Home గల్పిక తెలంగాణ భవన్‌లో చంద్రబాబుకు సన్మానం

తెలంగాణ భవన్‌లో చంద్రబాబుకు సన్మానం

అది హైటెక్‌రత్న చంద్రబాబు నాయుడు రాత్రి పగలు రిక్షా తొక్కి రక్తాన్ని చెమటగా మార్చి వచ్చిన సంపాదనతో కట్టిన హైదరాబాద్‌ నగరం. జూబ్లీహిల్స్‌ ప్రాంతం. ఎన్నికల విధ్వంస, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అప్పుడే ఆ ప్రాంతానికి ఆకస్మిక తనిఖీకి వచ్చాడు. ఆ రోడ్డు మీద ఓ వ్యక్తి ‘పావురాలగుట్టలో పావురమ య్యాడు… కొడంగల్‌లో నేను కాకి నయ్యాను పావురాల గుట్టలో పావుర మయ్యాడు…’ అని పదేపదే అంటూ అటు ఇటు పిచ్చోడిలా తిరుగుతున్నాడు. కేసీఆర్‌కు అతనినెక్కడో చూసినట్లుగా అనిపించి దగ్గరకెళ్లి చూసాడు. అంతే షాక్‌ తిన్నాడు. అతను రేవంత్‌రెడ్డి… అతని పక్కనే వున్న వ్యక్తితో… ఏంటి, రేవంత్‌ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని అడిగాడు. దానికతను మొన్న ఫలితాలు వచ్చినప్పటి నుండి ఇలా అయ్యాడు. కొడంగల్‌లో ఓడిపోవడంతోనే ఆయనకు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. అప్పటినుండి ఇట్లాగే అరుచు కుంటూ కొడంగల్‌ నుండి హైదరాబాద్‌ దాకా నడుచుకుంటూ వచ్చాడు అని చెప్పాడు. కేసీఆర్‌కు అతనిపై జాలేసింది. వెంటనే తన సిబ్బందిని పిలిపించి రేవంత్‌ రెడ్డిని కారులో ఎక్కించి పంపాడు. ఆ తరువాత కేసీఆర్‌ అలా నడుచుకుంటూ బంజారాహిల్స్‌ ఏరియాకు వచ్చాడు. అక్కడ ఇంకో వ్యక్తి పొడవాటి గడ్డంతో… ”కాశీకి పోయాను రామా హరే… నన్ను ఈవిఎంలే ముంచాయి రామాహరే” అని పాడుకుంటున్నాడు. కేసీఆర్‌కు అతను పరిచయం వున్న వ్యక్తిలాగే అనిపించి దగ్గరకెళ్లి చూసాడు. అతను ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. ఉత్తమ్‌, ఉత్తమ్‌ అని కేసీఆర్‌ గట్టిగా కేకలేసాడు. అతను ఈ లోకంలోకి రాలేదు సరికదా, అతను ఈవిఎంలే నన్ను ముంచాయి అని కలవరిస్తున్నాడు. ఎల క్షన్‌ ఫలితాల దెబ్బకు అతనికి కూడా మైండ్‌ దొబ్బిందని కేసీఆర్‌కు అర్ధమైంది. వెంటనే ఆయనను కూడా కారులో ఎక్కించి పంపించాడు.

