Home రాష్ట్రీయ వార్తలు తాకట్టులో తెలుగు పౌరుషం

తాకట్టులో తెలుగు పౌరుషం

ఈ దేశంలో ఒక్కో రాజకీయ పార్టీ చరిత్ర ఒక్కో రకంగా వుంటుంది. బ్రిటీషోళ్ళు పెట్టిన పార్టీ కాంగ్రెస్‌… మావో, కార్ల్‌మార్క్స్‌ సిద్ధాంతాల నుండి పుట్టినది కమ్యూనిష్టు పార్టీ… పేదల కోసం సోషలిస్ట్‌ పార్టీ… బహుజనుల కోసం బిఎస్పీ… ముస్లింల పార్టీగా ముస్లిం లీగ్‌… ద్రవిడ సంస్కృతి లక్ష్యంగా డిఎంకె… ఇలా ప్రతి పార్టీ పుట్టుక వెనుక కారణం ఉం టుంది. కాని ఈ పార్టీలలో ఏ ఒక్క పార్టీకి లేని చరిత్ర తెలుగుదేశం పార్టీకి వుంది.

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా పుట్టిన పార్టీ. ఢిల్లీ గడ్డపై తెలుగుపౌరుషాన్ని చాటిన పార్టీ. తెలుగు జాతి కీర్తిపతాకగా నిలిచిన పార్టీ. దేశ రాజకీయాలలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌పై పోరాటమే లక్ష్యంగా నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం.

ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీని స్థాపించడమే కాదు, తన కొనఊపిరి ఉన్నంతవరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడాడు. తాను బ్రతి కున్నంత కాలం కాంగ్రెస్‌ను ఆయన బద్ధశ్రతువుగానే చూసాడు. పార్టీ పెట్టిన 9నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని చేపట్టిన రికార్డు ఎన్టీఆర్‌ది. అయితే ఏడాది తిరక్కముందే కుట్రపన్ని ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన ఘనత కాంగ్రెస్‌ది. తెలుగు ప్రజలందరూ ఏకతాటిపై నడిచి ఆరోజు మళ్ళీ ఎన్టీఆర్‌ను గద్దెనెక్కేలా చేశారు.

1977లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కేంద్రంలో ఏర్పడ్డ జనతా ప్రభుత్వం ఏడాదికే కుప్పకూలిపోయింది. మళ్ళీ పదేళ్ళ దాకా జాతీయ రాజకీయాలలో అలాంటి ప్రయోగాలు జరగలేదు. కాని ఎన్టీఆర్‌ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేషనల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసాడు. 1989లో నేషనల్‌ ఫ్రంట్‌ను కేంద్రంలో అధికారంలోకి తీసుకురావ డంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హత్యానంతరం వెల్లువెత్తిన సానుభూతిలో దేశమంతా కాంగ్రెస్‌ గెలిస్తే, ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం హవా పనిచేసింది. 34సీట్లతో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం కూర్చొంది. అలాంటి రికార్డు టీడీపీది! కాంగ్రెస్‌ విషయంలో ఎన్టీఆర్‌ పాజిటివ్‌గా వ్యవహరించిన సందర్భం ఏదన్నా ఉం దంటే అది 1992లో నంద్యాల లోక్‌సభ ఉపఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని పోటీ పెట్టకుండా కాంగ్రెస్‌ అభ్యర్థి పి.వి.నర సింహారావుకు మద్దతు పలకడమే! అది కూడా ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌కు మద్దతు తెలప లేదు. ఒక తెలుగోడు ప్రధానమంత్రిగా వున్నాడని చెప్పి, సాటి తెలుగోడిగా తొలి తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావుకి మద్దతు పలికారంతే!

ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన చేతుల్లో నుండి ఎలా వెళ్లి పోయింది, ఇప్పుడు ఎలా నడుస్తుందనే చరిత్ర అందరికీ తెలిసిందే! కాకపోతే తెలుగుదేశం పార్టీ విషయంలో ఇప్పుడు మరో కొత్త చరిత్ర మొదలు కాబోతోంది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఎన్టీఆర్‌ పెట్టిన తెలుగుదేశం రూపురేఖలు ఆసాంతం మారబోతున్నాయి. ఏ కాంగ్రెస్‌పార్టీకైతే వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని పెట్టాడో, అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైంది. దీని కోసం తెరవెనుక జర గాల్సిన తతంగాన్నంతా చంద్రబాబు పూర్తి చేసేసాడు.

