Home జిల్లా వార్తలు తగ్గేది లేదంటున్న… కోవూరు కోళ్ళు

తగ్గేది లేదంటున్న… కోవూరు కోళ్ళు

కోవూరులో వర్గపోరు తెలుగుదేశం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారేటట్లుంది. 2014 ఎన్నికలలోనే కోవూరు టిక్కెట్‌ను ఆశించి భంగపడ్డ పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి ఈసారి మాత్రం ఆరునూరైనా కోవూరు నుండి పోటీ చేసేది ఖాయమంటున్నాడు. ఆయన పార్టీ, సింబల్‌పై గ్యారంటీ ఇవ్వడం లేదుగాని, కోవూరు అసెంబ్లీ బ్యాలెట్‌ పేపర్‌లో మాత్రం తన పేరు ఖాయంగా వుంటుందంటున్నాడు. అంతేకాదు… వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో తిరగడం కూడా మొదలుపెట్టాడు.

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి టీడీపీని వదిలిపోయాక, కొంతకాలం సోమిరెడ్డి పార్టీని నెట్టుకొచ్చాడు. 2014కు రెండేళ్ళ ముందు నుండి పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి కోవూరు ఇన్‌ఛార్జ్‌గా వుంటూ పార్టీ కేడర్‌ను పట్టుకొచ్చాడు. 2014 ఎన్నికల్లో పెళ్ళకూరు శీనయ్యను కాదని కాంగ్రెస్‌ నుండి వచ్చిన పోలంరెడ్డి శీనయ్యకు సీటిచ్చారు. కోవూరు ఎమ్మెల్యేగా పోలంరెడ్డి గెలిచాడు. నియోజకవర్గంలో ఆయన తన వర్గాన్ని పెంచుకుంటూ పెళ్ళకూరు వర్గాన్ని తొక్కే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో కోవూరులో పలుసార్లు విభేదాలు తెరకెక్కాయి. పెళ్ళకూరు వర్గీయులకు పార్టీలో పదవులు లేకుండా చేసారు. ఆయన మనుషులకు ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. ఎమ్మెల్యే పోలంరెడ్డి చర్యలను నిరసిస్తూ కొందరు కోవూరు నాయకులు బహిరంగంగానే పత్రికలకు ఎక్కగా, ఇంకొందరు పార్టీకి రాజీనామా చేసిపోవడం జరిగింది.

అయితే కోవూరు టీడీపీలో ఇప్పటివరకు జరిగింది ఓ ఎత్తు… రేపు జరగబోయేది మరోఎత్తు… ఈసారి సీటు విషయంలోనే పోలంరెడ్డితో పెళ్ళకూరు పోటీపడబోతున్నాడు. ఒకవేళ టీడీపీ సీటు రాకున్నా కోవూరులో దిగడానికి పెళ్ళకూరు సిద్ధమవుతున్నాడంటే… ఆయన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించుకున్నట్లుగానే వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here