Home సంపాదకీయం ‘జన్యు’ తిండితో తిప్పలెన్నో!

‘జన్యు’ తిండితో తిప్పలెన్నో!

మనిషి బతికేందుకు ఆహారం తప్పనిసరి. అయితే, ఇప్పుడు వస్తున్న కల్తీ ఆహారం తింటూ ఉంటే.. ఇక బతుకే సరి. ఎప్పుడు ఏ జబ్బుతో ఈ జీవితప్రయాణం ఆగిపోతుందో తెలియని పరిస్థితి. చుట్టూ వాతావరణ కాలుష్యం, ఎటు చూసినా కల్తీదే రాజ్యం. మంచి ఆహారం ఆరోగ్యానికి తరగని సిరి. అలాంటి స్వచ్ఛమైన ఆహారం ఇప్పుడు కలికానికి కూడా కనిపించడం లేదు. కల్తీ కానిదీ, కాలుష్యం లేని పదార్ధమేదీ కనిపించడం లేదు. ఎటుచూసినా కల్తీ-కాలుష్యమే తాండవిస్తోన్న నేటి పరిస్థితుల్లో మనం పీల్చే గాలీ, తాగే నీరూ అన్నీ కలుషితమేనని వేరేచెప్పనక్కరలేదు. అయితే, తినే తిండి కూడా కల్తీమయం అవుతుండడమే బాధాకరం. కల్తీ ఆహారపదార్ధాలు తిని నానా రకాల రోగాల బారిని పడుతున్న ప్రజలు కొల్లలుగానే ఉంటున్నారు. అధిక ఉత్పత్తులు సాధించి, అధిక మొత్తాలను ఆర్జించాలనే ఆరాటంతో సర్వత్రా కృత్రిమ విధానాలు పెరిగిపోతున్నాయి. ఒక పద్ధతీ పాడూ లేకుండా పంటపొలాల్లో విచ్చల విడిగా రసాయనాలు వినియోగిస్తుండడం, చిత్తం వచ్చిన రీతిగా పురుగుమందులు వాడేస్తుండడంతో అవి చివరికి ఆయా పంటల ఉత్పత్తుల్లోకి చేరుకుని ఆహారపదార్ధాలు క్రమేణా రోగపదార్ధాలుగా తయా రవుతున్నాయి. చివరికి కాయల్లో పచ్చదనం అలాగే ఉన్నట్లు కనిపించడానికి, పండ్లు తాజాగానే ఉన్నా యనిపించడానికి కూడా రకరకాల రసాయన మందులు వాడే మాయదారి కల్తీకాలం దాపురించింది.

ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు జన్యుమార్పిడితో ఆహారపదార్ధాల ఉత్పత్తిని ఘనంగా సాధించవచ్చనే ధోరణి ప్రపంచవ్యాప్తంగా ప్రబలిపోతోంది. జన్యు మార్పిడి వల్ల అధిక ఉత్పత్తులు లభిస్తాయని అనేక దేశాల్లో ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగాలు ఇప్పటికే ఆయా దేశాల్లో భారీగానే జరుగుతున్నాయి కూడా. పాల ఉత్పత్తిని పెంచేందుకు ఆవులు, గేదెలపై పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధరకాల మొక్కలు, కోళ్ళు. పందులు మొదలగు వాటిమీద కూడా ఈ పరిశోధనలు దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. జన్యుమార్పిడి ద్వారా కొత్తరకం మొక్కలు సృష్టించేస్తున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇలాంటి జన్యుమార్పిడి పద్ధతులతో ఆహారపు పంటలు పండించడం జరుగుతోందని గణాంకాలు చెప్తున్నాయి. ఇదేవిధంగా పలు దేశాల్లో జన్యుమార్పిడి మొక్కజొన్న కూడా పండిస్తున్నారు. అయితే, ఈ జన్యుమార్పిడి మొక్కజొన్న ఆశించినంత ఆరోగ్యకరం కాదని, విషపూరితమైనదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మొక్కజొన్నను అనేక దేశాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయని, కానీ వాటి వాడకం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని, అది విషాహారం వంటిదని నిపుణుల పరిశీలనలు సూచిస్తున్నాయి. తొలుత, జన్యుమార్పిడి పదార్ధాలను ఆవులు, పందులు, చేపల్లో ప్రయోగించగా, ఆ ఆహారాన్ని అవి తిన్నప్పుడు ఆయా జంతువుల్లో కడుపు ఉబ్బరంగా ఉండడం, పేగుల్లో వాపు ఏర్పడడం వంటి సమస్యలను శాస్త్రవేత్తలు గుర్తించారట. కనుక అవి మనకూ హానికరమే నంటున్నారు. జన్యుమార్పిడి చేసిన మొక్కలు అధిక దిగుబడి ఇస్తాయని వ్యాపారవర్గాలు చెప్తుంటాయి కానీ, వాటికి క్రిమిసంహారక మందులు విపరీతంగా వాడాల్సివుంటుందని, అందువల్ల అటు భూమికి, ఇటు మొక్కలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇన్ని అవస్తలు పడి జన్యుమార్పిడి మొక్కలను పెంచినా వాటి ఉత్పత్తులను వాడినందువల్ల చివరికి అనారోగ్యమే కానీ ఆరోగ్యం ఉండదు. మనం ఆరోగ్యాన్ని పండించుకోవాలి కానీ.. అనారోగ్యాన్ని కాదనే విషయం గుర్తుంచు కోవాలి. మనదేశంలోనూ ఇలాంటి జన్యుమార్పిడి ద్వారా కొన్నిప్రాంతాల్లో పలురకాల పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, వీటిని మన ప్రభుత్వాలు ఎంతవరకు అనుమతిస్తాయో వేచిచూడాల్సిందే. ఎందుకంటే, రోగాలకు కారణమయ్యే ఎలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించకపోవడమే అన్నివిధాలా మేలు. నిపుణులు, శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో పరిశీలించిన పిదపే ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలను మార్కెట్లలోకి అనుమతించాలే తప్ప అనారోగ్యకరమైన పదార్ధాలను అనుమతించడం శ్రేయస్కరం కాదు. ఇప్పటికే మనదేశంలో రకరకాల రోగాలు నానాటికీ విపరీతంగా పెరుగుతుండడానికి ఆహారోత్పత్తుల్లో వాడుతున్న కృత్రిమపదార్ధాలు, కల్తీ పదార్ధాలు ప్రధానకారణమని వేరే చెప్పనక్కరలేదు. అందువల్ల ఆహారపదార్ధాలకు సంబంధించి పూర్తి స్థాయి పరిశీలనలు ఎల్లవేళలా జరుగుతూనే ఉండాలి. రసాయనాలు, పురుగుమందుల వాడకం తగ్గించాలి. కల్తీలు నివారించాలి. ప్రకృతిసహజమైన పద్ధతుల్లో ఆహారపదార్ధాలను తయారుచేసుకోవాలే తప్ప కృత్రిమ పద్ధతులను అవలంభించడం అనారోగ్యానికి ద్వారాలు తెరిచినట్లే. ఈ నేపథ్యంలో, జన్యుమార్పిడి ఆహారం వల్ల భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఎంతైనా ఉందనే నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి అనారోగ్యకర విధానాల వల్ల కొత్తకొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, జంతువులు, పక్షులు, కోళ్ళు, సముద్రజీవాలపై జన్యుమార్పిడి ప్రభావం ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాక, గుండెజబ్బులు, హార్మోన్లలో ఇబ్బందులు, అధికబరువు, పెద్దపేగుల్లో వాపు, ఊపిరితిత్తుల సమస్య ఇలా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ఆహారం కలుషితం కాకుండా, స్వచ్ఛమైనదిగా ఉండేలా చూసుకోవాలి. మనం తినే ఆహారాన్ని సహజమైన పద్ధతుల్లోనే తయారుచేసుకోవాలి తప్ప కృత్రిమ పద్ధతులు ఎప్పటికీ శ్రేయస్కరం కాదు. ఇతర రంగాల్లో అధునాతన పద్ధతుల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ, ఆహారపదార్ధాల విషయంలో మాత్రం ఎలాంటి ఏమరుపాటు పనికిరాదు.

మనిషికి ఆరోగ్యమే ప్రధానం. కలుషిత వాతావరణం, అనారోగ్యకర ఆహారం ఒక్కోసారి మనిషికి ప్రాణసంకటమవుతుంది. ప్రకృతి విరుద్ధంగా వ్యవహరించక ప్రకృతి సహజమైన పద్ధతుల్లోనే స్వచ్ఛమైన ఆహారం తయారుచేసుకోవడం వల్లనే ఆరోగ్యం సాధ్యమవుతుంది. అప్పుడే ఆయుష్యు కూడా పెరుగుతుంది. ఆరోగ్యం ఎంత మహాభాగ్యమో అప్పుడు రుజువవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here