్‌ స్ట్రైక్‌తో బీజేపీకి వచ్చే ఎన్నికలలో పాతిక సీట్లు పెరిగాయంటూ కర్నాటక మాజీముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు సైనికుల త్యాగాలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనే నీచ మనస్తత్వానికి అద్దంపడుతున్నాయి. అదే సమయంలో పుల్వామా ఉగ్రదాడిని రాజకీయ కోణంలో చూసి… ఈ దాడిని పాకిస్థానే చేయించిందా? చేయించివుంటే అందుకు ఆధారాలేంటి? ఎన్నికలకు ముందే ఈ దాడి జరగడంపై అనుమానాలున్నాయి? ఉగ్రశిబిరాలపై మన సైనికులు నిజంగానే దాడి చేశారా? అంటూ ప్రశ్నలు వేసిన కాంగ్రెస్‌, టిఎంసి, తెలుగుదేశం, జనసేన, వామపక్షాల వంటి పార్టీల నేతల తీరు ప్రజలకు వెగటు కలిగించింది. ఓట్ల కోసం దేశ ప్రతిష్టను సైతం పణంగా పెట్టే నీచ స్థాయికి నాయకులు దిగిపోయారన్నది వీరి స్టేట్‌మెంట్‌లతో అర్ధమైపోయింది. విపక్షాల నాయకులందరూ కూడా ప్రధాని నరేంద్రమోడీ మీద పెంచుకున్న ద్వేషాన్ని దేశంపై, దేశాన్ని రక్షించే సైన్యంపై వెళ్లగక్కినట్లయ్యింది. ఏ దేశంలో అయినా దేశం కోసం అక్కడ పార్టీలు, నాయకులు ఏకమవుతారు… కాని భారతదేశంలో పార్టీలు, నాయకులు మాత్రం ఓట్ల కోసం దేశాన్నయినా ముక్కలు చేస్తారని, అవసరమైతే శత్రుదేశం నాయకులను కూడా పొగుడుతారని ఈ సంఘటనల ద్వారా ఋజు వైంది. ఏ దేశ మీడియా అయినా మొదట తమ దేశ ప్రయోజనాలకు, దేశ రక్షణకు పెద్దపీట వేస్తుంది. భారతదేశంలో మీడియా మాత్రం తమ అనుకూల పార్టీల రాజకీయ ప్రయోజనాలకు, ‘కుల’ పార్టీల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చి దేశ భద్రతను గాలికొదిలేశాయి.

ఇవన్నీ కూడా ఈ సంఘటనల ద్వారా బహిర్గత మైన విషయాలు. అయితే మనం గర్వించాల్సిన విషయాలు ప్రస్ఫుటమయ్యాయి. పాక్‌పై ఉగ్రదాడి విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు అండగా నిలిచాయి. అంతర్జాతీయ వేదికలపై పాక్‌ను ఒంటరి చేయడంలో భారత్‌ విజయం సాధించింది. ఫైలట్‌ అభినందన్‌ విడుదల విషయంలో పాక్‌కు ఎలాంటి అవకాశమివ్వకుండా భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒక అగ్రరాజ్యం శాసన విధానాన్ని తలపించింది. నరేంద్ర మోడీ కాళ్లకు బలపాలు కట్టుకుని ఇన్ని దేశాలు ఎందుకు తిరిగాడు అని విమర్శించిన వాళ్ళకు ఇప్పుడు అర్ధమైవుంటుంది ఆయన విదేశీ పర్యటనల ఫలితం. ఏ ఒక్క దేశం కూడా ఈ సమయంలో పాక్‌కు తోడు రాలేదు. పాక్‌ను సాకుతున్న చైనా భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించి వున్నా ఈ విషయంలో మనం ఇబ్బంది పడేవాళ్ళం. కాని, దౌత్య సంప్రదింపులతో చైనాను కూడా దారికి తెచ్చాం. ఆఖరకుకు 56 ఇస్లామిక్‌ దేశాల సదస్సుకు కూడా భారత్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించి, పాకిస్థాన్‌ను వెలివేశారు. ఇంతకంటే దౌత్యవిజయం ఏముంటుంది!…

కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ వున్న సుస్థిర ప్రభుత్వమే కాదు, దేశ ప్రయోజనాలు, దేశ భద్రత పట్ల చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం అధికారంలో వుంటే, దేశమంటే ప్రేమ, దేశ ప్రజల పట్ల అభిమానం వున్న చిత్తశుద్ధి గల చౌకీదార్‌ ప్రధానిగా వుంటే… భారతదేశం సత్తా ఏ స్థాయిలో వుంటుందన్నది

నేడు మనందరం కళ్ళారాచూస్తున్నాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here