Home గల్పిక దడపుట్టించిన లోకేష్‌ సాహస విన్యాసాలు

దడపుట్టించిన లోకేష్‌ సాహస విన్యాసాలు

ప్రపంచ మేటి నగరాలలో మొదటి ర్యాంకు తెచ్చుకున్న అమరావతి నగరం. కరకట్ట మీదగల హైటెక్‌రత్న సీఎం చంద్రబాబు క్యాంప్‌ కార్యాలయం. చంద్రబాబు, లోకేష్‌, బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణి, వసుంధర, నారా దేవాన్ష్‌లు అక్కడ హాల్‌లో కూర్చుని టీవీలో ‘పెళ్లాం కొడితే పడాలి’ సీరియల్‌ చూస్తున్నారు. అంతలో అక్కడకు వెయిట్‌ లాస్‌ ప్రోగ్రామ్‌ మాస్టర్‌, ఎంపీ మురళీ మోహన్‌, జేసీ దివాకర్‌రెడ్డి, మంత్రులు పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వర రావు, పత్తిపాటి పుల్లారావులు వచ్చారు. నారాయణ వుండి… ఆ దిక్కుమాలిన సీరియల్స్‌ ఏం చూస్తారుగాని ముందు ఎన్‌టివి పెట్టండి అని చెప్పాడు. బాలకృష్ణ రిమోట్‌ తీసుకుని ‘ఎన్‌’ టివి పెట్టాడు. టీవీ స్క్రీన్‌పై వైసిపి అధినేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి బంగీజంప్‌ దృశ్యాలు వస్తున్నాయి. జగన్‌ సాహసం అద్భుతం… ఏ నాయకుడూ చేయని సాహసాన్ని జగన్‌ చేసాడు. ఆయన ఫీట్‌కు ప్రజలు ఫిదా అవుతున్నారు అని న్యూస్‌రీడర్‌ చెబు తోంది. ఆ సీన్‌లు చూసి చంద్రబాబుకు అరికాల్లో మండసాగింది. ఈ ఫీట్లు చేస్తే జనాలు ఓట్లేస్తారా? అని ఆవేశంగా చంద్రబాబు అడిగాడు. దానికి నారాయణ… ఇప్పుడు యూత్‌ ఇలాంటి సాహసాలు చేసే వాళ్ళనే అభిమానిస్తు న్నారు సార్‌. ముఖ్యంగా అమ్మాయిలు. మన లోకేష్‌ చేత కూడా ఇలాంటి ఫీట్లు ఏవన్నా చేయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. అక్కడే వున్న మురళీమోహన్‌… ఇలాంటి ఫీట్లు చేస్తే బరువు తగ్గుతా రనుకుంటే నేను చేయడానికి రెడీ అన్నాడు. అక్కడేవున్న దివాకర్‌రెడ్డి… బోచేసావ్‌లేవయ్యా ఆ ఫీట్లు… ఆ పిల్లోడంటే గట్టి గుండెకాయ వున్నోడు. మనమంతా ఆ ఫీట్లు చేస్తే గుండెకాయ జారి గొంతులోకి రాదూ అంటూ వారి ఉత్సాహంపై నీళ్ళు చల్లాడు. అంతా విన్న లోకేష్‌… జగన్‌ చేసింది కూడా ఒక ఫీటేనా… దాని అబ్బ లాంటి ఫీట్‌ చేస్తాను… మీ అందరూ ముక్కున వేలేసు కునేలా చేస్తాను… ఇదీ నా ఛాలెంజ్‌ అంటూ లేచాడు. లోకేష్‌ మాటలతో చంద్రబాబు ఖంగుతిని… నాయనా, లోకేసా అధికారం ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తుంది, మనకెందుకొచ్చిన తలనొప్పి చెప్పు అని నచ్చచెప్పబోయాడు. అందుకు లోకేష్‌… నేను ఒక్కసారి కమిట్‌ అయ్యానంటే నా మాట నేనే కాదు, నా భార్య మాట కూడా వినను. జై రాజమౌళి అంటూ లేచి వెళ్ళిపోయ్యాడు. లోకేష్‌ ఏం చేస్తాడో, ఏమో అనుకుంటూ అందరూ టెన్షన్‌ పడసాగారు!

