Home జిల్లా వార్తలు జిల్లా ‘దేశం’లో కొన్ని చోట్ల క్లియరెన్స్‌.. ఒకటి రెండు చోట్ల న్యూసెన్స్‌

జిల్లా ‘దేశం’లో కొన్ని చోట్ల క్లియరెన్స్‌.. ఒకటి రెండు చోట్ల న్యూసెన్స్‌

జిల్లాలోని పది అసెంబ్లీలకుగాను పలు స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. గతంలోనే నెల్లూరు నగరానికి మంత్రి పి.నారాయణను, నెల్లూరు రూరల్‌కు మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని, సర్వేపల్లికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఖరారు చేయగా ఆ తర్వాత గూడూరుకు సిటింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ను, వెంకటగిరికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను, ఆత్మకూరుకు బొల్లినేని కృష్ణయ్యను, కోవూరుకు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఖరారు చేశారు.

ఇక సూళ్లూరుపేట, కావలి, ఉదయగిరి సీట్లే తేలాల్సివుంది. సూళ్లూరుపేటలో మాజీమంత్రి పరసా రత్నం వున్నప్పటికీ ఈసారి పోటీకి ఆయన సరిపోడనే ప్రచారం ఎక్కువుగా వుంది. పార్టీలో ఎక్కువ మంది ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా! ఆయనను కాదంటే ఎవరికివ్వాలో ఇంకా అర్ధంకాని పరిస్థితి సూళ్లూరుపేట టీడీపీలో నెలకొంది.

కావలి టిడిపికి అయితే బీద మస్తాన్‌రావుకు మించిన అభ్యర్థి లేడు. సోమిరెడ్డి, నారాయణ, ఆదాలతో పాటే కావలికి బీదను ప్రకటించివుండాలి. కాకపోతే బీద మస్తాన్‌రావును నెల్లూరు లేదా ఒంగోలు పార్లమెంటుకు పంపించాలనే ఆలోచనలో చంద్రబాబు వున్నట్లు తెలుస్తోంది. బీదను లోక్‌సభకు పంపించి, వైసిపికి రాజీనామా చేసిన మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి కావలి సీటు ఇవ్వాలనే ప్రతిపాదన వుంది. మరి బీద మస్తాన్‌రావు కావలిని వదులుకుంటాడా?

ఉదయగిరిలో మాత్రం సిటింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును మార్చడం మాత్రం ఖాయమనిపిస్తోంది. ఆయన మీద పలు అవినీతి ఆరోపణలు రావడంతో పాటు, నియోజకవర్గంలో మెజార్టీ నాయకులు ఆయనకు మళ్లీ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన బదులు ‘రెడ్డి’ సామాజికవర్గం నుండి అభ్యర్థిని దించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, డిసిసిబి ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిల పేర్లు పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది.

తిరుగుబాట్లు తప్పవా?

జిల్లాలో ఒక ఎంపి, పది అసెంబ్లీ స్థానాలకు ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తికాలేదు. ఇరు పార్టీలలో కొన్ని సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యారు. టిక్కెట్లు రానివాళ్ళు ఈసారి తమ పార్టీలపై తిరుగుబాటు జెండా ఎగురవేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తిరుగుబాటుదారులు వైసిపిలో కంటే కూడా తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువుగా వుండడం గమనార్హం.

వైసిపిలో ఒక్క కావలి సీటు విషయంలో తప్పితే ఎక్కడా అలకలు లేవు, తిరుగుబాట్లు లేవు. వెంకటగిరి సీటు లేదని తెలిసి ఇంతకుమునుపే జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘ వేంద్రరెడ్డి వైసిపికి రాజీనామా చేసేసున్నాడు. ఇప్పుడు కావలిలో తాము వద్దంటున్నా సిటింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి సీటిస్తున్నారని చెప్పి మాజీఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాలరెడ్డిలు అలిగి వైసిపికి రాజీనామా చేశారు.

ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి సీటివ్వొ ద్దంటూ కొందరు మండలస్థాయి నాయకులు పోరాడు తున్నారు. అయితే ఈ సీటు నాకే కావాలని ఇంకే వైసిపి నాయకుడు కూడా బలంగా పట్టుబట్టడం లేదు. కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు.

తెలుగుదేశంలో చూస్తే… కోవూరు సీటును పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఇవ్వడంతో పార్టీకి రాజీనామా చేసే ఆలో చనలో పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఉన్నారు.

ఉదయగిరిలో సిటింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకే మళ్ళీ సీటిస్తే ద్వితీయశ్రేణి నాయకులు చాలామంది పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు లేకపోలేదు.

గూడూరు, ఆత్మకూరు నియోజకవర్గాలలోనూ తెలుగు దేశంలో అసమ్మతి స్వరాలు, తిరుగుబాట్లు ఎక్కువే వుండొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here