Home జిల్లా వార్తలు టీంను సిద్ధం చేసుకుంటున్న ఆదాల

టీంను సిద్ధం చేసుకుంటున్న ఆదాల

లోక్‌సభా?.. అసెంబ్లీయా?… నెల్లూరుజిల్లా తెలుగుదేశంపార్టీలో స్టార్‌డమ్‌గా వున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముందు ఇప్పటివరకు నిలిచిన ప్రశ్న? నెల్లూరు లోక్‌సభకు ఆదాలే సరైన అభ్యర్థి… ఇదీ తెలుగుదేశం శ్రేణుల అభిప్రాయం. లోక్‌సభను మోటుకునేంత ఆర్ధిక వనరులు నా వద్ద లేవు… కోవూరో, కావలో… ఏదో ఒక అసెంబ్లీ నా ముఖాన పడేయండి, అక్కడ పోటీ చేస్తాను… ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేసుకున్న విజ్ఞప్తి. ప్రభాకరా, డబ్బుతో నీకు సంబంధం లేదు, ఇది 2014 ఎలక్షన్‌ అనుకున్నావా, 2019 ఎలక్షన్‌… అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల తర్వాత కూడా మనం డబ్బు గురించి ఆలోచించడమేంటి, నెల్లూరు లోక్‌సభకే పోటీ చేయ్‌.. దానికి నువ్వే సమర్ధుడివి… గెలిస్తే లోక్‌సభలో కూర్చుంటావ్‌… అఫ్‌కోర్స్‌ ఓడిపోయావా… రాజ్యసభలో కూర్చుంటావ్‌… ఎక్కడైనా పార్లమెంటులో కూర్చోవడమే కదా నీక్కావాలి… చంద్రబాబు హామీ.

మొత్తానికి ఆదాలను నెల్లూరు లోక్‌సభ నుండే దింపడానికి రంగం సిద్ధమైంది. ఆయన అభ్యర్థిత్వంపై ఏదో అద్భుతాలు జరిగితే తప్ప ఇక మార్పు వుండకపోవచ్చు. తాను నెల్లూరు లోక్‌ సభకు పోటీ చేయాలంటే అధిష్టానానికి ఆదాల పెట్టిన కండీషన్‌లలో ప్రధాన మైనది అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక. నియో జకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీలలో కొన్ని నియోకవర్గాలకు అభ్యర్థులను ఆదాల ఇష్టప్రకారం వదిలేయాలి. కందుకూరుకు సిటింగ్‌ ఎమ్మెల్యే పోతుల రామారావే అభ్యర్థిగా వుంటాడు. ఉదయ గిరిలో సిటింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామా రావుపై వ్యతిరేకత వున్న దృష్ట్యా ఆదాల కావ్య కృష్ణారెడ్డి, లేదా కంభం విజయ రామిరెడ్డిలలో ఒకరివైపు మొగ్గుచూపు తున్నట్లు తెలుస్తోంది. కావలి నుండి బీద మస్తాన్‌రావునే ఆయన మళ్ళీ అభ్యర్థిగా కోరుకుంటున్నాడు. ఆత్మకూరు నుండి బొల్లినేని కృష్ణయ్యను దాదాపు ఖరారు చేసేసినట్లే! ఆత్మకూరులో ‘రెడ్డి’ వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలని మొదట ఆదాల భావించాడు. మరి ఎందుకో ఫైనల్‌గా ‘కమ్మ’ సామాజిక వర్గానికి చెందిన కృష్ణయ్యకే జై కొట్టాడు. కోవూరు నుండి సిటింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వైపే ఆదాల మొగ్గు చూపుతున్నాడు.

నెల్లూరు నగరం, రూరల్‌ సీట్ల విష యంలోనే ఇంకా క్లారిటీ వచ్చినట్లు లేదు. రూరల్‌లో శ్రీధర్‌రెడ్డిని ఢీ కొట్టడానికి టీడీపీలో సరైన అభ్యర్థి లేడు. రూరల్‌లో పోటీ చేయమని మంత్రి పి.నారాయణను ఆదాల కోరుతున్నాడు. రూరల్‌లో శ్రీధర్‌కు గట్టి పోటీ నెలకొంటేనే లోక్‌సభలో తనకు మెజార్టీ తగ్గకుండా వుంటుందని ఆయన ఆలోచన. కాని, నారాయణ మాత్రం పోటీ చేస్తే గీస్తే నెల్లూరు నగరం నుండే నంటున్నాడు. నెల్లూరురూరల్‌ నుండి నారాయణను దించితే, నగరంలో అజీజ్‌ను లేదా ముంగమూరు శ్రీధరకృష్ణా రెడ్డిని పెట్టుకున్నా నెట్టుకురావొచ్చనేది ఆదాల ధీమా! కాని ఇక్కడ నారాయణ విషయంలోనే మడత పేచీ పడుతుంది. నెల్లూరు సిటీకి అభ్యర్థి సమస్య కాదు. రూరల్‌కు సరైన అభ్యర్థి దొరికితే ఆదాలకు టీమ్‌ సెట్‌ అయినట్లే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here