Home జాతీయ వార్తలు జయహో భారత్‌

జయహో భారత్‌

దమ్మున్నోడు నాయకుడైతే దెబ్బ ఇలానే వుంటుంది. దేశభక్తినే ఒంట్లో రక్తంగా మలచుకున్నోడు పాలకుడైతే ప్రతీకారం ఇలాగే వుంటుంది. గాంధీ పుట్టిన దేశం, గాంధీలు ఏలిన దేశం అని చెప్పి అందరూ గాంధీల మాదిరిగా వుండరు. ఇది వీరశివాజీ పుట్టిన నేల కూడా! రాణాప్రతాప్‌సింగ్‌ వంటి ధీరులకు జన్మనిచ్చిన నేల! ఆ వీరుల స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న వాళ్ళు కూడా వుంటారు! శాంతికి, సహనానికి గౌతమ బుద్ధుడు, గాంధీలు ఈ భూమికి స్ఫూర్తిదాతలైతే, యుద్ధానికి, వీరత్వానికి శివాజీ, రాణాప్రతాప్‌లు ఆదర్శమూర్తులు.

భారతదేశంలో ఇప్పుడున్నది నెహ్రూ వారసత్వ నాయకత్వం కాదు. బాల్యం నుండే జాతీయ భావాలను వంటబట్టించుకుని, నరనరాన దేశభక్తిని నింపుకున్న భారతీయ జనతా ప్రభుత్వం. దాదాపు 600 ఏళ్ళుగా భారతీయ సంస్కృతిపై విదేశీయులు చేసిన దాడులను పదేపదే గుర్తు చేసుకుంటూ, స్వాతంత్య్రం తర్వాత కూడా స్వధర్మానికి లౌకికవాదం ముసుగులో స్వదేశీనేతలు చేస్తున్న విద్రోహాన్ని తలచుకుంటూ పగతో రగిలిపోతున్న జాతీయవాదుల ప్రభుత్వం. పాకిస్థాన్‌ అంటేనే ఒంటికాలిపై కయ్యానికి దూకే కమలసైనికుల ప్రభుత్వం. ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం పుల్వామా వద్ద జాతీయ రహదారిపై జైష్‌ ఇ మహ్మద్‌ అనే పాక్‌ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్‌ జవానులు వీరమరణం పొందారు. ఈ సంఘటన జరిగినప్పుడు మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా వుండుంటే…. లేదా కాంగ్రెస్‌ ప్రభుత్వమే వుండుంటే ఏం జరిగి వుండేది. ప్రధాని ఈ దాడిని తీవ్రంగా ఖండించేవాడు. ఉగ్ర వాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని ప్రకటించి ఉండేవాడు. ఉగ్రవాద సంస్థలను నిర్మూలించాలని పాకిస్థాన్‌ ప్రధానికి ఫోన్‌ చేసుండేవాడు. దాడి పట్ల పాక్‌ ప్రధాని కూడా సంతాపం తెలుపుండేవాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జాతి యావత్తు ఒక్కటిగా వుండాలని గంభీర ప్రకటనలు వెలువడేవి. జవానుల ఆత్మలకు శాంతి కలగాలంటూ దేశవ్యాప్తంగా కొవ్వొత్తులతో ర్యాలీలు జరిగేవి.

మరి బీజేపీ ఏలుబడిలో నరేంద్ర మోడీ లాంటి ధీరోదాత్తుడి పాలనలో కూడా జవాన్‌ల ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీలు జరిగితే కాంగ్రెస్‌ విదేశీభక్తికి, బీజేపీ స్వదేశీ భక్తికి తేడా ఏముంటుంది? అందుకే మోడీ ఆ తేడా చూపించాడు. జవాన్‌ల ఆత్మశాంతి కోసం కొవ్వొత్తుల ర్యాలీలను కాదు, పాకిస్థాన్‌ వైపు మిరాజ్‌-2000 యుద్ధ విమానాల ర్యాలీని నిర్వహించాడు. ఫిబ్రవరి 26వ తేదీన పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైష్‌ ఇ మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. 350మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కేవలం 12మంది ఫైలట్లతోనే పని కానిచ్చారు. కేవలం 22నిముషాలలోనే పాకిస్థాన్‌కు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం ఇవ్వకుండానే పని పూర్తి చేశారు.

శాంతించిన మనసులు…

26వ తేదీ ఉదయం దేశమంతటా పండుగ వాతావరణమే. చీకటి పోయి వెలుతురు వచ్చినంత ఆనందం. పుల్వామా దాడితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారతీయులు ఈ దాడితో కుదుటపడ్డారు. వారి మనసులు శాంతించాయి. భారత ఆర్మీ అమరజవాన్‌లకు ఈ దాడితో అసలైన నివాళులర్పించింది.

పెరిగిన మోడీ ఇమేజ్‌!

రైల్వేస్టేషన్‌లో టీ అమ్ముకునే స్థాయి నుండి ప్రధాని స్థాయికి ఎదిగిన నాయకుడు నరేంద్ర మోడీ. ఎప్పుడు ఏం చేయాలో తెలిసినోడు. ఒక్క దాడితో అటు పాకిస్థాన్‌ నోరు తెరిచేలా చేశాడు… ఇటు దేశీ యంగా ప్రతిపక్షాల నోర్లు మూయించాడు. ఒకే ఒక్క ఎయిర్‌ స్ట్రైక్‌తో అటు శత్రు దేశానికి, ఇటు రాజకీయ శత్రువులకు హార్ట్‌ఎటాక్‌ వచ్చేలా చేశాడు. ఎయిర్‌ స్ట్రైక్‌తో ప్రధాని మోడీ ఇమేజ్‌ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగింది. దేశాన్ని నడిపించడానికి ఆయనే సమర్ధుడు అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఇంకెవరు ప్రధానిగా వున్నా ఇంత ధైర్యంగా, ఇంత సమర్ధవంతంగా నిర్ణయాలు తీసుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గుట్టు చప్పుడు కాకుండా!