కేసీఆర్‌ అక్కడ నుండి ల్యాంకో హిల్స్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఓ చోట వేల సంఖ్యలో జనం గుమికూడి వున్నారు. వాళ్లందరి చేతుల్లో చీపుర్లు, కర్రలు వున్నాయి. కేసీఆర్‌ వాళ్ళలో ఒకడిని పిలిచి… ఎందుకు మీరంతా చీపుర్లు పట్టుకుని వున్నారు, అసలు ఏమైందని అడిగాడు. అందుకావ్యక్తి… సార్‌, ఇది ప్రముఖ జ్యోతిష్య పండితుడు లగడపాటి రాజగోపాల్‌ ఇల్లు. వీళ్లంతా ఆయన బాధితులు… నిన్న ఎన్నికలలో ఆయన సర్వేను నమ్మి ప్రజాఫ్రంట్‌ గెలుస్తుం దంటూ కోట్ల రూపాయల పందేలు పెట్టినవాళ్ళు. ఆయన కనపడితే తన్నడాని కొచ్చారు అని చెప్పాడు. అందుకు కేసీఆర్‌… పందేలు కాయడం మీ తప్పు, దానికి అతనిని తన్ని ఏం లాభం అంటూ ఇంతకీ లగడపాటి ఏం చేస్తున్నాడో చూద్దామని లోపలకు వెళ్లాడు. అక్కడ చూస్తే లగడపాటి ఓ చిలకను పెట్టుకుని కొన్ని కార్డులు ముందుపెట్టి… రామ్మా కాజల్‌ అగర్వాల్‌… ఒక కార్డుని తీసి వీళ్ళ అదృష్టాన్ని చెప్పమ్మా అని తన పాటికి తానే మాట్లాడుకుంటున్నాడు. కేసీఆర్‌కు సీన్‌ అర్ధమైంది. ఫలితాలు చూసాక అతని చిన్నమెదడు చితికిపోయిందని, వెంటనే 108 అంబులెన్స్‌ను పిలిపించి ఆయనను కూడా అక్కడ నుండి షిఫ్ట్‌ చేయించాడు.

