Home జిల్లా వార్తలు తండ్రి టిడిపి.. తనయుడు వైసిపి

తండ్రి టిడిపి.. తనయుడు వైసిపి

తెలుగుదేశం పార్టీలో టాప్‌ మోస్ట్‌ సీనియర్‌లలో వేనాటి రామ చంద్రారెడ్డి ఒకడు. చంద్రబాబుది 1985బ్యాచ్‌. కాని, రామచంద్రా రెడ్డిది 1983 బ్యాచ్‌. ఇప్పుడు పార్టీ నాయకులలో ఈ బ్యాచ్‌ వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే వుంటారు. అంటే పార్టీలో 35ఏళ్ళ సీనియార్టీ వుంది. మధ్యలో ఒక్కసారి కూడా పార్టీని వదిలి పోలేదు. స్వర్గీయ వై.యస్‌. రాజశేఖరరెడ్డితో వ్యక్తిగత సాన్నిహిత్యం వున్న రోజుల్లో కూడా ఆయన తెలుగుదేశాన్ని వదల్లేదు.

దాదాపు 35ఏళ్ళ సీనియార్టీకి ఆయనకు లభించిన పదవులు సూళ్ళూరుపేట మండలాధ్యక్షుడు, చెంగాళమ్మ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ఛైర్మెన్‌, సూళ్లూరుపేట జడ్పీటీసీ, జడ్పీ ఫ్లోర్‌ లీడరే! సూళ్ళూరుపేట అసెంబ్లీ ఎస్సీ రిజర్వుడ్‌ కావడంతో ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించే బాధ్యత పైనపడిందే గాని, ఎమ్మెల్యే అయ్యే అవకాశమే రాలేదు. మొన్నటిదాకా ఏ పదవీ లేకపోయినా కనీసం పార్టీలో విలువవుండింది. 2014 ఎన్నికల తర్వాత పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో వున్న వాకాటి నారాయణరెడ్డి టిడిపి లోకి రావడం, సూళ్లూరుపేట రాజ కీయాలలో గంగాప్రసాద్‌కు పెద్ద పీట వేయడం వంటివి రామచంద్రా రెడ్డిని చిన్నబుచ్చాయి. జడ్పీ ఛైర్మెన్‌ కావాలన్న కలలు నెరవేరకపోయినా, కనీసం చంద్రబాబు హయాంలో టిటిడి సభ్యుడిగానో, లేదా ఏదో ఒక నామినేటెడ్‌ పదవో ఇస్తారని ఆయన ఆశిస్తూ వచ్చాడు. కాని, అవేమీ రాలేదు. రామచంద్రారెడ్డి సీనియార్టీని చంద్రబాబు గౌరవించలేదు. అయినా ఇంతకాలం వున్న తెలుగుదేశాన్ని వీడలేక ఆయన టిడిపిలోనే ఉండిపోయాడు.

కాని, కొడుకులు అలా సర్దుకోరుగా! యువరక్తం వూరికే వుంటుందా? ఇప్పుడు అదే జరిగింది. రామచంద్రారెడ్డి

కొడుకు వేనాటి సుమంత్‌రెడ్డి వైసిపిలో చేరిపోయాడు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరిగిన జగన్‌ పాద యాత్రలో పాల్గొని అప్పుడే పరోక్ష సంకేతాలిచ్చిన

సుమంత్‌, ఇప్పుడు జగన్‌ సమక్షంలో వైసిపి బాట పట్టాడు. ఇప్పుడు తనయుడు వైసిపి… అయినా తండ్రి టిడిపిని వదిలే ఆలోచనలో లేడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here