Home సినిమా వార్తలు తెలుగు తెరపై… ‘నంది’ చిచ్చు!

తెలుగు తెరపై… ‘నంది’ చిచ్చు!

ఈ రాష్ట్రంలో ప్రతిదీ రాజకీయమైపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేసినా దాని వెనుక ఓట్ల మర్మం దాగి వుంటుంది. లేదా పూర్తిగా రాజకీయ కోణం వుంటుంది. ఆ రాజకీయ కోణం ఇప్పుడు సినిమా రంగాన్ని కూడా వదల్లేదు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు సినీ పరిశ్రమకు సంబంధించి నంది అవార్డులు ప్రకటించలేదు. 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను మొన్న ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించింది. నంది విజేతల ఎంపికలో నందమూరి కుటుంబానికి పెద్దపీట వేసి సినీ పరిశ్రమలో నందమూరికి పోటీగా వున్న మెగా ఫ్యామిలీ ప్రాధాన్యత తగ్గించడం వివాదాలకు ఆజ్యం పోస్తోంది. కేవలం బంధుప్రీతితోనే నంది అవార్డుల ఎంపిక జరిగిందంటూ ఇప్పటికే సినీరంగం నుండి పలువురు విమర్శలు మొదలుపెట్టారు. 2014లో ఉత్తమ నటుడుగా బాలకృష్ణ, 2015లో మహేష్‌, 2016లో జూనియర్‌ ఎన్టీఆర్‌లు ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. 2014లో లెజండ్‌ను, 2015లో బాహుబలిని, 2016లో జనతాగ్యారేజ్‌ను ఎక్కువ అవార్డులు వరించాయి.

సినీ పరిశ్రమలో మెగా కుటుంబం నుండి చిరంజీవితో పాటు పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు, రామ్‌చరణ్‌, సాయి ధర్మతేజ, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, కంచె హీరో వరుణ్‌తేజ వున్నారు. వీరిలో చిరంజీవిని 2016 సంవత్సరానికి రఘుపతి వెంకయ్య జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు. అల్లు అర్జున్‌కు రుద్రమదేవి సినిమాకుగాను

ఉత్తమ సహాయనటుడు అవార్డు లభించింది. ఈ మూడేళ్ళలో మెగా ఫ్యామిలీ నటుల నుండి మంచి సినిమాలే వచ్చాయి. అల్లు అర్జున్‌ నటించిన సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాలో ఎంతో మంచి సందేశం దాగి వుంది. అలాగే తెలుగువారి పౌరుషాన్ని చాటే ‘రుద్రమదేవి’ సినిమాకు ఒక్క ఉత్తమ సహాయ నటుడు అవార్డు తప్ప ఇంకేమీ దక్కలేదు. దీనిపై ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్‌ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు. జరిగిందో లేదో తెలియని కల్పిత కథను ఆధారంగా చేసుకుని తీసిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించింది. అదే వాస్తవ కథతో, తెలుగుజాతి పౌరుషాన్ని చాటే సారాంశంతో తీసిన రుద్రమదేవి సినిమాకు మాత్రం వినోదం పన్ను మినహాయించలేదు. ఆ చిత్ర దర్శకుడు దీనినే ప్రశ్నించాడు. గోదావరి పుష్కరాలప్పుడు 23మంది భక్తుల ప్రాణాలు తీసి సెట్టింగ్‌లు వేసి నిర్మించిన పుష్కరాల డాక్యుమెంటరీకి నంది రావడం ఆశ్చర్యం కలిగించే విషయం కాకపోవచ్చు… కాని నందుల ఎంపికలో మెగా ఫ్యామిలీని తక్కువ చేసి చూసారనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here