1995లో చంద్రబాబు చేతుల్లోకి తెలుగుదేశం వచ్చింది. అప్పటి నుండి ఏ ఎన్నికల్లోనూ ఆయన ఒంటరిగా పోరాడ లేదు. ఏదో ఒక పార్టీతో పొత్తు ఉండనే వుంటుంది. 1999, 2004 ఎన్నికల్లో బీజేపీతో కలిసాడు. 2009 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌, వామపక్షాలతో పొత్తు, 2014 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీతోడు… ఇప్పుడు బీజేపీతోనూ పొత్తు తెగిపోయింది. ఎన్డీఏ నుండి తెలుగుదేశం బయటకు రావడం తెలిసిందే! 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోవాలంటే చంద్రబాబుకు భయం పట్టు కుంది. ప్రత్యేకహోదా విషయంలో బీజేపీపై ప్రజల్లో వున్న వ్యతిరేకత తనపై పడుతుం దనే భయంతోనే ఆయన ఆ పార్టీని వదిలించుకున్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి జనసేన చేత విడిగా పోటీ చేయిస్తున్నాడు. ఇక పొత్తుకు వున్న అవకాశం కాంగ్రెస్‌ మాత్రమే! తాము అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్‌ అంటోంది. ఈమధ్య పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్‌, తెలుగు దేశంల మధ్య స్నేహం అనే మొగ్గ చిగురిం చింది. ఎన్డీఏ ప్రభుత్వంపై తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్‌ మద్దతునిస్తే, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి టీడీపీ మద్దతు పలికింది! ఇక కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వ ఏర్పాటప్పుడు రాహుల్‌-బాబు చెట్టపట్టాలేసుకోవడం, ఇటీవల హైదరా బాద్‌కొచ్చిన రాహుల్‌ను నారా బ్రాహ్మణి కలవడం వంటివన్నీ ఇరు పార్టీల మధ్య బలపడుతున్న స్నేహబంధానికి తీపిగుర్తులు.

జాతీయ రాజకీయాలలో మోడీ గ్రాఫ్‌ పడిపోతోందని, రాహుల్‌ క్రేజ్‌ పెరుగు తుందని చంద్రబాబు నమ్ముతున్నాడు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ ముందుచూపుతోనే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పంతంతో వుంది. అక్కడ కాంగ్రెస్‌తో టీడీపీ జత కలిస్తే టీఆర్‌ఎస్‌కు కొంతవరకు నష్టమే! తెలంగాణలో టీడీపీకి ఇంకా అంతో ఇంతో కేడర్‌ మిగిలేవుంది. తెలంగాణలో తాము తక్కువ సీట్లు తీసుకుని కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వదలడం, అలాగే ఏపిలో కాంగ్రెస్‌కు ఓ ఇరవై లేదా పాతిక సీట్లిచ్చి మిగతా సీట్లలో తాము పోటీ చేయడం చంద్రబాబు ప్లాన్‌. ఈ పొత్తు ద్వారా టీడీపీ సపోర్ట్‌తో తెలంగాణలో కాంగ్రెస్‌, ఏపిలో కాంగ్రెస్‌ మద్దతుతో టీడీపీ అధికారంలోకి రావాలన్నది ప్రణాళిక! టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్‌ సిద్ధంగానే వుండడంతో ఈ రెండు పార్టీల చారిత్రాత్మక తప్పుడు కలయికకు త్వరలోనే ముహూర్తం ప్రకటించే అవ కాశముంది.

ఈ తతంగమంతా స్వర్గం నుండి ఎన్టీఆర్‌ ఆత్మ చూస్తుందనుకోండి… ఏమవుతుంది… ఈ లోకంలో వుండగా ఆయన స్థాపించిన పార్టీ నుండే ఆయనను బయటకు గెంటేసి, మానసిక క్షోభకు గురిచేసి అన్ని విధాలా ఆయన కుంగి పోయేలా చేసారు. ఇప్పుడు పైలోకంలో వున్న ఎన్టీఆర్‌ ఆత్మను కూడా ప్రశాంతంగా ఉండనీయడం లేదు. కాంగ్రెస్‌తో తెలుగు దేశం పొత్తు పెట్టుకోవడాన్ని పైనుండి ఎన్టీఆర్‌ ఆత్మ చూస్తే… బహుశా ఆత్మకు ఆత్మహత్య చేసుకునే అవకాశం వుంటే అదే జరుగుతుందేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here