————

అది టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌. గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు, కార్యకర్తలతో తెలం గాణ భవన్‌ నిండిపోయింది. వేదికపైన ‘టిఆర్‌ఎస్‌ విజయసారధికి అభినందన సత్కారం’ అని బ్యానర్‌ తగిలించి వుంది. వేదికపైన అప్పుడే కేసీఆర్‌, డిప్యూటి సీఎం మహ్మద్‌ ఆలీ, ఎంపీలు కవిత, కేశవ రావులు ఆసీనులయ్యారు. కేసీఆర్‌ మైకు తీసుకుని… ఈరోజు టిఆర్‌ఎస్‌ పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ విజయంలో మీ అందరి కృషి వుంది. అయితే అసలు ఇంతటి విజయానికి మాత్రం కారణమైన వ్యక్తి ఒక్కడే వున్నాడు. ఆయనను ఈరోజు మనం సత్కరించు కోవడం ధర్మం… అని చెపుతుండగా… కేటీఆర్‌, హరీష్‌రావులు… ఆ ఒక్క వ్యక్తిని నేనే… ఆ సన్మానం నాకే అని మనసులో అనుకుంటూ ఎవరిపాటికి వాళ్ళు మురిసి పోతూ సన్మానం చేయించుకోవడానికి చొక్కా, ఫ్యాంటు సర్దుకున్నారు. ఈ పక్క కేసీఆర్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ… మన విజయంలో కీలకపాత్ర వహించిన ఆ వ్యక్తిని ఇప్పుడు వేదికపైకి పిలుస్తు న్నాను, మీరంతా చప్పట్లు చరచి స్వాగ తించాలి. ‘ప్రపంచం మెచ్చిన నాయకుడు చంద్రబాబునాయుడు… కమాన్‌ టు ది డయాస్‌’ అంటూ అరిచాడు. అంతే ఆ మాటకు హాల్‌ అంతా నిశ్శబ్దం… అందరూ షాక్‌… సభ మధ్యలో నుండి చంద్రబాబు లేచి నడుచుకుంటూ వెళ్లి వేదిక ఎక్కాడు. ఒక్క నిముషం తర్వాత హరీష్‌రావు, కేటీఆర్‌లు కోలుకున్నారు. హరీష్‌ వుండి… ఏంటి మామా ఇది, పార్టీ గెలుపు కోసం నేను కష్టపడ్డాను. లేదంటే కేటీఆర్‌ కష్టపడ్డాడు. మా ఇద్దరినీ వదిలేసి మన పార్టీని ఓడించాలని చూసిన చంద్రబాబును సన్మానిస్తానంటావేమిటి అని అడిగాడు. కేటీఆర్‌ కూడా లేచి… ఇది అన్యాయం డాడీ అని నిలదీశాడు. అప్పుడు కేసీఆర్‌ కోపంగా… ఆపండ్రా… అంతకుమించి ఒక్క మాట మాట్లాడినా మీ వీపులు విమానం మోతమోగు తాయ్‌… మన పార్టీని ఓడించాలని చెప్పి ఆయన పోటీ చేసాడని మీరంటున్నారు, మన పార్టీని గెలిపించడం కోసమే ఆయన పోటీ చేసాడని నేను నమ్ముతున్నాను, ఆయన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబట్టే, ఆ పార్టీ వైపున్న వర్గాలు కూడా మన వైపుకొచ్చాయి. హైదరాబాద్‌ను నేనే కట్టాను, హుస్సేన్‌సాగర్‌ను నేనే తవ్విం చాను అని ఆయన ప్రచారం చేయబట్టే తెలంగాణ ఫీలింగ్‌ వున్న ప్రతి ఒక్కరూ మనకు ఓట్లేసారు. ఆయన ఇక్కడ కాలు పెట్టబట్టే వై.యస్‌.ను అభిమానించే ప్రతిఒక్కరూ మనకు అండగా నిలిచారు. తెలంగాణ కాంగ్రెస్‌తో నాకేం పనిలే అని ఆయన అనుకుని వుంటే మనం గెలవ డమే డౌటుగా వుండేది. ఇప్పుడు చెప్పండి ఆయనకు సన్మానం చేయడం రైటా… రాంగా? అని ప్రశ్నించాడు. హరీష్‌, కేటీఆర్‌లు మౌనంగా తలలు దించుకున్నారు. తర్వాత వేదికపై చంద్రబాబును అందరూ కలిసి ఘనంగా సత్కరించి ‘టిఆర్‌ఎస్‌ మిత్ర’ అవార్డ్‌ను ప్రదానం చేశారు. సభ ముగిసిన తర్వాత అందరూ వెళ్లిపోతున్నారు. కేసీఆర్‌ కూడా వేదిక దిగి క్రిందకు వచ్చాడు. కేటీఆర్‌ తన తండ్రి వద్దకు వెళ్లి నిజం చెప్పు నాన్న… చంద్రబాబుకు సన్మానం చేయడానికి ఇంకో కారణమేదో వుంది, అదేంటో చెప్పు అని అడిగాడు. అప్పుడు కేసీఆర్‌… అటు చూడు అని వేలు ఓ పక్కకు తిప్పాడు. కేటీఆర్‌ అటువైపు చూసాడు. అక్కడ చూస్తే చంద్రబాబు, ఆయన పక్కన రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌, లగడపాటి రాజగోపాల్‌ వున్నారు. వారిని చూపిస్తూ కేసీఆర్‌… మొన్నటి ఫలితాల దెబ్బకు ఆ ముగ్గురికి మైండ్‌ బ్లాకయ్యింది. ఈరోజు ఉదయాన్నే ఆ విషయం నాకు తెలిసింది. వాళ్ళ ముగ్గుర్నీ డాక్టర్‌కు చూపించాను. షాక్‌వల్ల అలా అయ్యారని, మళ్ళీ అలాంటి షాక్‌తోనే వాళ్ళు మామూలు స్థితికి రాగలరని చెప్పాడు. అందుకే ఈరోజు ఈ ప్రోగ్రామ్‌ పెట్టాను. ‘టీఆర్‌ఎస్‌ గెలుపులో చంద్రబాబుదే ప్రధానపాత్ర’ అనే వార్త వాళ్ళకు పెద్ద షాక్‌ అయ్యింది. దాని వల్లనే వాళ్ళు తిరిగి మామూలు స్థితికి వచ్చారు. రాజకీయంగా మనం ఒకర్నొకరు ఎన్నయినా అనుకోవచ్చు… కాని ఆరోగ్యపరంగా ఒకరికొకరు చెడిపోవాలని కోరుకోకూడదు. మాన వతా దృక్పథంతో నేను చేసిన ఈ పని తప్పా? అని ప్రశ్నించాడు. అప్పుడు కేటీఆర్‌ పశ్చాత్తాపంతో… సారీ డాడీ, మిమ్మల్ని అపార్ధం చేసుకున్నాను, ఇప్పటి దాకా మీరు నా దృష్టిలో పొలిటికల్‌ హీరో… ఇప్పుడు మానవత్వంలోనూ నిజమైన హీరో అనిపించుకున్నారంటూ తండ్రికి సెల్యూట్‌ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here