్య్య్య్య్య

పక్కరోజు తెల్లారింది. చంద్రబాబు లేచి హాల్‌లోకి వచ్చాడు. అప్పుడే వచ్చిన చంద్రజ్యోతి పత్రికను తీసుకున్నాడు. మొదటిపేజీలోనే బ్యానర్‌లో… ఐటి మంత్రి నారా లోకేష్‌ అద్భుత సాహసాలు ఈరోజు ఉదయం 9గంటలకు మీ సిబిఎన్‌ ఛానెల్‌లో ”ఉద్యోగులు, వ్యాపా రులు, విద్యార్థులు… అందరూ ఆఫీసులు, స్కూళ్ళు, దుకాణాలు, కాలేజీలు ఎగ్గొట్టి ఇళ్ళలోనే కూర్చుని చూడండి…” అని వుంది. అది చదివి చంద్రబాబు ఇంట్లో వున్న భువనేశ్వరి, బ్రాహ్మణి, బాల కృష్ణలను పిలిచి ఆ వార్త చూపించాడు. అందరూ ఆశ్చర్యంతో… లోకేష్‌ ఏం చేసాడబ్బా అని ఆలోచనలో పడిపో యారు. చంద్రజ్యోతిలో ఈ వార్త చదివిన తెలుగుదేశం ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చేసారు, ఆయనతో కలిసి టీవీలో లోకేష్‌ సాహస విన్యాసాలు చూడాలని… ఆ ఆనందాన్ని ఆయన కళ్ళల్లో చూస్తూ తరించాలని. అప్పుడే లోకేష్‌ అక్కడకు వచ్చాడు. అందరూ లోకేష్‌ను చుట్టుముట్టి… ఏం ఫీట్‌ చేసారు బాబూ… మాకు టెన్షన్‌గా వుంది… చెప్పరా అని అడగసాగారు. దానికి లోకేష్‌… తినబోతూ రుచి అడగడం ఎందుకు? ఇంకో పదిహేను నిముషాలలో మీరే చూస్తారుగా అని చెప్పాడు. అక్కడ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో పోగవడంతో టీవీ అయితే అందరికీ కనిపించదని చెప్పి అప్పటి కప్పుడు భారీస్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. వరల్డ్‌కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్నట్లుగా వుంది అక్కడి వాతా వరణం. అప్పుడే 9గంటలయ్యింది. సిబిఎన్‌ ఛానెల్‌లో న్యూస్‌ మొదల య్యాయి. హెడ్‌లైన్స్‌లో ఒళ్ళు గగుర్పాటు చెందే సాహసవిన్యాసాలు.. బీపీ వుండే వాళ్ళు మాత్రలు వేసుకుని చూడాల్సిన దృశ్యాలు… లోకేష్‌ సాహసాలు… అంటూ న్యూస్‌రీడర్‌ చెప్పింది. వెంటనే స్క్రీన్‌పై బ్యాక్‌గ్రౌండ్‌లో బాహుబలి-1 సినిమాలోని ‘ధీవరా ప్రసర సౌర్య భార… ఉత్సర స్థిర గంభీర…’ అనే సాంగ్‌ వస్తుండగా ఎత్తైన కొండలు… వాటి మీద నుండి ఉధృతంగా కిందకు జారుతున్న జలపాతాలు… ఆ సీన్‌లోనే లోకేష్‌ బాహుబలిలో ప్రభాస్‌ గెటప్‌లో ఒక కొండ మీద నుండి ఇంకో కొండ మీదకు జంప్‌ చేయడం… అవతల కొండను పట్టుకోలేక పట్టుతప్పి 5వేల అడుగుల ఎత్తున్న కొండ మీద నుండి పడిపో తుండడం… (ఈ సీన్‌ చూసేటప్పుడు చంద్రబాబుతో సహా అందరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భువనేశ్వరి, బ్రాహ్మణిలలో అయితే టెన్షన్‌ తారా స్థాయికి చేరగా దేవాన్ష్‌ మాత్రం భలే భలే చేసావు నాన్న అంటూ చిట్టి చేతు లతో చప్పట్లు