Home రాష్ట్రీయ వార్తలు జన నాయకుడు

జన నాయకుడు

భారతదేశ రాజకీయ చరిత్రలో ఇదొక అధ్యాయం. ఒక నాయకుడు ప్రజలతో ఎంతగా మమేకమయ్యాడనడానికి ఇదొక చారిత్రక సత్యం. ఒకే ఒక నాయకుడు… 341 రోజులు… 3,648కిలోమీటర్లు… 134 నియోజకవర్గాలు… 231 మండలాలు… 2,516 గ్రామాలు… ఎండని లేదు, వానని ఆగలేదు, చలిని లెక్కచేయలేదు… జనహితమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా పల్లెపల్లెనా ప్రజలను పలుకరిస్తూ, ప్రతి ఒక్కరి వెన్ను తడుతూ, మీకు అండగా నేనున్నాననే భరోసా కల్పిస్తూ… నాలుగున్నర పదుల వయసులో వున్న ఓ యువనాయకుడు సాగించిన అద్వితీయ, అమోఘ ప్రజాప్రస్థాన సంకల్పానికి సాక్ష్యం ఈ అంకెలు. దేశ చరిత్రలోనే ఇంతవరకూ ఏ నాయకుడూ నడవనన్ని కిలోమీటర్లు పాదయాత్ర… ఒకే ఏడాదిలో ఏ నాయకుడూ చుట్టనన్ని నియోజకవర్గాలు… ఏ నాయకుడూ కాలు పెట్టలేనన్ని గ్రామాలు… ఏ నాయకుడూ ప్రసంగించలేనన్ని బహిరంగ సభలు… ఒక్క వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమైంది.

ఇదొక చరిత్ర…

రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అపూర్వఘట్టానికి 9వ తేదీ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వేదికగా నిలిచింది. 2017 నవంబర్‌ 6వ తేదీన వైయస్సార్‌ కడప జిల్లా వేముల మండలం లోని ఇడుపులపాయలో దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి స్మృతి చిహ్నం వద్ద మొదలైన వై.యస్‌.జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర 2019 జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. దేశ చరిత్రలోనే ఇంత సుదీర్ఘ పాదయాత్ర ఇంతవరకూ ఎవరూ చేయలేదు. వైయస్సార్‌ జిల్లా నుండి మొదలైన ప్రజాసంకల్ప పాదయాత్ర కర్నూలు, అనంత పురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల మీదుగా సాగి శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. 2003లో దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి నల్గొండ జిల్లా చేవెళ్ళ నుండి పాదయాత్ర మొదలుపెట్టి సరిగ్గా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛా పురం వద్దనే ముగించాడు. జగన్‌ కూడా తండ్రి సెంటిమెంట్‌నే గౌరవిస్తూ ఇచ్చాఫురంను తన పాదయాత్ర చివరి మజీలికి వేదికగా మార్చుకున్నాడు. తండ్రి సెంటిమెంట్‌ను అనుసరిస్తూనే పాదయాత్ర ముగిసిన పక్కరోజే తిరుపతిలోని అలిపిరి నుండి కాలి నడకన ఏడుకొండలెక్కి సామాన్య భక్తుడిలా సర్వదర్శనం క్యూలో వెళ్లి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నాడు.

తండ్రి అడుగుజాడల్లోనే తనయుడు

2003లో దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ప్రజలకు ఆయనను చేరువ చేసింది. ఆ పాదయాత్ర ద్వారా ఆయన తనను తాను ఓ గొప్ప ప్రజా నాయకుడుగా మలచుకున్నాడు. ఆ పాదయాత్రలో ప్రజా సమస్యలను, వారు పడుతున్న బాధలను చాలా దగ్గర నుండి చూశాడు. ఆ సమస్యలను చూశాడు కాబట్టే ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆ సమస్యలకు పరిష్కారం అన్నట్లు జలయజ్ఞం, ఉచిత కరెంట్‌, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వంటి అద్భుత పథకాలు ఆవిష్కరించబడ్డాయి.

జాతీయ శక్తులనే ఢీ కొట్టాడు

రాజశేఖరరెడ్డితో పోలిస్తే జగన్‌కు రాజకీయ అనుభవం తక్కువ. విద్యార్థి దశ నుండి రాజకీయాలపై అవగాహన వున్న నాయకుడు రాజశేఖరరెడ్డి. కాని జగన్‌ పరిస్థితి అది కాదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగిందే 2009 ఎన్నికల ద్వారా! ఆ ఎన్నికల్లో కడప లోక్‌సభ నుండి గెలుపొందాడు. ఆ ఏడాది సెప్టెంబర్‌లోనే వై.యస్‌ మరణించాడు. తన తండ్రి మరణం తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించ డానికి ఓదార్పుయాత్రతో బయలుదేరిన జగన్‌కు సోనియాగాంధీ మోకాలడ్డింది. అయినా జగన్‌ అధిష్టానాన్ని ధిక్కరించాడు. 2011లో కాంగ్రెస్‌ నుండి బయటకొచ్చేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించాడు. జగన్‌పై కక్ష గట్టిన సోనియాగాంధీ అక్రమ ఆస్తుల కేసులు పెట్టించింది. జగన్‌పై కుట్రలో కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో పాటు తెలుగుదేశం నాయకులు కలిశారు. ఛార్జిషీట్లను బలంగా పెట్టించి 16నెలలు జైలులో వుంచినా జగన్‌ వెన్ను చూపలేదు. సోనియాగాంధీని శరణు కోరలేదు. కష్టాలకు ఎదురొడ్డి నిలిచాడు. 2014 ఎన్నికల్లో అయితే జగన్‌ ఒక్కడే ఒక వైపు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, మీడియా అంతా ఒక వైపు. అయినా వీరోచితంగా పోరాడాడు. కేవలం తక్కువ శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయినా తన సొంత శక్తితో 67మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. 2014 నుండి ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎన్నో పరిణామాలు జరిగాయి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకప్యాకేజీ చాలనుకుంటే, హోదా ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది జగనే! ఆయన ఏ క్షణాన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ పెట్టాడోగాని… ఆ క్షణం నుండి ప్రజల మధ్యే తిరుగుతున్నాడు. ప్రజల కోసమే తిరుగుతున్నాడు. ప్రజల మనిషిగా మారిపోయాడు.

పట్టుదలలో తండ్రిని మించాడు…

వై.యస్‌.ను అందరూ మొండోడు అంటారు. వై.యస్‌.కి పదింతల మొండితనం జగన్‌ది. కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం వరకు అందరి కుట్రలకు, అందరి ఎదురుదాడులకు ఎదురెళ్ళి పోరాడాడు. మొండిగా నిలబడ్డాడు. ప్రజలను నమ్ముకుని ఆ ప్రజల తరపున పోరాటం చేస్తున్నాడు. మరి ఆ ప్రజలు ఈసారి జగన్‌ను ఏమి చేయబోతున్నారన్నది చూడాల్సిందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here