Home జిల్లా వార్తలు జిల్లాలో… నాలుగు నగర పంచాయితీలు

జిల్లాలో… నాలుగు నగర పంచాయితీలు

జిల్లాలో మరో నాలుగు మేజర్‌ పంచాయితీలు నగర పంచాయితీలుగా మారనున్నాయి. రాష్ట్ర మున్సిపల్‌, పంచాయితీ రాజ్‌ మంత్రుల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం, వింజమూరు, కోట, అల్లూరులు నగర పంచాయితీలు కానున్నాయి. ఈసారి వీటిలో పంచాయితీలతో పాటు కాకుండా మున్సిపాల్టీలతో పాటు పార్టీల గుర్తుల మీదే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.

జిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్‌ నివేదిక పంపారు. దీని ప్రకారం బుచ్చి, కోట, పొదలకూరు, రాపూరు ఉదయగిరి, అల్లూరు, వింజమూరు, కోవూరులను మున్సిపాల్టీలుగా మార్చడానికి అవకాశం వుందంటూ ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల వరకు నాలుగు మేజర్‌ పంచాయితీలనే నగర పంచాయితీలుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బుచ్చిరెడ్డిపాలెంతో పాటు చుట్టుపక్కల వున్న వేపూరు, కట్టుబడిపాలెం, ఇస్కపాలెం, పల్లెపాలెం పంచాయితీలను కలిపి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీ ఏర్పాటు కానుంది. కోటతో పాటు జరుగుమల్లి, కొక్కుపాడు, తిమ్మానాయుడుపల్లి, గూడలి, వెంకన్నపాలెం, విద్యానగర్‌ పంచాయితీలను కలుపుకుని కోట నగర పంచాయితీ ఏర్పాటు కానుంది. అల్లూరు నగర పంచాయితీలో అల్లూరు, సింగపేట, నార్త్‌మోపూరు పంచాయితీలను కలిపారు. ప్రస్తుతం మేజర్‌ పంచాయితీగా వున్న వింజమూరులో మాత్రం ఏ పంచాయితీలను విలీనం చేయకుండానే నగర పంచాయితీగా మార్చనున్నారు.

జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్‌, గూడూరు, కావలి, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట మున్సిపాల్టీలు వుండగా, నాయుడుపేట మాత్రమే నగర పంచాయితీగా వుంది. ఇప్పుడు జిల్లాలో కొత్తగా మరో నాలుగు నగర పంచాయితీలు ఏర్పాటవుతాయి. దీనివల్ల మున్సిపల్‌ ఎన్నికలు జరిగితే జిల్లాలో 9అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల హడావిడి వుంటుంది. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో తప్పితే మిగిలిన 9 నియోజకవర్గాలలో మున్సిపాల్టీయో, నగర పంచాయితీయో ఏదో ఒకటి ఉన్నట్లే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here