కొడుతున్నాడు) దాదాపు సగం భాగం క్రిందకు వచ్చిన సమ యంలో లోకేష్‌ టక్కున కొండపై నుండి పక్కకు వంగివున్న చెట్టు ఊడలను పట్టుకున్నాడు. ఆ ఊడలు పట్టుకునే వేలాడుతూ తన అమ్ముల పొదిలోవున్న ఒక బాణానికి మర్రిచెట్టు ఊడను బలంగా బిగించాడు. తర్వాత భుజానికి తగిలించుకుని వున్న విల్లును తీసి బాణాన్ని కొండ శిఖరం పైనవున్న చెట్టుకు గురిచూసి వదిలాడు. షార్‌ నుండి వదిలిన రాకెట్‌లా ఆ బాణం రివ్వున దూసుకుపోసాగింది. బాహుబలి పార్ట్‌ 1 చూసిన వాళ్ళందరూ… ఆ బాణం కొండ శిఖరానవున్న చెట్టులో గుచ్చుకుంటుం దని అనుకోసాగారు. కాని అక్కడ అలా జరగలేదు. లోకేష్‌ వదిలిన ఆ బాణం చెట్టును దాటిపోయి ఆకాశంలోకి దూసుకుపోసాగింది. అలా వెళ్ళి వెళ్ళి హైదరాబాద్‌ నుండి గన్నవరం పోతున్న ఓ విమానం టైరుకు తగులుతుంది. యాహూ అంటూ లోకేష్‌ ఆ ఊడలను పట్టుకుని పైకి ఎగబాకసాగాడు. విమానం వెయ్యి కిలోమీటర్ల వేగంతో పోతుంది. లోకేష్‌ అంతే వేగంతో ఎగ బాకాడు. విమానం అమరావతి ఏరియా లోకి రాగానే లోకేష్‌ అమాంతం 10వేల అడుగుల ఎత్తునుండి దూకేసాడు. ఆ ఫీట్‌ చూసి అందరికీ గుండెలు జారాయి. ప్రాణాలు ఉగ్గబట్టి చూస్తున్నారు. భూమికి వెయ్యి అడుగుల ఎత్తులో వున్నాడనగా లోకేష్‌ తన జేబులో నుండి ఒక బటన్‌ తీసి నొక్కాడు. అంతే ఆయన రెండు భుజాలకు తగిలించుకుని వున్న స్కూల్‌ బ్యాగ్‌ పారాచూట్‌లా మారింది. లోకేష్‌ పారాచూట్‌ సాయంతో ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం భవనం పైనే సురక్షితంగా దిగాడు. అప్పటిదాకా ఆ దృశ్యాలను ఉగ్గబట్టి చూస్తున్న వాళ్ళంతా లోకేష్‌ సురక్షితంగా దిగగానే పెద్దపెట్టున చప్పట్లు కొడుతూ లోకేష్‌కు అభినంద నలు తెలపసాగారు. టీవీ స్క్రీన్‌ మీద లోకేష్‌ సాహస విన్యాసాల దృశ్యాలు ముగియగానే పబ్లిక్‌ పోల్‌ ప్రశ్న ఒకటి ఇచ్చారు. ఇప్పటివరకు మీరు చూసిన లోకేష్‌ సాహసాలు నిజమేనని భావి స్తున్నారా? అవును అయితే ‘ఎస్‌’ అని, కాదు అయితే ‘నో’ అని మాకు టైప్‌ చేసి పంపండి అని ఇచ్చారు. ఓ ఐదు నిము షాల తర్వాత 99శాతం మంది ‘ఎస్‌’ అని టైపు చేసారని రిజల్ట్‌ కూడా ఇచ్చారు. అంతా అయ్యాక చంద్రబాబు లోకేష్‌తో… ఇంత సాహసం ఎలా చేయ గలిగావని అడిగాడు. దానికి, లోకేష్‌… మావయ్య బాలకృష్ణ స్ఫూర్తి… దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సహకారంతోనే ఇదంతా చేసా… రాజమౌళి అండ వుంటే ఈ ఫీట్లేం ఖర్మ, ప్రపంచాన్ని జయించే ఫీట్లే చేయగలను… అంతా గ్రాఫిక్స్‌ మహిమ అంటూ లేచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here