Home సంపాదకీయం తరలివచ్చిన న్యాయదేవత

తరలివచ్చిన న్యాయదేవత

ఆంధ్రప్రదేశ్‌ విభజన… ఇందులో తొలి ఘట్టం రాష్ట్ర రాజధానిని హైదరాబాద్‌ నుండి అమరావతికి తరలించడం. ఆరోజు కన్నీటి వీడ్కోలుల మధ్య ఎన్నో ఏళ్ళపాటు తాము కూర్చున్న కుర్చీలను, తాము పనిచేసిన ఛాంబర్‌లను, తమ సొంత ఇంటిలా భావించే సచివాలయం భవనాలను వదిలేసి అమరావతికి ఉద్యోగులు తరలివచ్చిన సన్నివేశం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే వుంది.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ నుండి పదేళ్ళ పాటు మనకు పరిపాలన సాగించుకునే అవకాశమున్నా, రెండేళ్ళు కూడా గడవకముందే, అమరావతిలో ఎటువంటి సౌకర్యాలు, వసతులు, భవనాలు సమకూరక ముందే రాజధానిని హైదరాబాద్‌ నుండి అమరావతికి తరలించడానికి కారణమెవరు? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే! ఆరోజు ఓటు-నోటు కేసు ఆయన మెడకు చుట్టుకోవడంతో, కేసీఆర్‌తో కుదిరిన మధ్యస్థంలో భాగంగా చంద్రబాబు ఉన్నఫళంగా హైదరాబాద్‌ను వదిలి అమరావతికి రావాల్సివచ్చింది. ఆయనకంటే కృష్ణా నది కరకట్ట మీద లింగమనేని గెస్ట్‌హౌస్‌ రెడీగా వుండింది. మరి సచివాలయ సిబ్బంది పరిస్థితి అదికాదే..! అమరావతిలో చూస్తే తాత్కాలిక భవనాలు, వర్షం వస్తే ఉరుస్తాయి…

ఉద్యోగులకు నివాస గృహాలు సిద్ధం కాలేదు. విజయ వాడ, గుంటూరుల్లో చూస్తే ఇళ్ళు దొరకని పరిస్థితి. ఇప్పటికీ అమరావతి సచివాలయంలో పనిచేసే సిబ్బంది 90శాతం వరకు హైదరాబాద్‌ నుండే రాక పోకలు సాగిస్తున్నారు. ‘ఓటు-నోటు’ కేసు ఫలితాన్ని చంద్రబాబు కంటే సచివాలయ సిబ్బందే ఎక్కువుగా అనుభవిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత అతికీలకమైన రెండో ఘట్టానికి 2018-19 సంవత్సరాల ముగింపు ఆరంభం వేదికగా నిలిచింది. అదే హైకోర్టు విభజన. రాష్ట్ర విభజన నాటి నుండి కూడా హైకోర్టు విభజన పెద్ద పీటముడిగా వుండింది. హైకోర్టును విభజించాలంటూ తెలంగాణ న్యాయవాదులు, తమకు ప్రత్యేక హైకోర్టు కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఇద్దరి డిమాండ్‌ సారాంశం ఒక్కటే! ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడమే అంతిమ లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే హైదరాబాద్‌లో వున్నట్లే ఆంధ్ర ప్రాంతాలలోనూ ఒక హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వున్నాయి. కాకపోతే రాయలసీమ వాసులు కర్నూలులోనే హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని అడుగుతుంటే, ఉత్తరాంధ్రవాళ్ళు మాత్రం వైజాగ్‌లో ఏర్పాటు చేయాలని అడుగుతూ వచ్చారు. అయితే ఏకంగా రాష్ట్ర విభజనే జరగడంతో హైకోర్టునే ప్రత్యేకంగా ఆంధ్రాలో పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే రాయలసీమ వాసులు అడిగినట్లు కర్నూలులోనో, ఉత్తరాంధ్ర వాళ్ళు కోరినట్లు వైజాగ్‌లోనో కాకుండా తనకిష్టమైన అమరావతిలోనే హైకోర్టును ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొగ్గుచూపాడు. సరే, అమరావతిలోనే హైకోర్టు కొలువుదీరింది. 2018 ఏడాది చివరి రోజున ఏపి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు తాము ఇన్నేళ్ళు అనుబంధం కొనసాగించిన హైదరాబాద్‌ హైకోర్టు భవనాలను వదిలేసి భారమైన మనసులతో ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో విజయవాడకు తరలిరాగా, 2019 ఏడాది ప్రారంభంరోజున అదే విజయవాడలో హైకోర్టు న్యాయమూర్తుల చేత ప్రమాణస్వీకారం చేయించే ఘట్టం జరిగిపోయింది.

ఏపిలో హైకోర్టు ఏర్పాటు అన్నది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆనందంగా జరుపుకోవాల్సిన విషయం. కాని దీనిని వివాదాలకు కేంద్రంగా చేశారు. లేనిపోని రాద్ధాంతాలకు తెరలేపారు. ఇక్కడా కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరే! అమరావతిలో హైకోర్టు ఏర్పాటు అన్నది రాష్ట్ర విభజననాడే తెలిసిన విషయం. కొన్నేళ్ల క్రితమే హైకోర్టు భవనాల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం 500కోట్లు విడుదల చేసింది. 2018 డిసెంబర్‌ 15కల్లా హైకోర్టు భవనాలను పూర్తి చేస్తామని రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేశాకే రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు తన ఘనతేనని చంద్రబాబు చెప్పుకున్నారు. చంద్రబాబు హామీ ఇచ్చాక ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి నిర్మా ణంలో వున్న భవనాలను పరిశీలించారు. డిసెంబర్‌ ఆఖరుకల్లా హైకోర్టు భవనాలు సిద్ధం అని చెప్పిన చంద్రబాబు మాటలపై నమ్మకంతోనే హైదరాబాద్‌లో ఏపి న్యాయమూర్తులు, న్యాయవాదులు తట్టాబుట్టా సర్దుకుని అమరావతికి రావడానికి సిద్ధమయ్యారు. తీరా గడువు సమీపించే సరికి చూస్తే అమరావతిలో భవనాలు సిద్ధం కాలేదు, సిబ్బందికి తగిన నివాస సదుపాయాలు లేవు. హైకోర్టుకు సరైనదారులు లేవు. ఇన్ని అవస్థల మధ్య హైకోర్టు కార్యకలాపాలు సాగిం చడం సాధ్యమేనా? సీఎం క్యాంపు కార్యాలయంలోనే తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేశారు. అమరావతిలో అన్నీ తాత్కాలికమే కాబట్టి… చివరకు హైకోర్టు కూడా తాత్కాలికమే అయ్యింది.

హైకోర్టు విభజన తధ్యమని తెలిసి కూడా ఇన్నేళ్ళు కాలయాపన చేసి, ఈరోజు ఆ నిందను చంద్రబాబు ఇంకొకరిపై మోపాలని చూస్తున్నాడు. ప్రపంచ దేశాలకే పాఠాలు చెప్పిన నాయకుడు నాలుగేళ్లలో హైకోర్టు భవనాలను కట్టలేకపోయాడు. ఏ బిల్డర్‌కు ఈ పని అప్పగించివున్నా ఏడాదిలోపే పూర్తి చేసుండేవాడు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు హైకోర్టు విషయంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు రాజకీయ ప్రత్యర్ధులపై బురద చల్లే పనిలో పడ్డాడు. శుభవేడుకగా జరగాల్సిన హైకోర్టు ఏర్పాటును కూడా రాజకీయ వివాదాలకు వేదికగా మలచడం చంద్రబాబుకే చెల్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here