పుల్వామా దాడి జరిగిన వెంటనే ప్రధాని మోడీ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ప్రతీకార చర్య ప్లానింగ్‌ అవకాశం వాళ్లకే ఇచ్చాడు. ఆర్మీ కూడా చాలా పకడ్బందీగా దాడి వ్యూహరచన చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పర్యవేక్షణలో మెరుపుదాడికి మార్గ నిర్దేశనం జరిగింది. మెరికల్లాంటి పైలట్లను దాడికి ఎంపిక చేశారు. పాకిస్థాన్‌ రాడార్లకు కూడా అందకుండా భారత యుద్ధ విమానాలు నేరుగా వెళ్లి పని పూర్తి చేసి వచ్చాయి. 12వ విమానం తిరిగొచ్చే వరకు ప్రధాని మోడీ దాడిని పర్యవేక్షిస్తుండిపోయాడు.

ప్రపంచ దేశాల దన్ను..

గత నాలుగున్నరేళ్ళుగా ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై విపక్షాలు చాలా విమర్శలు చేశాయి. ఆయన విదేశాలకు పోయి ఏం ఉద్ధరిస్తున్నాడని సన్నాయి నొక్కులు నొక్కాయి. ఆయన విదేశీ పర్యటనల పర్యవసానమేమిటన్నది, దేశానికి వచ్చిన పెట్టుబడులతోనే కాదు, పుల్వామా దాడి, ఆపై పిఓకెలోని ఉగ్ర శిబిరాలపై భారత్‌ మెరుపుదాడులతోనూ అర్ధమైంది. ఈ రెండు సంఘటనలలోనూ ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు బాసటగా నిలిచాయి. పిఓకెపై దాడి విషయంలో ఏ దేశం కూడా పాకిస్థాన్‌కు సానుభూతి తెలుపలేదు సరికదా, ముందు మీ దేశంలో వున్న ఉగ్రశిబిరాలను నిర్మూలించండంటూ ఆ దేశానికే హితబోధ చేశాయి.

రాజకీయంగా కలిసొస్తుందా?

పిఓకెలోని ఉగ్రశిబిరాలపై భారత్‌ మెరుపుదాడులతో భారత దేశంలోని కొందరు రాజకీయ నాయకులకు సంకటస్థితి ఏర్పడింది. ఓ పక్క జవానులను అభినందిస్తూ వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు. ఇంకోపక్క ఇది ఎక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి రాజకీయ మైలేజీగా మారుతుందోనని ఆందోళన చెందుతున్నారు. వీళ్ళది ఏడవాలో, నవ్వాలో తెలియని పరిస్థితి.

విడివిడిగా పోటీ చేస్తే నరేంద్రమోడీని ఎదుర్కోవడం కష్టం అంటూ ఇటీవల దేశవ్యాప్తంగా కూడా బీజేపీయేతర పార్టీలు ఒక కూటమి కట్టాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలో ఎస్పీ, బిఎస్పీ, తెలుగుదేశం, ఎన్సీపీ, టిఎంసి, దళ్‌(ఎస్‌), డిఎంకె, ఆర్జేడి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, వామపక్షాలు వంటి పలు పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా మోడీని మట్టి కరిపించాలని కలలు కంటున్నాయి. ఈ కూటమికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మార్గనిర్దేశం చేస్తూ వచ్చాడు. నోట్ల రద్దు, జిఎస్టీ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, మోడీపై వ్యతిరేకత పెంచి బీజేపీని ఓడించాలన్నది వీరి పన్నాగం. కాని, నిన్నటి ఎయిర్‌ స్ట్రైక్‌తో మోడీ పని ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లుగా అయింది. అటు పాకిస్థాన్‌కు గట్టి సమాధానమిచ్చాడు, ఇటు ప్రతిపక్షాలకు మింగుడుపడకుండా చేశాడు. మోడీ ఎయిర్‌స్ట్రైక్‌కు ప్రత్యర్థులందరూ జైకొట్టాల్సి వచ్చింది!

యుద్ధ సన్నాహాల్లో ఇరు దేశాలు…

భారత్‌ మెరుపు దాడితో పాక్‌కు తల కొట్టేసినట్లు అయ్యింది. పాక్‌ పార్లమెంటులో ఇమ్రాన్‌ఖాన్‌ పరువు పోయింది. దీంతో మేము కూడా ప్రతిదాడి చేయగలమని చెప్పుకోవడానికన్నట్లు ఫిబ్రవరి 27వ తేదీన పాక్‌ యుద్ధవిమానాలు నియంత్రణ రేఖను దాటి భారత్‌ భూ భాగంలోకి వచ్చి బాంబులు వేయగా, భారత వైమానిక దళాలు ఆ విమానాలను తిప్పి కొట్టాయి. ఒక విమానాన్ని కూల్చేశాయి. ఈ క్రమంలోనే భారత యుద్ధ విమానం ఒకటి కూలిపోగా, పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ పారాచ్యూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగాడు. పాక్‌ దళాలు అభినందన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. ఈ సంఘటనతో భారత్‌ ఆర్మీ పూర్తిగా యుద్ధానికి సన్నద్ధమైంది. మరోపక్క పాకిస్థాన్‌ అధ్యక్షుడు మాత్రం కూర్చొని చర్చలు జరపుదామంటూ శాంతి వచనాలు వల్లిస్తున్నాడు. శాంతి నెలకొంటుందో..? లేక యుద్ధమే జరుగుతుందో..? చూడాలి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here