Home జిల్లా వార్తలు జిల్లా వైకాపా గాడిన పడేనా?

జిల్లా వైకాపా గాడిన పడేనా?

రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి కంచుకోటగా పేరున్న జిల్లా నెల్లూరు. ప్రతిపక్ష వైసిపి కంటే అధికార తెలుగుదేశంపార్టీయే ఇక్కడ రేస్‌లో వెనుకబడి వుంది. ఆ పార్టీకి 2014 ఎన్నికల్లో తాము గెలుచుకున్న మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు వైసిపి నుండి జంప్‌ చేసిన ఎమ్మెల్యే స్థానంలో కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై మరియు ప్రభుత్వంపై వ్యతిరేకత కనపడుతోంది. ఒకట్రెండు చోట్ల తప్పితే నెల్లూరు పార్లమెంటుతో పాటు మిగిలిన అసెంబ్లీ నియోజక వర్గాలకు కూడా అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ నానా తంటాలు పడుతోంది. తెలుగుదేశంకు ఇలాంటి సమస్యలున్నాయి కాబట్టే వైసిపి గట్టిగా వుందనుకోవచ్చు. అంతమాత్రాన వైసిపిలో సమ స్యలు లేకుండా పోలేదు. నెల్లూరు పార్లమెంటుకు మాజీఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డినే అభ్యర్థిగా పెట్టాలా లేక కొత్త అభ్యర్థిని దించాలా అన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు సార్లు పోటీ చేసిన మేకపాటిపై వ్యతిరేకత వుందని, ఆయన బదులు కొత్త ముఖాన్ని తెరమీదకు తేవాలని వైసిపి కార్యకర్తలు కోరుతున్నారు. జిల్లా వైసిపిలో కావలికి అభ్యర్థి ఎంపిక కొంచెం సమస్యగా మారే అవకాశం వుంది. ఈ సీటు కోసం సిటింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో పాటు మాజీఎమ్మెల్యేలు వంటేరు వేణుగోపాలరెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిలు కూడా పోటీ పడుతున్నారు. ఈసారి ప్రతాప్‌కు సీటిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చేది లేదని మిగతా ఇద్దరు భీష్మిస్తున్నారు. ఈ ముగ్గురినీ సమన్వయ పరచి అభ్యర్థిని ఎంపిక చేసే పని చాలా కష్టమే కావచ్చు. గూడూరులోనూ సీటుకు పోటీ వుంది. ఇన్‌ఛార్జ్‌ మేరిగ మురళీ సీటును ఆశిస్తుండగా, బత్తిన విజయకుమార్‌ కూడా రేసులో వున్నాడు. వీళ్ళద్దరూ కాకుండా తెరవెనుక మరికొందరు కూడా సీటు ప్రయత్నాలలో వున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు సీటు సిటింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిదా లేక పార్టీలో కొత్తగా చేరనున్న ఆనం రామనారాయణరెడ్డిదా అన్నది తేలాల్సివుంటుంది. వెంకటగిరి అభ్యర్థి ఎంపిక కూడా పార్టీకి పెద్ద సమస్య కానుంది. ఇన్‌ఛార్జ్‌గా వ్యవహ రిస్తున్న జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో పాటు పార్టీలోకి కొత్తగా రానున్న ఆనం రామనారాయణరెడ్డి, నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిల పేర్లు కూడా ఇక్కడ ప్రచారంలో వుండడం తెలిసిందే! ఈ సమస్యలు పార్టీకేమంత నష్టం కలిగించేది కాకపోయినా జిల్లాలో ఒక కమిటీని వేసి సమన్వయం కుదిర్చే బాధ్యతను వారికి అప్పగిస్తే అభ్యర్థుల ఎంపిక సులభంగానే జరిగిపోతుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here